రైతులను వీడని భూ సమస్యలు

Land problems of farmers - Sakshi

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్ధంతరంగా పాసు పుస్తకాలను రద్దుచేసింది.  వెబ్‌ల్యాండ్‌ విధానం తెరపైకి తెచ్చింది. భూములను క్షేత్రస్థాయిలో సర్వేచేసి రైతుల వివరాలు నమోదు చేయకుండా వారినే ఆన్‌లైన్లో నమోదు చేసుకోవాలని, వన్‌బీ, అడంగళ్లు, ఈ పాసుపుస్తకాలు తీసుకోవాలంటూ ఒత్తిడి పెంచింది. మీ ఇంటికి మీ భూమి, రైతు సేవలో రెవెన్యూ అంటూ హడావుడి చేసినా క్షేత్రస్థాయిలో భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. రైతులకు నిత్య వేదన తప్పడం లేదు. భూములు అమ్మాలన్నా.. కొనుగోలు చేయాలన్నా.. రాయితీలు పొందాలన్నా నరకయాతన పడాల్సిందే. సమస్యకు పరిష్కారం ప్రభుత్వం చేతిలో ఉన్నా పట్టించుకోకపోవడం రైతులకు శాపంగా మారింది.

విజయనగరం గంటస్తంభం: భూమి రికార్డులతో రైతులకు ఉన్న సంబంధం అందరికి తెలిసిందే. భూమి తనదని ధ్రువీకరించేందుకు రెవెన్యూ రికార్డులపై ఆధారపడాల్సిందే. సాగుహక్కులు, ఇతర ధ్రువీకరణ రికార్డుల్లోనే ఉంటుంది. భూమి అమ్మకం చేయాలన్నా, బ్యాంకు రుణం పొందాలన్నా, ఎరువులు, ఇన్‌పుట్‌ సబ్సిడీ పొందాలన్నా రికార్డుల్లో రైతులు పేర్లు ఉండాల్సిందే. ఆ విషయాన్ని రైతులు ధ్రువీకరించాల్సిందే. అయితే, భూమి రికార్డుల్లో అనేక తప్పులు దొర్లాయి. అడంగల్, 1బీ వంటి రికార్డుల్లో లోపాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. భూములున్నా ఏ సదుసాయం పొందలేకపోతున్నారు. రాయితీలు అందుకోలేకపోతున్నారు. జిల్లా అధికారులు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా మూడు సమస్యలకు పరిష్కారం చూపలేకపోతున్నారు. రైతులు ఎదుర్కొంటున్న మరో సమస్య భూములు భౌతిక విస్తీర్ణానికి, రికార్డుల్లో విస్తీర్ణానికి తేడా ఉండడం. అమ్మకాలు, కొనుగోలు చేసుకునేటప్పుడు రైతులు రిజిస్ట్రేషన్‌ ఫీజు తగ్గుతుందని ఎక్కువ భూమి ఉంటే రికార్డులో తక్కువ చూపించి రిజిస్ట్రేషన్‌ చేయించికున్నారు. ఇప్పుడు ఆ భూమి రికార్డుల్లో నమోదు చేసే పరిస్థితి లేదు.

అమ్మిన వ్యక్తి పేరున తగ్గించిన విస్తీర్ణం ఉండడం, వారు లేకపోవడం సమస్యగా మారింది. జిల్లాలో ఐదారువేల ఖాతాల్లో ఇలాంటి సమస్య ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వమే ఈసమస్యకు పరిష్కారం చూపించాల్సిన పరిస్థితి.పల్లెల్లోని కొందరు రైతులు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ఒకచోట ఉన్న తన భూమిని వేరే రైతుకు ఇచ్చి, మరోచోట ఉన్న భూమిని తన వద్ద నుంచి తీసుకున్నారు. భూములు మార్చుకున్నా రికార్డులు పరంగా మారలేదు. రిజిస్ట్రేషన్‌ చేసుకుని మార్చుకునే వీలున్నా ఇప్పుడు రికార్డుల్లో ఉన్న రైతులు చాలామంది లేరు. ఇలాంటి రైతులు జిల్లాలో 3 నుంచి 4వేల మంది వరకు ఉన్నా విస్తీర్ణం మాత్రం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం స్పందిస్తే తప్ప ఈ సమస్యకు సైతం పరిష్కారం దొరికేలా లేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top