‘సేఫ్‌’కు సాగిలపడ్డారు  | State Govt Support for Speaker Kodela Family Company | Sakshi
Sakshi News home page

‘సేఫ్‌’కు సాగిలపడ్డారు 

Dec 10 2018 6:15 AM | Updated on Jul 29 2019 2:44 PM

State Govt Support for Speaker Kodela Family Company - Sakshi

పశు వైద్యశాలలకు సరఫరా చేసిన మందులు నాసిరకంగా ఉన్నాయని ఆ శాఖ అధికారులే చెప్పగా.. 2017 సెప్టెంబర్‌ 24న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం

సాక్షి, అమరావతి: స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం సాగిలపడింది. ఆయన కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరామకృష్ణ డైరెక్టర్లుగా ఉన్న ‘సేఫ్‌ ఫార్ములేషన్స్, సేఫ్‌ పేరెంటెరల్స్‌ లిమిటెడ్‌’కు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కేసింది. ఇందుకోసం అధికార యంత్రాంగం సైతం అలుపెరుగకుండా పనిచేసి నిబంధనలను మార్చేసింది. ఓవైపు నష్టాలతో విలవిల్లాడుతూ మూసేసుకునే పరిస్థితిలో ఉన్న చిన్నచిన్న ఫార్మా కంపెనీల గురించి పట్టించుకోని ప్రభుత్వం.. కోడెల కుటుంబానికి చెందిన సేఫ్‌ ఫార్మకు లబ్ధి చేకూర్చేందుకు ఏకంగా మేనేజింగ్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయించింది. లిక్విడేటెడ్‌ డ్యామేజీకి సంబంధించి విధించిన పెనాల్టీలను మాఫీ చేయాలని నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకుంది. మేనేజింగ్‌ కమిటీ నిర్ణయాలు సాధారణంగా ఒక కంపెనీకి గానీ, ఒక వ్యక్తికి గానీ అనుకూలంగా తీసుకోకూడదు. ఏ నిర్ణయం తీసుకున్నా అందరికీ వర్తించేలా ఉండాలి. కానీ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య నుంచి అధికార యంత్రాంగం మొత్తం (మేనేజింగ్‌ కమిటీలో మెంబర్లంతా) సేఫ్‌ ఫార్మాకు సాగిలపడి మరీ లబ్ధి చేకూర్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  

లిక్విడేటెడ్‌ డ్యామేజెస్‌ రద్దు..
రాష్ట్రంలో మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ద్వారా ప్రభుత్వాస్పత్రులకు మందులు కొనుగోళ్లు చేసి సరఫరా చేస్తుంటారు. మందుల సరఫరా బాధ్యతలు తీసుకున్న సంస్థ నిర్ణీత గడువులోగా మందులు సరఫరా చేయాలి. లేదంటే భారీగా పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. ఇలా నిర్ణీత గడువులోగా సరఫరా చేయలేక చాలా చిన్నచిన్న ఫార్మా సంస్థలు రూ.కోట్లలో పెనాల్టీలు చెల్లించాయి. కానీ కోడెల కుటుంబ సంస్థ అయిన సేఫ్‌ ఫార్మా.. మందుల సరఫరా బాధ్యత తీసుకుని అందులో సగం కూడా అందించలేక చేతులెత్తేసింది. దీంతో ఆ సంస్థకు భారీగా పెనాల్టీలు పడ్డాయి. వాటన్నిటినీ మాఫీ చేస్తూ మేనేజింగ్‌ కమిటీ ఇటీవల నిర్ణయం తీసుకుంటూ ఇది ఒక్క సేఫ్‌ కంపెనీకి మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. అందరికీ ఇది వర్తింపజేసి ఉంటే చిన్న ఫార్మా కంపెనీలకు సుమారు రూ.70 కోట్ల పైనే లబ్ధి జరిగేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇలా టీడీపీ సర్కార్‌ తమకు కావాల్సిన వారి కోసం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో కొత్త కంపెనీలు రాకపోగా, ఉన్న కంపెనీలు కూడా హైదరాబాద్‌కు తరలిపోతున్నాయి.  

‘సేఫ్‌’ సేవ కోసం మరో జీవో తెచ్చేందుకు కసరత్తు 
గుంటూరు జిల్లా సత్తెనపల్లి వద్ద ఉన్న ‘సేఫ్‌ ఫార్ములేషన్స్, సేఫ్‌ పెరంటెరల్స్‌ లిమిటెడ్‌’కు లబ్ధి చేకూర్చేందుకు త్వరలో మరో జీవో తెచ్చేందుకు సైతం టీడీపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొన్ని రోజుల కిందట పరిశ్రమల సెక్రటరీని చిన్న ఫార్మా యూనిట్ల యాజమాన్యాలు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నాయి. ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరాలో తమకు ప్రాధాన్యమివ్వాలని కోరాయి. దీనికి పరిశ్రమల శాఖ కార్యదర్శి అంగీకరించినట్లు యాజమాన్యాలు తెలిపాయి. కానీ ఇంతలోనే మతలబు జరిగిపోయింది. సేఫ్‌ ఫార్మకు మాత్రమే లబ్ధి కలిగేలా పలు నిబంధనలను పొందుపరిచినట్టు పరిశ్రమల శాఖ అధికారి ఒకరు తెలిపారు. మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌ అయి ఉండటంతో పాటు.. సంస్థ నెలకొల్పి 15 ఏళ్లు దాటి ఉండాలని, ఏడాదికి రూ.కోట్లలో టర్నోవర్‌ చేసి ఉండాలంటూ పలు నిబంధనలు పెట్టినట్లు ఆ అధికారి వెల్లడించారు. ఈ నిబంధనలన్నీ ఒక్క సేఫ్‌ ఫార్మాకు మాత్రమే అనుకూలం. దీని వల్ల ఏపీఎంఎస్‌ఐడీసీ టెండర్లలో పాల్గొని ఎవరైనా ఎల్‌1గా నిలిస్తే.. అదే రేటుకు తామూ సరఫరా చేస్తామని సేఫ్‌ కంపెనీ ముందుకొస్తే 50 శాతం ఆర్డర్‌ సేఫ్‌ ఫార్మాకు ఇచ్చేయాలి. ‘సేఫ్‌’ కంపెనీ టెండర్‌లో పాల్గొనాల్సిన అవసరం లేకుండా నిబంధనలు పొందుపరిచినట్లు తెలిసింది. త్వరలోనే పరిశ్రమల శాఖ ఈ జీవో జారీ చేయనున్నట్లు సమాచారం.  

నాసిరకమని తేలినా పట్టించుకోలేదు.. 
‘సేఫ్‌’ సంస్థ గతంలో పశు సంవర్ధక శాఖ విభాగానికి పలు మందులు సరఫరా చేసింది. అయితే ఇందులో పలు మందులు అత్యంత నాసిరకమని తేలాయి. ప్రధానంగా టెట్రాసైక్లిన్‌ ఇంజక్షన్‌ అత్యంత నాసిరకమని పశు వైద్యులు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఫిర్యాదులు వస్తే ఔషధ నియంత్రణ అధికారులు మందులను ల్యాబొరేటరీకి పంపించి నిర్ధారణ చేసి.. ఆరోపణలు నిజమైతే ఆ కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టాలి. కానీ ఔషధ నియంత్రణ అధికారులు నమూనాలను తీసుకుని ల్యాబ్‌కు పంపించే సాహసం కూడా చేయలేకపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement