
అవినీతి మలేరియా
మలేరియా మహమ్మారి జిల్లాలో స్వైరవిహారం చేస్తుంటే....
మలేరియా నియంత్రణ విభాగంలో గోల్‌మాల్
దాదాపు రూ.70లక్షలు దుర్వినియోగం
‘దీర్ఘకాలిక సెలవు’లో కీలక అధికారి
కప్పిపుచ్చేందుకు వైద్య, ఆరోగ్య శాఖ యత్నం
మలేరియా మహమ్మారి జిల్లాలో స్వైరవిహారం చేస్తుంటే....జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి మలేరియా రాజ్యమేలుతోంది.
మలేరియా ప్రబలడంతో 13 మండలాల మన్యం మంచానపడింది.... అవినీతి మలేరియా జాడ్యం సోకి వైద్య,ఆరోగ్య శాఖ నిర్వీర్యంగా మారింది. ట్రెజరీ చెల్లింపుల కుంభకోణాన్ని తలపించేరీతిలో మరో అవినీతి బాగోతానికి జిల్లా మలేరియా నియంత్రణ విభాగం కేంద్ర బిందువుగా మారింది. దాదాపు రూ.70లక్షలు నిధులు గోల్‌మాల్ జరిగింది. అందుకే ఏజెన్సీతోపాటు జిల్లాను మలేరియా వణికిస్తున్నా...జిల్లా మలేరియా విభాగం ‘పెద్దదిక్కు’ లేకుండాపోతోంది. కీలక అధికారి నెలరోజులకుపైగా అందుబాటులో లేకుండా పోయారు. కీలకమైన తరుణంలో ఆయన ‘దీర్ఘకాలిక సెలవు’పై వెళ్లడం గమనార్హం. దీని వెనుక కథ వేరే ఉండటం అసలు విషయం. ఆ కథకమామిషు ఇదిగో చూడండి....
ఏజెన్సీలో మలేరియా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 4,901 మలేరియా కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ, ఫైలేరియా తదితర వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. ప్రతి ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ వ్యాధులు తీవ్రత ఎక్కువుగా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లోనే మలేరియా నియంత్రణ విభాగం, ఇతర వైద్య, ఆరోగ్య సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఏజెన్సీపై మరింతగా దృష్టిసారించాలి. జిల్లా మలేరియా విభాగంలో ఓ కీలక అధికారి నెలరోజులుగా సెలవులో ఉన్నారు. ఆయన తన దీర్ఘకాలిక సెలవును పొడిగించుకునే ఉద్దేశంలోనే ఉన్నారని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేకుండాపోవడం గమనార్హం. ఇంత టి కీలక తరుణంలో ఆ అధికారి ఎందుకు వ్యూహాత్మకంగా సెలవులో వెళ్లిపోయారన్నది ఆసక్తికరంగా మారింది.
మరో ‘ట్రెజరీ’ కుంభకోణం!
జిల్లా మలేరియా విభాగంలో భారీస్థాయిలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మార్చిలో దాదాపు రూ.కోటి నిధులు ఈ శాఖకు వచ్చాయి. వాటిలో ఏకంగా రూ.70లక్షలు ఒకే రోజున డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఒకే రోజున అంత భారీ మొత్తాన్ని డ్రా చేసి ఖర్చుచేసేంత పని ఏముందన్నది అంతుచిక్కడం లేదు. ట్రెజరీ కుంభకోణం నేపథ్యంలో ఐటీడీఏ పీవో హరినారాయణన్ మలేరియా శాఖలో నిధుల వినియోగంపైన కూడా దృష్టిసారించారు. దానికి మలేరియ నియంత్రణ విభాగం అధికారులు సరైన లెక్కలు చూపించలేకపోయినట్లు తెలుస్తోంది. మలేరియా నియంత్రణ కోసం ఏజెన్సీలో ప్రతి ఇంటిలో మూడుసార్లు మందును పిచికారీ చేయాలి. అలా చేయకుండానే చేసినట్లు చూపించారు. ఫైలేరియా మందుల పంపిణీలో కూడా అవకతవకలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. ఫైలేరియా మందుల పంపిణీ కోసం ఇద్దరు సభ్యులతో కూడిన బృందాలను దాదాపు 5వేలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో బృందం 250 ఇళ్లకు మందులు పంపిణీ చేయాలి. అందుకోసం ఒక్కొక్క టీంకు రోజుకు రూ.200 ఇవ్వాలి. కానీ అన్ని బృందాలను ఏర్పాటు చేయకుండానే చేసినట్లు చూపించి నిధులు దుర్వినియోగం చేసినట్లు తెలిసింది. ఈ విషయాలన్నింటినీ పీవో కూపీ లాగడంతో మలేరియా నియంత్రణ విభాగం అధికారులకు ముచ్చెమటలు పట్టాయి.
దాంతో ఈ విచారణను తప్పించుకునేందుకు ఓ కీలక అధికారి ఉద్దేశపూర్వకంగానే సెలవుపై వెళ్లిపోయారని సమచారం. మలేరియా ప్రబలే సీజన్‌లో ఆయనకు సెలవు ఇవ్వడానికి మొదట ఉన్నతాధికారులు సమ్మతించలేదు. అనారోగ్య కారణాలను చూపుతూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. నెల నెల ఆ సెలవును పొడిగించుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిధుల దుర్వినియోగాన్ని కప్పిపుచ్చాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఐటీడీఏ పీవో హరినారాయణన్, జిల్లా ఉన్నతాధికారులు ఈ అవినీతి బాగోతంపై ఎలా స్పందిస్తారో చూడాల్సిందే!