అతిథులకు ఆహ్వానం

Lambasingi is our state Kashmir - Sakshi

సాక్షి, విశాఖపట్నం: చల్లగా తాకి వణికించే చిరుగాలులు, మిట్టమధ్యాహ్నమైనా సూరీడిని సైతం కప్పేసే దట్టమైన పొగమంచు.. సున్నా డిగ్రీల వాతావరణం.. ఇవన్నీ ఆస్వాదించాలంటే కశ్మీర్, సిమ్లా, ఖండాలా వెళ్లాల్సిన పనిలేదు. వాటిని మరిపించే హిల్‌స్టేషన్‌ మన రాష్ట్రంలోని లంబసింగి!  విశాఖకు 135 కిలోమీటర్ల దూరంలో చింతపల్లి మండలంలోని ఓ చిన్న గిరిజన గ్రామం ఇది. దీని పంచాయతీ పరిధిలో 50 వరకు తండాలున్నాయి. కొండల మధ్య ఉండే వీటన్నింటిలో ఒకే రకమైన వాతావరణం కనిపిస్తుంది. పర్యాటకుల సీజన్‌  ప్రారంభమయ్యేలోగా ఇక్కడ వసతి సదుపాయాలను మెరుగు పరచాలని సీఎం జగన్‌ ఆదేశించిన నేపథ్యంలో ఏపీటీడీసీ రిసార్ట్స్‌ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. లంబసింగి సమీపంలోని కొండలపై ఇటీవల ట్రెక్కింగ్‌ కూడా నిర్వహిస్తున్నారు. తాజంగి జలాశయానికి ఇరువైపులా కొండల మధ్య రోప్‌ లైన్‌ నిర్మిస్తున్నారు. జలాశయంలో బోటింగ్‌కు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 

భారత్‌లో అడుగుపెట్టే ప్రతి విదేశీ పర్యాటకుడు రాజస్థాన్‌ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడ పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ సదుపాయాలు ఉండడమే దీనికి కారణం.  ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో ఏపీని ప్రముఖంగా నిలిపేలా చర్యలు తీసుకోవాలి. 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి అంతర్జా తీయంగా పేరున్న సంస్థల సహకారంతో అభివృద్ధి చేయాలి. ప్రముఖ సంస్థలు ఏపీలో హోటళ్లను ఏర్పాటు చేసేలా ఉత్తమ సదుపాయాలు కల్పించాలి. – ఇటీవల పర్యాటక, పురావస్తు, యువజన వ్యవహారాల శాఖలపై  సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశం

సుదీర్ఘమైన సుందర సముద్రతీరం.. అబ్బురపరచే చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే సప్తగిరులు, ఆతిథ్యానికి పెట్టింది పేరైన తెలుగు లోగిళ్లు.. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకూ ప్రకృతి కాన్వాసుపై చిత్రించిన సుందర రమణీయ చిత్రం ఆంధ్రప్రదేశ్‌..  పర్యాటకం ద్వారా రాష్ట్రానికి ఆదాయం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ పలు టూరిజం సర్క్యూట్‌లు, ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది.

భద్రతే లక్ష్యం..
ఏపీలో పర్యాటక రంగం ఐదేళ్లుగా నిరాదరణకు గురైంది. టీడీపీ సర్కారు హయాంలో పర్యాటక రంగానికి సంబంధించి 2015 నుంచి 2017 వరకు రూ. 12 వేల కోట్ల ఒప్పందాలు కుదిరాయని, 2018లో రూ. 2,008 కోట్ల పెట్టుబడులు రానున్నాయంటూ ప్రచారం చేసుకున్నా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా రాకపోవడం గమనార్హం. గత ప్రభుత్వం పర్యాటక నిబంధనలను గాలికి వదిలేయడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రజలు సురక్షితంగా తిరిగి వెళ్లేలా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

సూపర్‌ సర్క్యూట్లు...
రాష్ట్రంలో అరకు టూరిజం సర్క్యూట్‌కి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉండగా మిగిలినవి కొత్త పాలసీ ప్రకటించాక ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాయలసీమ హెరిటేజ్‌ సర్క్యూట్, రాజమండ్రి హెరిటేజ్‌ నేచర్‌ టూరిజం సర్క్యూట్‌ అభివృద్ధి కోసం పర్యాటక శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రూ.156 కోట్లతో అరకు ఎకో టూరిజం సర్క్యూట్, రూ.49 కోట్లతో భీమిలిలో పాసింజర్‌ జెట్టీ సర్క్యూట్లపై డీపీఆర్‌ సిద్ధమైంది. బౌద్ధ కేంద్రాలైన బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండలను రూ.20.70 కోట్లతో బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ పేరిట అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 

ఇవీ ప్రణాళికలు...
- రాష్ట్రంలో అరకు, మారేడుమిల్లి, కాకినాడ, సూర్యలంక, హార్స్‌లీ హిల్స్, గండికోట తదితర 15 ప్రదేశాల్ని పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. దేశ విదేశీ పర్యాటకుల కోసం ఇక్కడ మెరుగైన సదుపాయాలు కల్పించనున్నారు.
ప్రైవేట్‌ –  ప్రభుత్వ భాగస్వామ్యంతో 22 ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్స్, అమ్యూజ్‌మెంట్‌ పార్కుల ఏర్పాటు కోసం స్థలాలను గుర్తించారు.
పర్యాటక శాఖకు వివిధ ప్రాంతాల్లో ఉన్న 17 భవనాలు, ఆస్తులను ఆధునికీకరించి పర్యాటకాన్ని ప్రోత్సహించనున్నారు.
కేంద్ర పర్యాటకశాఖ ప్రకటించిన తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వృద్ధి పథకం (ప్రసాద్‌)లో భాగంగా అమరావతి, శ్రీశైలంలను అభివృద్ధి చేస్తున్నారు. తిరుపతి, విజయవాడ, సింహాచలం, అన్నవరం, అరసవల్లి, ద్వారకా తిరుమల ప్రాంతాలను కూడా పథకం కింద అభివృద్ధి చేయనున్నారు.  ద్వారకా తిరుమల, సింహాచలం దేవస్థానాలకు ‘ప్రసాద్‌’ పథకం కింద రూ.50 కోట్లు మంజూరయ్యాయి.
కేంద్ర పర్యాటకశాఖ హెరిటేజ్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆగ్మెంటేషన్‌ యోజన (హృదయ్‌) పథకంలో భాగంగా అమరావతిని అభివృద్ధి చేయనున్నారు.

స్టార్‌ హోటళ్లు.. గ్లాస్‌ బ్రిడ్జిలు...
తిరుపతిలో 5 నక్షత్రాల హోటల్‌ లేదా రిసార్ట్‌ అభివృద్ధికి అవసరమైన స్థలాన్ని తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నుంచి తీసుకోవాలని భావిస్తున్నారు. మారేడుమిల్లి, అరకులో 5 స్టార్‌ రిసార్ట్స్‌ అభివృద్ధికి ఐటీడీఏ నుంచి భూమి సేకరించనున్నారు. గండికోట జార్జి మీదుగా గాజు వంతెన నిర్మించడంతో పాటు హోటళ్లు, రిసార్ట్‌లు, రోప్‌వే ఏర్పాటు చేయనున్నారు. లంబసింగి, కోటప్పకొండ రోప్‌వే అందాలతో కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఓర్వకల్లులో రాతి నిర్మాణాల్ని అభివృద్ధి చేయడంతోపాటు విజయవాడలో భవానీద్వీపంతో పాటు కృష్ణా నదిలో ఉన్న 6 ద్వీపాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నారు. 

సందర్శకుల స్వర్గధామంలా..
రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో హయత్, ఫోర్‌ సీజన్స్, తాజ్, ఒబెరాయ్‌ తదితర స్టార్‌ హోటళ్ల నిర్వాహకుల సహకారంతో సదుపాయాలను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నాం. ఒక్కో ప్రాంతంలో హోటళ్లు, రిసార్ట్స్‌ అభివృద్ధి కోసం కనీసం 20 ఎకరాలు అవసరమని ప్రాథమిక అంచనా. ఆయా ప్రదేశాలను సందర్శకుల స్వర్గధామంలా తీర్చిదిద్దుతాం.    
– కె.ప్రవీణ్‌కుమార్, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి
 
‘స్థానిక’ ఉపాధికి ఊతం..
హోటళ్లను పర్యాటకశాఖ సారథ్యంలో అభివృద్ధి చేయడంతోపాటు ఏపీటీడీసీ ద్వారా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్క్‌షాప్‌లు నిర్వహించి యువతకు ఉపాధి కల్పిస్తాం. పర్యాటకానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చే వివిధ పథకాల నిధులను పూర్తిస్థాయిలో వినియోగించడంతో పాటు పర్యాటక ప్రదేశాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.    
– ముత్తంశెట్టి శ్రీనివాస్, పర్యాటకశాఖ మంత్రి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top