ప్రభుత్వంపై నిందలు వేస్తే సహించేది లేదు: మంత్రి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై నిందలు వేస్తే సహించేది లేదు: మంత్రి

Published Tue, Sep 10 2019 1:24 PM

Minister Mopidevi Venkata Ramana  Speech At Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పించారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. మంగళవారం ఆయన గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో జలకళ ఉట్టి పడుతోందని, రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. సమర్థవంతమైన వైఎస్‌ జగన్‌ పాలన చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని, దీనిలో భాగంగనే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

ఎక్కడ తన ఉనికిని కోల్పోతానో అన్న భయంలో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక వరద రాజకీయాలకు తెరలేపారని, అవి ఫెయిల్‌ అయిన తరువాత హత్యా రాజకీయాలను ముందుకు తెస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు.  అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ హత్యలు, కక్ష సాధింపు చర్యలు ఉండేవని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ అధికారులపై చేయి చేసుకున్న ఘనత టీడీపీ నాయకులదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయని మంత్రి తెలియజేశారు.

టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు చెందిన అక్రమ మైనింగ్‌పై కోర్టు ప్రశ్నిస్తే బాధ్యత ప్రభుత్వానికి ఎలా అవుతుందని ప్రశ్నించారు. కోడెల కుటుంబం చేసిన అక్రమాల వల్ల బలైన బాధితులు కోర్టులను, పోలీసులను ఆశ్రయిస్తే దానికి తమని నిందించడం సరికాదన్నారు.  అనినీతి లేకుండా సంక్షేమం దిశగా తమ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని, కావాలని తమపై నిందలు వేస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement