
భారీ చోరీ
పట్టణంలోని శ్రీ శ్రీనివాసరావు సిల్వర్ అండ్ జ్యూయలరీ షాపులో భారీ చోరీ జరిగింది. రూ.30 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు...
- నందిగామ నగల దుకాణంలో ఘటన
- రూ.30 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు అపహరణ
- దర్యాప్తు చేపట్టిన పోలీసులు
నందిగామ, న్యూస్‌లైన్ : పట్టణంలోని శ్రీ శ్రీనివాసరావు సిల్వర్ అండ్ జ్యూయలరీ షాపులో భారీ చోరీ జరిగింది. రూ.30 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరణకు గురయ్యాయి. మెయిన్ బజారు సమీపంలోని ప్రభుత్వాస్పత్రి రోడ్డులో గల ఈ దుకాణంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
వెనుకవైపు ఉన్న చిన్న షట్టర్‌ను, ఇనుప మెస్‌ను కట్‌చేసి దుండగులు లోనికి ప్రవేశించారు. దుకాణంలోని రూ.3 లక్షల 75 వేల నగదు, అమ్మకానికి ఉంచిన సుమారు 25 కిలోల వెండి, లాకర్‌లో ఉంచిన అర కిలో బంగారం చోరీకి గురైనట్లు యజమాని చలమల వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటి విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని వివరించారు.
మరో లాకర్‌లో ఉంచిన బంగారం మాత్రం అలానే ఉందని చెప్పారు. నందిగామ డీఎస్పీ చిన్న హుస్సేన్ ఈ ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. దుకాణం సమీపంలోని ఖాళీ స్థలం నుంచి కాంపౌండ్ వాల్ మీదుగా పక్కనే ఉన్న డాబా శ్లాబు పైకి ఎక్కి అక్కడినుంచి షాపు వద్దకు వచ్చారని తెలిపారు. షట్టర్, మెస్‌ను కట్ చేసి చోరీ చేశారని వివరించారు. ఈ ఘటనకు ముందు జాతీయరహదారి వెంబడి ఒక గాలి మిషన్ షాపులో దీనికి సంబంధించిన పరికరాలను దుండగులు చోరీ చేసినట్లు తెలిపారు.
విచారణ చేపట్టిన పోలీసులు...
ఈ ఘటనపై డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి. పోలీసు కుక్క షాపు నుంచి జాతీయ రహదారి సమీపంలోని చందమామ పేట వైపు సందులోకి వెళ్లి అక్కడ నుంచి జాతీయ రహదారి పక్కనే ఉన్న గాలి మిషన్ షాపు వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి సీఐ కార్యాలయం ముందు కొద్దిసేపు ఆగి జాతీయ రహదారి వద్ద ముక్కపాటి వెంకటేశ్వరరావు విగ్రహం వద్దకు వెళ్లి ఆగిపోయాయి. నందిగామ ఇన్‌స్పెక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ నిందితులను పట్టుకునేందుకు అన్ని రకాలుగా దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. అనుమానిత వ్యక్తులను ఇప్పటికే తీసుకువచ్చి విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన తీరు చూస్తే ఈ పరిసరాలపై అవగాహన ఉన్నవారి ప్రమేయం కూడా ఉండవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు.