అదిగో చిరుత.. ఇదిగో జింక

Leopard Deer Fox Animals Caught On CC Camera In Forest - Sakshi

పశ్చిమ ఏజెన్సీలోని పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో ఉన్న పోలవరం, బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గల రేంజ్‌ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటి కదలికలను గుర్తించారు. వీటి సంరక్షణ కోసం అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  

సాక్షి, బుట్టాయగూడెం(పశ్చిమగోదావరి) : జిల్లాలోని పోలవరం, బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పరిధితో పాటు పాపికొండల నేషనల్‌ పార్కుగా సుమారు 1.12 లక్షల హెక్టార్లలో అభయారణ్యం విస్తరించి ఉంది. అందులో ఎలుగుబంటులు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, గెద్దలు, నెమళ్లు, చిరుత పులులు, కురుడు పందులు, చుక్కల దుప్పిలు, సాంబాలు, జాకర్స్, ముళ్ల పందులు, ముంగీసలు వంటి జంతువులు అధికంగా ఉన్నట్లు వన్యప్రాణి విభాగం అధికారులు చేసిన సర్వేల్లో బయట పడింది. పాపి కొండల అభయారణ్యంలో చిరుతపులి, జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, అడవిదున్నలు ఉన్నట్లు గుర్తించారు.

5 ఫారెస్ట్‌ రేంజ్‌ల పరిధిలో 60 బీట్‌లలో 2018లో జంతుగణన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో చిరుత పులులతో పాటు పలు వన్యప్రాణులు ఉన్నట్లు తేలడంతో వాటి సంరక్షణ కోసం గోగులపూడి సమీపంలో బేస్‌ క్యాంపు, పోలవరం మండలంలోని టేకూరు వద్ద మరో బేస్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బేస్‌ క్యాంపులో ఐదుగురు చొప్పున సిబ్బంది పని చేసేవిధంగా ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేశారు. అభయారణ్యం సంరక్షణ, జంతువుల ఉనికి తెలుసుకునేందుకు ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పలు ప్రదేశాల్లో సంచరిస్తున్న అడవి జంతువుల కదలికలు ట్రాప్‌ కెమెరాలకు చిక్కాయి. పాపికొండల అభయారణ్యంలో చిరుతపులి జాడ ఉందని తేలింది. దీనితో పాటు కార్నివోర్స్, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు, అడవి కుక్కలు, కుందేళ్లు, లేళ్లు, కనుజులు, అడవి పందుల జాడ కూడా ఉన్నట్లు తేలింది. పోలవరం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు అటవీరేంజ్‌ పరిధిలో నిర్వహించిన జంతు గణనల్లో పోలవరం రేంజ్‌ పరిధిలో సుమారు 30 అడుగుల గిరినాగులు కూడా ఉన్నట్లు తేలిందని అధికారులు చెప్పారు.  

కానరాని పెద్ద పులుల జాడ  
2018లో నిర్వహించిన జంతు గణనల సర్వేలో జీవజాతుల సంఖ్య పెరిగినట్లు ఫారెస్ట్‌ అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రాంతంలో పెద్దపులుల జాడ ఉన్నట్లు ఎక్కడా సమాచారంలేదని అధికారులు చెబుతున్నారు. అయితే పెద్దపులి జాడ కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తద్వారా సీసీ కెమెరాల ద్వారా బంధించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో పులుల సంచారం కూడా ఉందని, అయితే కెమెరాల్లో బందీ కావడంతో పాటు ఆచూకీ లభిస్తేనే వెల్లడిస్తామని అంటున్నారు.  

వేసవిలో వణ్యప్రాణుల దాహర్తి తీరుతుందిలా.. 
వేసవిలో వణ్యప్రాణుల దాహర్తిని తీర్చేందుకు అటవీశాఖ అధికారులు నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తారు. కుక్కలు, వాహనాల బారిన పడకుండా అటవీప్రాంతంలో జంతువులు సంచరించే ప్రాంతంలో సాసర్‌వెల్‌(నీటి తొట్టె) ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటితో నింపుతారు. బేస్‌క్యాంప్‌ సిబ్బందితో కలిసి అధికారులు ప్రతీరోజూ నీటిని పరిశీలించి అందులో చెత్తలేకుండా చూస్తారు. నీటి తొట్టె పక్కనే ఉప్పుముద్దను కూడా ఏర్పాటు చేస్తారు. వన్యప్రాణుల దాహార్తిని తీర్చుకుని ఉప్పుముద్దను నాకుతాయి. దీంతో ఎండ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పోలవరం, కన్నాపురం, కుక్కునూరు, వేలేరుపాడు రేంజ్‌ పరిధిలో సుమారు 70 వరకూ నీటి తొట్టెలు 150 వరకూ చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే వన్యప్రాణులకు వేసవిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని వైల్డ్‌లైఫ్‌ డీఎఫ్‌వో వేణుగోపాల్‌ తెలిపారు. 

వెంటాడుతున్న నిధుల కొరత 
వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అధికారులు అనేక అవస్థలు పడుతున్నారు. నీటితొట్టెల్లో నీటిని ట్యాంక్‌ల ద్వారా తరలించేందుకు, ఇతర ఏర్పాట్లకు నిధుల కొరత వెంటాడుతున్నట్లు అధికారులు అంటున్నారు. నిధుల కోసం ప్రతిపాదనలు పంపినా మంజూరుకాలేదని దీనితో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు.  

జంతు సంరక్షణ కోసం చర్యలు 
అటవీ ప్రాంతంలోని జంతువులను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో వన్యప్రాణి దాహర్తి తీర్చేందుకు నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నాం. అలాగే చెక్‌డ్యామ్‌లు, ర్యాపిడ్‌ ఫీల్డ్‌ డ్యామ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. అయితే పనులకు సంబంధించి కాస్త నిధుల కొరత ఉన్నమాట వాస్తవమే. గత ఏడాది నుంచి నిధులు మంజూరు కావడంలేదు. 
– జి.వేణుగోపాల్, డిప్యూటీ రేంజర్‌ అధికారి వైల్డ్‌లైఫ్, పోలవరం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top