అన్నం పెట్టినోళ్లకు ఎసరు

Mid Day Meals Agency Workers Removed Nellore - Sakshi

ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా..కనీస వేతనం లేకపోయినా.. అప్పులు చేసి అన్నం తయారు చేశారు.. విద్యార్థుల కడుపునింపి ఆకలి తీర్చారు.. అలాంటి మధ్యాహ్న భోజన పథకం కార్మికులను తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఎన్నికలప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే భోజనపథకం నిర్వాహకులను ఆదుకుంటాం అంటూ ప్రకటనలు చేసిన చంద్రబాబు వారి పొట్టకొట్టేందుకు ఈ పథకాన్ని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి పెట్టేస్తున్నాడు. ఫలితంగా వీరు రోడ్డున పడనున్నారు. దీనిపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
 
డక్కిలి (నెల్లూరు): ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న ఏజెన్సీలను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భోజనం అందిస్తున్న నిర్వాహకులను ఒక్కసారిగా తొలగించేందుకు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన జీఓలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్థానిక అధికారులకు చేరాయి. 2018 సెప్టెంబర్‌ 15 నుంచి మధ్యాహ్న భోజనం నిర్వహణ బాధ్యతను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు గత నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా అందుకు సంబంధించిన విధి విధానాలతో అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. ఎలాంటి ముందుస్తు నోటీసులు ఇవ్వకుండానే ఒక్కసారిగా మహిళలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తున్న తమని రోడ్డున పడేస్తే ఎలా, ఇన్నేళ్లుగా కష్టపడి చేసిన దానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఫలం ఇదేనా అంటూ మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ కార్మికులు మండిపడుతున్నారు.

జీఓ విడుదల
ఇప్పటికే జిల్లాలోని ముత్తుకూరు, ఇందుకూరుపేట, మనుబోలు, వెంకటాచలం, గూడూరు, నెల్లూరుటౌన్‌లలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రైవేట్‌ సంస్థల పరం చేసింది. జిల్లాలోని మరో 19 మండలాల్లోని ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను ఢిల్లీకి చెందిన నవ ప్రయాస్‌ సంస్థకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులకు,  స్థానిక ఎంఈఓ కార్యాలయాలకు ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని పైవేట్‌ సంస్థకు ఇవ్వడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఉపాధి కోల్పోతున్న మహిళలు
జిల్లాలో వెంకటాచలం, నాయుడుపేట, వెంకటగిరి, కావలి, ఆత్మకూరు ప్రాంతాల్లోని 19 మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఢిల్లీకి చెందిన నవ ప్రయాస్‌కు అప్పగించింది. డక్కిలి మండలంలో 71 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 60 ప్రాథమిక, 5 ప్రాథమికోన్నత, 6 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలకు సంబంధించి 70 మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలలో 123 మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరంతా సెప్టెంబర్‌ నెల నుంచి ఉపాధి కోల్పోనున్నారు. నిర్వహణ బాధ్యతను ప్రైవేట్‌ సంస్థకు అప్పగించినట్లు తెలుసుకొన్న నిర్వాహకులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
 
గతేడాది నుంచే..
గతేడాది మొదటి దశగా జిల్లాలో ముత్తుకూరు, ఇందుకూరుపేట, మనుబోలు, వెంకటాచలం మండలాల్లో మధ్యాహ్న భోజన నిర్వహణ బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు. నెల్లూరు టౌన్‌లో ఇస్కాన్‌ సంస్థకు అప్పగించారు. అయితే రెండో విడతగా నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు, దొరవారిసత్రం, వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, కావలి, కావలి రూరల్, బోగోలు, జలదంకి, కలిగిరి, ఆత్మకూరు, ఏఎస్‌పేట, అనంతసాగరం, సంగం మండలాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహణను ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారు. మొదటి విడతగా మధ్యాహ్న భోజన నిర్వహణను పొందిన సంస్థలు నిర్వహణ వ్యవహారంలో ఆదిలోనే కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా యి. ఉదయం 10 గంటలకు తయారు చేసిన అన్నం, కూరలను మధ్యాహ్నానికి పాఠశాలలకు చేరవేయడంతో విద్యార్థులు తినేందుకు ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం తాజాగా జిల్లాలో 19 మండలాల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసి పాఠశాలలకు చేరవేయడం సాధ్య కాదనే అభిప్రాయం తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి వ్యక్తమవుతోంది.

వేళకు అందేనా..
పాఠశాల ప్రాంగణంలోనే మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి వేడిగా విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి రూ.కోట్లు ఖర్చు చేసి పాఠశాలల ప్రాంగణాల్లోనే వంట గదులు నిర్మించి గ్యాస్‌ పంపిణీ చేశారు. అయితే ప్రస్తుతం ఈ పథకం నిర్వహణను పైవేట్‌ సంస్థకు అప్పగిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవో విడుదల చేయడంతో విద్యార్థులకు భోజనం వేళకు అందుతుందా అనే సందేహ వ్యక్తమవుతోంది.

స్థానిక ఏజెన్సీల పాత్ర నామమాత్రం 
ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న స్థానిక ఏజెన్సీలు నామమాత్రంగా మిగలనున్నాయి. ఈ ఏజెన్సీల ఆధారంగా ప్రతి రోజూ ముగ్గురు ఉపాధి పొందేవారు. అయితే ప్రస్తుతం విడుదల చేసిన జీఓతో వారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న నిర్వాహకులు ఆహారం వడ్డించడం, పాఠశాలలను శుభ్రం చేయడం, విద్యార్థుల ఆలనాపాలనా చూడడం వంటి పనులకే పరిమితం కావాల్సిఉంది. అయితే నిర్వాహకులకు మాత్రమే నెలకు రూ.1000 ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

పాఠశాల ప్రాంగణంలోనే  భోజనం తయారీ మంచిది 
పాఠశాల ప్రాంగణంలోనే వంటను తయారు చేసి విద్యార్థులకు అందిస్తే బాగుంటుంది. ఎక్కడో తయారు చేసి పాఠశాలకు తీసుకురావడం వల్ల విద్యార్థులకు అసౌకర్యంగా ఉంటుంది. స్థానికంగా తయారు చేస్తే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుంది. – గువ్వల రాధ, మహసముద్రం, మధ్యాహ్న భోజన  నిర్వాహకురాలు

ఎంతో కాలంగా పనిచేస్తున్నాం 
2003 నుంచి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి విద్యార్థులకు వడ్డిస్తున్నాం. కనీస వేతనం లేకపోయినా కష్టపడి పనిచేసిన నిర్వాహకులను తొలగించడం అన్యాయం. రాబోయే రోజుల్లో ప్రైవేట్‌ ఏజీన్సీల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుంది. – కట్లా శివరావమ్మ, ఏజెన్సీ నిర్వాహకురాలు, ఆల్తూరుపాడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top