తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓ వ్యాపారిని కొందరు ఆగంతకులు కిడ్నాప్ చేసి.. అనంతరం విడిచిపెట్టారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓ వ్యాపారిని కొందరు ఆగంతకులు కిడ్నాప్ చేసి.. అనంతరం విడిచిపెట్టారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన లలిత్ జైన్ కొఠారి కుటుంబం కాకినాడలో స్థిరపడింది. స్థానిక బాలాత్రిపురసుందరి దేవాలయం ఎదుట వారు 'ఆదర్స్ ఇంటీరియర్స్' పేరిట హార్డ్‌వేర్ షాపు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలానే మంగళవారం ఉదయం లలిత్ జైన్ కొఠారి షాపు వద్దకు వెళ్లారు. ఉదయం 9.30 గంటల సమయంలో షాపు ఎదుట ఏపీ 01కె 9009 ఇన్నోవా కారు ఆగింది. దానిలో నుంచి ముసుగు ధరించిన నలుగురు వ్యక్తులు దిగి షాపులోనికి వెళ్లారు. లలిత్ జైన్‌ను లాక్కుంటూ వచ్చి కారులోకి తోసి పరారయ్యారు. వారిని ఆపేందుకు లలిత్‌జైన్ సోదరులు, షాపు సిబ్బంది విఫలయత్నం చేశారు.
ఈ ఘటనపై జైన్ సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ ఎస్‌డీపీఓ సూర్యదేవర వెంకటేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ సిబ్బందితో రంగంలోకి దిగారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సెట్‌లో సమాచారం ఇవ్వడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే అప్పటికే ఆగంతకులు లలిత్ జైన్‌ను కాకినాడ-సామర్లకోట మధ్య ఏడీబీ రోడ్డులో విడిచిపెట్టి పరారయ్యారు. ఆయన తన సోదరులకు ఫోన్ చేసి, తాను క్షేమంగానే ఉన్నానని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ తెలిపారు. కాగా స్థల వివాదమే ఈ అపహరణకు కారణమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.