అద్దెల్లో ‘కోడెల’ అక్రమాలు

Kodela Siva Prasada Rao Irregularities In Rents - Sakshi

తన భవనానికి అద్దె కోసం ప్రభుత్వ కార్యాలయాలు గుంటూరుకు మార్పు

ఆరోగ్యశ్రీ, ఔషధ నియంత్రణ, ఫార్మసీ కౌన్సిల్‌ కార్యాలయాలు తన భవనంలోకి

విజయవాడలో ఉండాల్సిన ఆఫీసులు స్పీకర్‌ ఒత్తిళ్లతో తరలింపు

ఇతర కార్యాలయాల్లో చదరపు అడుగుకు అద్దె 16 రూపాయలే

కోడెల భవనానికి చదరపు అడుగుకు 25 రూపాయలు అద్దె

నెలకు ఒక్క భవనానికి రూ. 16 లక్షలు పైనే చెల్లిస్తున్న ప్రభుత్వం

సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అక్రమాలు రోజుకొకటి బయట పడుతున్నాయి. ఇప్పటికే గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో ‘కోడెల టాక్స్‌’ వసూలు చేశారు. ఇక తన భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకివ్వడంలోనూ కోడెల మార్కు హస్తలాఘవం ప్రదర్శించారు. ప్రభుత్వం తన భవనానికి ఎంత అద్దె చెల్లించాలో స్పీకర్‌గా ఉన్న ఆయనే నిర్ణయించారు. వైద్య ఆరోగ్యశాఖలోని కీలక కార్యాలయాలన్నీ గుంటూరులోని కోడెల భవనానికి తరలించారు. ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ చదరపు అడుగుకు 16 రూపాయలు చెల్లిస్తుండగా, కోడెల భవనానికి మాత్రం 25 రూపాయల కంటే ఎక్కువగా చెల్లిస్తున్నారు. ఇరుకు గదులు, ఫైర్‌ సేఫ్టీ కూడా లేకపోయినా కోడెల భవనానికి ఎక్కువ మొత్తంలో అద్దె చెల్లిస్తున్నారు. 

కీలకమైన కార్యాలయాలు కోడెల భవనానికి 
వైద్య ఆరోగ్యశాఖలో కీలకమైన కార్యాలయాలుగా గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ఔషధ నియంత్రణ శాఖ, ఫార్మసీ కౌన్సిల్, ఉద్యోగుల వైద్యపథకం వంటివన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. తొలుత వీటిని విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఇంతలోనే అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తన భవనం గుంటూరులో ఉందని, దాన్ని అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు అంగీకరించారు. దీంతో ఆ విభాగాలు గుంటూరులోని చుట్టుగుంట ప్రాంతానికి తరలించారు. ఉద్యోగులు, పెన్షనర్లు తమ మెడికల్‌ రీయింబర్స్‌మెంటు రాకపోయినా, ఆరోగ్యశ్రీ బాధితులు తమకు అనుమతులు రాలేదని అధికారులను కలవాలన్నా గుంటూరుకు వెళ్లాల్సిందే. ప్రతి చిన్న అవసరానికీ అక్కడకు వెళ్లాలంటే బాధితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చినా స్పీకర్‌ భవనం కదా అని అధికారులు కూడా పట్టించుకోలేదు.
 
ఖాళీ స్థలానికి అద్దె చెల్లిస్తున్నారు
ఎక్కడైనా భవనానికి మాత్రమే అద్దె వసూలు చేస్తారు, కానీ కోడెల శివప్రసాదరావు మాత్రం ఖాళీ స్థలానికి కూడా అద్దె తీసుకుని ప్రభుత్వానికి టోకరా వేశారు. ఐదు అంతస్తుల భవనం టెర్రస్‌పై పల్చటి రేకులు వేసి, ఎలాంటి కార్యాలయం లేకపోయినా దానికి కూడా ప్రభుత్వం నుంచి అద్దె వసూలు చేస్తున్నారు. సుమారు 6 వేల చదరపు అడుగుల ఖాళీ స్థలానికి ఒక్కో చదరపు అడుగుకు 25 రూపాయలు చొప్పున రూ. 1.5 లక్షలు వసూలు చేస్తున్నారు. భవనానికి సరైన పార్కింగ్‌ కూడా లేదు. ఇలాంటి భవనానికి నెలకు రూ. 15 లక్షలకుపైనే గత ప్రభుత్వం ‘కోడెల’ ఖాతాలో వేసింది. ఇప్పటికైనా ఈ కార్యాలయాలను అందరికీ అందుబాటులో ఉండేలా విజయవాడకు సమీపంలో ఏర్పాటు చేయాలని ప్రజానీకం కోరుతోంది.  

భవనం దుస్థితి ఇదీ...
కనీసం 200 మంది ఉద్యోగులు ఈ కార్యాలయాల్లో పనిచేస్తుంటారు. ఇలాంటి కార్యాలయంలో సరిపోయే కారు పార్కింగు, సరైన మరుగుదొడ్ల వసతులు లేవు. కారిడార్‌ కనిపించదు. వెంటిలేషన్‌ అసలేలేదు. అధికారుల చాంబర్లు కూడా ఇరుకుగా ఉంటాయి. అన్నింటికీ మించి అక్కడకు పనుల మీద వెళ్లే సామాన్యులు గుంటూరు బస్టాండు నుంచి ఆటోకు వెళ్లిరావాలంటే రూ. 200 వరకు ఖర్చవుతుంది. వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆరోగ్యశ్రీ బాధితులు ఇలా ఒకరనేమిటి నిత్యం వెళ్లే ఈ కార్యాలయం అంత దూరంలో ఏర్పాటు చేయడమేంటని వాపోతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top