కోడెల హైడ్రామా | Sakshi
Sakshi News home page

కోడెల హైడ్రామా

Published Sat, Mar 8 2014 3:42 AM

కోడెల హైడ్రామా

సత్తెనపల్లి నుంచి పోటీ చేయమని అధిష్టానం చెప్పిందంటూ ఆవేదన
కార్యకర్తల సమావేశంలో కన్నీటిపర్యంతం
మనోవేదనతో గదిలోకెళ్లి తలుపు మూసుకున్న వైనం
ఇంటి వద్ద కార్యకర్తల ఆత్మహత్యాయత్నం, ఉద్రిక్తత

 
 సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు ముఖ్యభూమిక పోషించిన మాజీమంత్రి కోడెల శివప్రసాద్‌కు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీటు కేటాయించేందుకు ఆ పార్టీ ముప్పతిప్పలు పెడుతోంది. సర్వేల పేరుతో ఒకసారి, స్థానిక నాయకుల సహకారం లేదని మరోమారు నరసరావుపేట నుంచి ఆయన్ను తప్పించేం దుకు రెండు నెలల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చివరగా నరసరావుపేటలో కోడెలకు గెలిచే అవకాశాలు లేవని, సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని అధినేత చంద్రబాబు సూచించడంతో శుక్రవారం హైడ్రామా నడిచింది.
 
  తనను సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ సూచించిందని కార్యకర్తల సమావేశంలో కోడెల ప్రకటిస్తూ.. కన్నీటి పర్యంతం కావడం, వెనువెంటనే ఆయన అభిమానులు ఆత్మహత్యాయత్నం చేయడం వంటి  ఘటనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం హైదరాబాద్ నుంచి నరసరావుపేటకు చేరుకున్న కోడెల.. ముఖ్యకార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. తనకు నరసరావుపేట అనుకూలంగా లేదంటూ అధిష్టానం చేసిన సర్వేలో తేలిందనీ, సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని అధినేత చంద్రబాబు ఆదేశించారనీ, తాను కూడా కాదనలేని పరిస్థితుల్లో సత్తెనపల్లి వెళ్లేందుకు నిశ్చయించుకున్నానంటూ చెప్పినట్లు పార్టీవర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడి నుంచి ఎవరు పోటీలో ఉన్నా తనకు సహకరించినట్లుగానే వారికీ సహకరించాలని చెబుతూ ఆయన కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం.
 
 మీరు నరసరావుపేట వదలివెళ్తే ఆత్మహత్య చేసుకుంటామంటూ పెట్రోలు పోసుకునేందుకు కొందరు, తాళ్లతో ఉరివేసుకుంటామని కొందరు కార్యకర్తలు ప్రయత్నించగా వారివద్ద నుంచి పెట్రోలు డబ్బాను లాక్కున్న కోడెల.. తన గదిలోకెళ్లి తలుపులు మూసుకున్నారు ఎన్నిసార్లు కొట్టినా ఆయన తలుపులు తీయకపోవడంతో కార్యకర్తలు అక్కడే నిలిచిపోయారు. కోడెల కుమారుడు శివరామకృష్ణ కార్యకర్తలకు సర్దిచెప్పి అక్కడినుంచి పంపించివేశారు. ఇదిలావుండగా.. నరసరావుపేట నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అనేక కీలక మంత్రి పదవుల్లో కొనసాగిన కోడెల శివప్రసాదరావు 2004, 2009 ఎన్నికల్లో వరుస ఓటమి చెందడంతో ఆయన రాజకీయ జీవితం మసకబారింది. రెండు నెలల క్రితం నరసరావుపేట టీడీపీలో కోడెల వ్యతిరేక వర్గం నేతలు బాబు తనయుడు లోకేష్‌ను కలసి కోడెలను మార్చాలని కోరగా, ఆయన సత్తెనపల్లి వెళ్తారంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Advertisement
Advertisement