ఇసుక కొరతకు ఇక చెల్లు!

New Sand Policy In Vizianagaram District - Sakshi

కొత్త ఇసుక విధానానికి అధికార యంత్రాంగం కసరత్తు

బొబ్బిలి, సాలూరుల్లో రెండు స్టాక్‌పాయింట్ల గుర్తింపు

పదెకరాల స్థలం అప్పగించిన రెవెన్యూ శాఖ

కొమరాడ, జియ్యమ్మవలసల్లో ఇసుక నిల్వల గుర్తింపు

శ్రీకాకుళం జిల్లాలోని రెండు రీచ్‌లు అప్పగించాలని ప్రభుత్వానికి లేఖ

ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా విక్రయం

ఇసుక ఇక సామాన్యునికి అందుబాటులోకి రానుంది. కోరిన వెంటనే అందించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పారదర్శకత కోసం కొత్త ఇసుక విధానం అమలు చేయనున్నారు. ఇప్పటికే దీనికోసం కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో ఇసుక నిల్వలున్నట్టు గుర్తించారు. వాటిని స్టాక్‌ చేసేందుకు సాలూరు, బొబ్బిలిలో రెండు పాయింట్లు గుర్తించి పదెకరాల స్థలాన్ని కేటాయించారు.  కొద్దిరోజులుగా ఇసుక కొరతను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనుకున్న వారి నోళ్లకు ఇక తాళాలు పడనున్నాయి.

సాక్షి, బొబ్బిలి:  రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టనున్న ఇసుక కొత్త పాలసీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి. వచ్చే నెల 5 నాటికి ఇసుక సరఫరాను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇసుక విధానం అమలు చేసేందుకు సంబంధిత శాఖల కమిటీ ఇప్పటికే జిల్లాలోని రీచ్‌లను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ప్రభుత్వం ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తగిన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఇందుకోసం జిల్లాలో 62 ఇసుక రీచ్‌లు ఉండగా ఇందులో 55 ప్రాంతాల్లో ఇసుక నిల్వలను సంబంధిత శాఖాధికారులు గుర్తించారు. ఈ ఇసుక నిల్వలు ఎంత మేరకు తవ్వాల్సి ఉంటుందన్నది ఇప్పుడు  చర్చిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని ఈ కొత్త ఇసుక పాలసీని నిర్ణీత సమయానికి ప్రారంభించేందుకు ఆయా శాఖలు పనిలో పడ్డాయి. 

ఒక్కో స్టాక్‌పాయింట్‌కు ఐదు ఎకరాలు..
జిల్లాలో ఇసుకను ఇతర ప్రాంతాల్లోని రీచ్‌లనుంచి తీసుకువచ్చి స్టాక్‌పాయింట్ల వద్ద నిల్వ చేస్తారు. ఈ పాయింట్ల నుంచి లబ్ధిదారులకు ఇసుకను తరలించేందుకు అనుమతులు జారీ చేస్తారు. జిల్లాలో సాలూరు, బొబ్బిలిలోని గొర్లె సీతారామపురం వద్ద గల ఐదేసి ఎకరాల వంతున స్థలాలను ఆయా తహసీల్దార్లు సిద్ధం చేసి చూపించారు. వీటిని సబ్‌ కలెక్టర్‌ పరిశీలించారు. జిల్లాలోని ఏయే రీచ్‌ల నుంచయినా ఈ పాయింట్ల వద్దకు ఇసుకను లారీలతో తరలించి డంప్‌ చేస్తారు. ఇసుక లభ్యతను బట్టి త్వరలోనే స్టాక్‌పాయింట్లను పెంచే అవకాశం ఉంది. విజయనగరంలో ఇంకా గుర్తించాల్సి ఉంది.

 బ్యాంకులో డీడీ తీసి స్టాక్‌ పాయింట్‌కు వెళితే సరి..
జిల్లాలో గుర్తించిన స్టాక్‌పాయింట్ల నుంచి ఇసుకను తరలించేందుకు బ్యాంకులో డీడీలు తీయాల్సి ఉంటుంది. ఈ డీడీలను అందజేసిన వెంటనే వారికి కూపన్లు వస్తాయి. వాటిని తీసుకుని స్టాక్‌పాయింట్‌కు వెళితే అక్కడ ఇసుకను ఆయా వాహనాలకు పరిమాణాన్ని అనుసరించి అందజేస్తారు.

వ్యాపారులకు, సాధారణ వినియోగదారులకు వేర్వేరు ధరలు..
జిల్లాలోని ఇసుక వినియోగదారులను రెండు రకాలుగా అధికారులు విభజిస్తున్నారు. ఒకటి సాధారణ లబ్ధిదారులు, రెండోది కాంట్రాక్టర్లు. యూనిట్‌ ధరను కాంట్రాక్టర్లకు, సాధారణ వినియోగదారులకు వేర్వేరుగా నిర్ణయించే ప్రక్రియ సాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ఓ యాప్‌ సిద్ధం చేసి ఆ యాప్‌ ద్వారా నమోదు చేసుకుని ఇసుకను తరలించుకునే సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పట్లో యాప్‌ విధానాన్ని అమలు పరిచే అవకాశం లేదు.

శ్రీకాకుళం జిల్లా రీచ్‌లను ఇవ్వాలని లేఖ: 
జిల్లాలో ఇసుక కొరత ఉంది. నదులు, గెడ్డలు, వాగుల్లో ఇప్పటికే ఇసుకను పెద్ద ఎత్తున తరలించేశారు. ఒక మీటరు ఇసుకను తీసుకోవాలంటే 5 మీటర్ల లోతున ఇసుక నిల్వలుండాలి. అలాగే రెండు మీటర్ల లోతున ఇసుకను తవ్వాలంటే 8 మీటర్ల లోతు ఇసుక ఉండాలి. కానీ జిల్లాలో ఇప్పటికే మీటరు లోతున్న ఇసుకను కూడా పూర్తిగా తవ్వేశారు. దీనివల్ల జిల్లాలో ఇసుక కొరత తీవ్ర రూపం దాల్చింది. ఈ కొరతను అధిగమించేందుకు శ్రీకాకుళం జిల్లాలోని సంకిలి సమీపంలోని గోపాలపురం, అన్నవరం ప్రాంతాల్లో ఇసుక లభ్యత బాగానే ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఈ ఇసుక రీచ్‌లను విజయనగరం జిల్లాకు కేటాయించాలని ప్రభుత్వానికి లేఖరాశారు.  ఇవి గాకుండా ఈ జిల్లాలోని కొమరాడ, జియ్యమ్మవలసల్లో అత్యధికంగా ఇసుక నిల్వ లున్నాయి. వీటి నుంచి ప్రభుత్వం ఇసుకను రెండు స్టాక్‌పాయింట్లకు తరలించి ఇసుక కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటోంది.

విక్రయ బాధ్యత ఏపీఎండీసీకే..
జిల్లాలో గుర్తించిన వివిధ రీచ్‌లనుంచి ఇసుకను స్టాక్‌ పాయింట్లకు తరలించాక వాటిని విక్రయించడం, నిర్వహణ బాధ్యతలను ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అప్పగించనున్నారు. స్టాక్‌ పాయింట్‌ స్థలాలను అప్పగించాక వాటికి ప్రహరీగానీ కంచెగానీ ఏర్పాటు చేసుకోవడం పొక్లెయిన్, వాహనాలు, కంప్యూటర్లు, సిబ్బందిని కేటాయించి వారికి పూర్తి స్థాయి నిర్వహణ బాధ్యతను అప్పగించనున్నారు. 

వచ్చే నెల 5 నుంచి ఇసుక సరఫరా.. 
జిల్లాలో వచ్చే నెల 5 నుంచి ఇసుక సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సంబంధిత శాఖలతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఇప్పటికే రెండు చోట్ల స్టాక్‌పాయింట్లు గుర్తించాం. జిల్లాలో ఇసుకను యథేచ్ఛగా తోడేశారు. నిల్వలు తక్కువగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి రెండు రీచ్‌ల కోసం ప్రభుత్వానికి లేఖ రాశాం. ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఇసుక కొరతను తీర్చే ప్రయత్నాల్లో ఉన్నాం.
– డాక్టర్‌ ఎస్‌.వి.రమణారావు, మైన్స్‌ ఏడీ, విజయనగరం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top