
నిరాశపడవలసిన అవసరంలేదు: వాసిరెడ్డి పద్మ
రాష్ట్ర విభజన అయిపోయిందని ఎవరూ నిరాశపడవలసిన అవసరంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజన అయిపోయిందని ఎవరూ నిరాశపడవలసిన అవసరంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లవలసిన సమయం ఇదేనన్నారు.
చేయవలసినంత పాపం చేసి ఇప్పుడు విభజన అయిపోయింది, ఇక తాము అడ్డుకోలేం అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని విమర్శించారు. ఒక పక్క అందరూ ఒప్పుకున్న తరువాతే సిడబ్ల్యూసి నిర్ణయం జరిగిందని అధిష్టానం నేతలు చెబుతున్నారని, మరో పక్క కాంగ్రెస్ మోసం చేసిందని ఇక్కడి నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అధిష్టానం కనుసన్నల్లో ఉంటామని చెప్పిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఇలా మాట్లాడటం ఎవరిని మోసం చేయడానికి అని అడిగారు.వారి మాటల్లో విశ్వసనీయత లేదని విమర్శించారు. సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న తరువాత ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామాలు చేయలేదు అని ప్రశ్నించారు. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న ఓ పెద్ద డ్రామా అన్నారు.
చంద్రబాబు నాయుడు విభజన జరగాలి, న్యాయం జరగాలి అంటారు. సమైక్యత అనే మాటే ఆయన ఎత్తరని విమర్శించారు. టిడిపి నేతలు చంద్రబాబు ఫొటో పెట్టుకొని తెలంగాణలో ఒక విధంగా, సీమాంధ్రలో ఒక విధంగా వ్యవహరిస్తున్నారన్నారు.