ఆత్మకూరులో ఉద్రిక్తత
ఆత్మకూరు: దేవాదాయశాఖ భూముల్లోని కట్టడాల తొలగింపు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలోని మెయిన్‌బజారులో జగన్నాథరావుపేట, కొలగాని రామయ్యసత్రం రహదారిపై బుధవారం తెల్లారేసరికి యుద్ధవాతావరణం నెలకొంది. కొలగాని రామయ్య సత్రం పరిధిలో అక్రమ కట్టడాలను తొలగిస్తామంటూ మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఎండోమెంట్ అధికారులు చాటింపు వేశారు. ఈ చాటింపును కొందరు దుకాణ యజమానులు అడ్డుకుని పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యారు.
ఈ క్రమంలో దేవాదాయశాఖ స్థలంలోని అక్రమకట్టడాలను తొలగించేందుకు జేసీబీ, సుమారు 200 మంది పోలీసులతో అధికారులు రంగంలోకి దిగారు. ఉదయం ఆరున్నర గంటల నుంచే జేసీబీతో కట్టడాలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. సుమారు 30 దుకాణాలను ధ్వంసం చేశారు. ఈ ప్రక్రియ సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. దుకాణాలను కూల్చడాన్ని తట్టుకోలేని కొందరు వ్యాపారులు వివిధ పార్టీల నేతలతో కలిసి అధికారులతో వాగ్వాదానికి దిగారు.
కట్టడాల కూల్చివేత ఇలా..
పట్టణంలో గత ఏడాది చేపట్టిన రహదారుల విస్తరణలో భాగంగా మెయిన్‌బజారులో రహదారికి ఇరువైపులా కట్టడాలను తొలగించారు. అప్పట్లో నిరాశ్రయులైన వారు తమకు పునరావాసం కల్పించాలని మున్సిపల్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కోరారు. ఆయా ప్రాంతాల్లో కొంతమేర దుకాణాలు నిర్మించుకునేందుకు మౌఖిక అనుమతులు పొందారు. పలువురు వ్యాపారులు దుకాణాలు నిర్మించుకున్నారు.
ఐదు నెలల క్రితం ఈ అక్రమ కట్టడాలను తొలగించాలంటూ దేవాదాయ శాఖ అధికారులు వ్యాపారులను హెచ్చరించారు. హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం కొలగాని సత్రానికి సంబంధించింది కావడంతో హక్కుదారులు కోర్టును ఆశ్రయించారు. అక్రమ కట్టడాలు ఆగలేదనే ఉద్దేశంతో కంటెంట్ ఆఫ్ కోర్టుతో మళ్లీ పిటీషన్ దాఖలు చేశారు. దీంతో దేవాదాయశాఖఅధికారులు పోలీసుల సహకారంతో ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దుకాణాలు కూల్చవద్దంటూ బాధితులు బోరుమన్నారు. వారికి అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నేత సూరా భాస్కర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రవికుమార్‌రెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, టీడీపీ నేతలు వెంకటరమణారెడ్డి, హయత్‌బాషా, బీజేపీ నాయకులు సుధాకర్ రెడ్డి, సుధాకర్‌ను అరెస్టు చేశారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ఆర్డీఓ కోదండ రామిరెడ్డి, దేవాదాయ శాఖ ఏసీ రవీంద్రా రెడ్డి, డీఎస్పీ మాల్యాద్రి, సీఐ అల్తాఫ్హుస్సేన్, తహశీల్దారు వెంకటేశులు, ఎస్సై వేణుగోపాల్ రెడ్డి, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ శైలేంద్రకుమార్ పర్యవేక్షించారు.
అంచెలంచెలుగా అన్నీ తొలగింపు..
కొలగాని సత్రం పరిధిలోని 2.65 ఎకరాల విస్తీర్ణంలో వెలిసిన అన్ని అక్రమ కట్టడాలను తొలగించాలని తమకు ఆదేశాలు అందాయని శైలేంద్రకుమార్ తెలిపారు. మొత్తం 56 దుకాణాలను తొలగించాల్సి ఉందని, అంచెలంచెలుగా అన్నీ తొలగిస్తామని చెప్పారు. అక్రమణదారులకు పలు దఫాలు హెచ్చరించామని, అయినా స్పందన లేకపోవడంతో నోటీసులు లేకుండానే కట్టడాలను తొలగించామన్నారు.
ప్రత్యామ్నాయం చూపుతాం: ఆర్డీఓ
బాధితులు దేవాదాయశాఖకు దరఖాస్తు చేసుకుంటే ప్రత్యామ్నాయ అవకాశాలు చూపుతామని ఆర్డీఓ డి.కోదండరామిరెడ్డి తెలిపారు. ఆ శాఖ ఆధ్వర్యంలో దుకాణాలను నిర్మించుకోవాల్సి ఉంటుందని, అందుకు గాను అద్దె చెల్లించాలన్నారు. దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణలో భాగంగానే ఆక్రమణలను తొలగించామన్నారు.