గోదావరి ఉగ్రరూపం..

Minister Visits Flood Affected Areas In East Godavari - Sakshi

నాటు పడవలపైనే రాకపోకలు

ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటన

ముమ్మరంగా ప్రభుత్వ సహాయక చర్యలు

సాక్షి, తూర్పుగోదావరి: ఎగువ రాష్ట్ర్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో లంక గ్రామాలు నీట మునిగి.. ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. సీతానగరం మండలం ముంపు ప్రాంతాలను మంత్రులు ఆళ్ల నాని, తానేటి వనిత, కురసాల కన్నబాబు, విశ్వరూప్, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్, చింతా అనురాధ, వంగా గీత, కలెక్టర్ మురళీధర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు.ముంపు ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులను ఆదుకోవడానికి సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసిందని మంత్రులు తెలిపారు. జిల్లాలోని కాజ్ వేల పై నుంచి వరద నీరు ప్రవహించడంతో గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. కొత్తపేట మండలంలోని నారాయణ లంక, అద్దింకి వారి లంక, నక్కావారి పేటతో పాటు.. ఆలమూరు మండలం బడుగువాని లంకకు రాకపోకలు నిలిచిపోయాయి.

నాటు పడవలపై రాకపోకలు..
గోదావరి ఉధృతికి ముమ్మిడివరం నియోజకవర్గంలో లంక గ్రామాలు నీటమునిగాయి. శానలంకా, పశువుల్లంక, శేరులంకా, గురజాపులంక గ్రామాలు జల దిగ్భంధంలో చిక్కుకోవడంతో గ్రామస్తులు నాటు పడవల పై రాకపోకలు సాగిస్తున్నారు. పడవల ద్వారానే నిత్యవసర వస్తువులు సరఫరా అవుతున్నాయి.

యానాన్ని చుట్టిముట్టిన వరద..
కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం ను వరద చుట్టిముట్టింది. యానాం వారధి వద్ద గౌతమినది పాయ ఐదు అడుగుల మేర ఉధృతంగా ప్రవహిస్తోంది. ఓల్డ్ రాజీవ్నగర్, బాలయోగినగర్, వెంకటరత్నం  కాలనీ, పరంపేటలో భారీగా వరద నీరు చేరింది. రాజీవ్ బీచ్ రోడ్డు వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. బాలయోగి రోడ్డుపైకి వరద నీరు చేరుకుంది.

ప్రకాశం బ్యారేజికి వరద ఉధృతి..
కృష్ణా జిల్లా: ప్రకాశం బ్యారేజి కి వరద ఉధృతి కొనసాగుతోంది. పులిచింత ప్రాజెక్ట్ నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటోంది. 42 గేట్లు ఎత్తి 30 వేల 500 క్యూ సెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ప్రవాహాన్ని అంచనా వేసి అంచెలంచెలుగా నీటిని విడుదల చేస్తున్నామని చీఫ్ ఇంజనీర్ సతీష్  కుమార్‌ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top