నేతల ఎత్తులు.. బాబు పైఎత్తులు | Launches paiettulu heights leaders .. | Sakshi
Sakshi News home page

నేతల ఎత్తులు.. బాబు పైఎత్తులు

Mar 10 2015 1:31 AM | Updated on Mar 22 2019 6:18 PM

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆ పార్టీ నేతల ఎత్తులకు పైఎత్తులు వేశారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆ పార్టీ నేతల ఎత్తులకు పైఎత్తులు వేశారు. నోటిఫికేషన్ జారీ తరువాత సొంతవర్గం, పోలీస్ ఇంటిలిజెన్స్ విభాగాలు ఆశావహుల వివరాలను సేకరించడం ఆనవాయితీగా వస్తోంది. వారిని ఆశావహులు మేనేజ్  చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుండటంతో అధినేత వారి అంచనాలకు అందని రీతిలో జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. నోటిఫికేషన్ మంగళవారం రానుండగా, వారం కిందటనే ఆశావహుల వివరాలతో కూడిన నివేదికను తన వద్దకు తెప్పించుకున్నారు. ఇవేమీ తెలియని ఆశావహులు సొంత వర్గం నేతలు, పోలీస్ ఇంటిలిజెన్స్ విభాగాల్లోని అధికారులను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు.
 
శాసన సభ్యుల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుండడంతో హడావుడి ప్రారంభమైంది. ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు  జరుగుతాయని పార్టీ వర్గాలు భావించాయి.  

అందుకు విరుద్ధంగా స్వల్పకాల వ్యవధిలో నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ఆశావహులు తమ ప్రయత్నాలను వేగవంతం చేశారు. జిల్లాలోని ముఖ్యనేతలను కలుస్తూ తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని, మీ సహకారం కావాలని కోరుతున్నారు. పార్టీకి చిరకాలంగా అందిస్తున్న సేవలకు సంబంధించిన సమాచారాన్ని పార్టీ కార్యాలయానికి అందే ఏర్పాటు చేశారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా తెలుగుదేశం పార్టీకి మూడు, వైఎస్సార్ సీపీకి రెండు స్థానాలు లభించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు నన్నపనేని రాజకుమారి(టీడీపీ), సింగం బసయపున్నయ్య(కాంగ్రెస్) పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది.  ఖాళీ అయిన స్థానాల నుంచి పోటీ చేయడానికి జిల్లా నుంచి పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా పనిచేస్తే, ఆ హోదా, అధికారానికి ప్రత్యేకత ఉంటుందని, కనుక ఇప్పటి ఎన్నికలో తనకు అవకాశం కల్పించాలని నన్నపనేని ఆ పార్టీ నేతల వద్ద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమెతోపాటు మరో ఐదారుగురు సీటుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సీటు కోసం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చందు సాంబశివరావు, కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజామాస్టారు తీవ్రంగా ప్రయత్నించారు.

కాపు సామాజిక వర్గానికి చెందిన వీరిని పక్కన పెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్త ఏఎస్ రామకృష్ణకు పార్టీ సీటు కేటాయించింది. సామాజికవర్గాల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నామని, భవిష్యత్‌లో అవకాశం కల్పిస్తామని ఆ ఇద్దరినీ పార్టీ బుజ్జగించినట్టు సమాచారం. ఇప్పుడు వారిద్దరూ ఎమ్మెల్యేల కోటాలోనైనా ఎమ్మెల్సీ స్థానం దక్కించుకునేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు.  

మాజీ శాసన సభ్యుడు జియావుద్దీన్‌తోపాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, అర్బన్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరేకాకుండా మాజీ మంత్రులు మాకినేని పెదరత్తయ్య, శనక్కాయల అరుణ, పుష్పరాజ్ తమ సీనియార్టీని పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు.
 
బాబు మార్కు నివేదిక...
నోటిఫికేషన్ జారీ తరువాత స్థానికంగా ఇంటిలిజెన్స్ వర్గాలు ఆశావహుల వివరాలను సేకరిస్తాయి. ఈ సేకరణ అంతా మొక్కుబడి వ్యవహారమేనని, అసలు నివేదిక వారం కిందటే బాబు చేతికి చేరిందని విశ్వసనీయ సమాచారం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ బాబు ఇదే రీతిలో నిర్ణయం తీసుకుని నేతల్ని విస్మయపరిచారు. జిల్లాలో ఈ వ్యవహారం జరుగుతుండగానే హైదరాబాద్‌లో ఏఎస్ రామకృష్ణ అభ్యర్థిత్వంపై బాబు నిర్ణయం తీసుకున్నారు. రామకృష్ణ పేరును ఎవరు సిఫారసు చేశారో ఇప్పటికీ ఆ పార్టీ నేతలకు అంతు చిక్కని ప్రశ్న. ఈ ఎన్నికలకూ అభ్యర్థిని ఇదే రీతిలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement