పసికందు వద్దకు చేరిన తల్లి.. 

Mother Left Her Baby In Hospital In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : ఆస్పత్రిలో రెండు రోజుల పసికందును వదిలేసి వెళ్లిపోయిన తల్లిని ఎట్టకేలకు వన్‌ టౌన్‌ పోలీసులు మంగళవారం కాకినాడ జీజీహెచ్‌లో వైద్యులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. వారి కథనం ప్రకారం ఒడిశా కోరాపుట్‌కు చెందిన సుమలత, ఆమె తమ్ముడు, అదే ఊరుకు చెందిన జ్యోతి ఏడాది క్రితం పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలోని కానూరులో కోళ్ల ఫారంలో పని చేసేందుకు వచ్చారు. కోళ్లఫారంలో పని చేస్తున్న పార్వతీపురానికి చెందిన యువకుడు పెళ్లికాని  మైనర్‌ సుమలతను గర్భిణిని చేసి ఉడాయించాడు. అతడి కోసం నిరీక్షించిన ఆమె తొమ్మిది మాసాలు గర్భం మోసి ఈ నెల 9వ తేదీన తణుకులోనే పురుడు పోసుకుంది. శిశువు అనారోగ్యంతో పుట్టింది. దీంతో సుమలతతోపాటు ఆ పసికందును కాకినాడ జీజీహెచ్‌కు 10వ తేదీన తీసుకొచ్చారు.

ఈ శిశువును అక్కడ వదిలేసి వారు వెళ్లిపోయారు. ఈ ఘటనపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఎం.రాఘవేంద్రరావు వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాన్ని తణుకులో విచారణ చేసి కానూరులో కోళ్లఫారంలో పని చేస్తున్న సుమలతను తీసుకుని జీజీహెచ్‌కు వచ్చారు. అనారోగ్యంగా ఉన్న పసికందుకు, ఆమెకు వారం రోజుల పాటు వైద్యం అందించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. పసికందుకు పిడియాట్రీక్‌ విభాగాధిపతి ఎంఎస్‌ రాజు నేతృత్వంలో వైద్యం చేస్తున్నారు. మైనర్‌ బాలికను మోసం చేసిన యువకుడిని తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top