ఖరీఫ్‌ సాగుకు  కరువు పోటు

Katie Croft Drought In Nellore - Sakshi

ఖరీఫ్‌ సాగు రైతులను కుంగదీస్తోంది. ఇటీవల ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. మరోవైపు వేడి గాలులు పంటల సాగుపై ప్రభావం చూపుతున్నాయి. బోర్లలో భూగర్భజలాలు అడుగంటడంతో ఇప్పటికే కొన్ని బోర్లలో నీరు రావడం లేదు. మరికొన్ని బోర్లలో నీరు వస్తున్నా వరి పొలాలు తడారిపోతున్నాయి. దీంతో ఖరీఫ్‌లో పంటలు సాగుచేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగుచేసినా చేతికందుతుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. వరుణుడు కరుణించపోతాడా అన్న చివర ఆశతో ఆకాశం వైపు రైతులు ఎదురుచూస్తున్నారు.  

డక్కిలి (నెల్లూరు): ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకు కరువు పోటు తప్పడం లేదు. వరిపంటను సాగుచేసిన రైతులను వాతావరణ పరిస్థితులు నష్టాలోకి నెట్టేస్తున్నాయి. దీంతో పంటల సాగు రైతులకు ప్రశ్నార్థకంగా మారింది. డక్కిలి మండలంలో నెల్లూరు మసూర 34449, ఎంటీయూ–1010 రకం వరి పంటను సుమారు 800 హెక్టార్లలో ఖరీఫ్‌ కింద సాగు చేశారు. బోర్లు, ఏర్లను ఆధారం చేసుకొని వరి పంటను సాగుచేసిన రైతులకు ప్రస్తుతం పంటలు చేతికందుతాయా అన్న ఆందోళన నెలకొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ప్రతి ఏటా జూన్, జూలై మాసాల్లో తొలకరి వర్షాలు కురుస్తాయి. అయితే ఈ ఏడాది రైతులను తొలకరి వర్షాలు పలకరించకపోవడంతో సాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను పొందేందుకు రైతులు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది రైతులు అయిల్‌ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. మరికొంతమంది ఏర్లు, కాలువల్లో ఉన్న కొద్దిపాటి నీటితో వరి పంటకు ఆరుతడులు కడుతూ పంటను సంరక్షించుకుంటున్నారు.

కళ్లెదుటే ఎండిపోతున్న వరి 
రెండు నెలల క్రితం బోర్లలో, ఏరుల్లో నీరు పుష్కలంగా ఉంది. దీంతో రైతులు ఖరీఫ్‌ కింద తమకున్న పొలాల్లో వరి పంటను సాగు చేశారు. గత 10 రోజుల వరకు సాగునీటి కొరత ఎదుర్కొన్నారు. ప్రస్తుతం బోర్లు, ఏరుల్లో భూగర్భజలాలు అడుగంటడంతో సాగునీటి కొరతతో ఆందోళన చెందుతున్నారు. సాగునీటి కొరతతో తమ కళ్లెదుటే పంట ఎండిపోతుండడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పంటను ఎలానైనా రక్షించుకోవాలన్న ఆశతో బోర్లు వేస్తున్నా నీరు రావడం లేదు. దీంతో రైతులు మరింత అప్పుల్లో కూరుకుపోతున్నారు. నష్టపోతున్న పంటలకు పరిహారం అందించి ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు వ్యవసాయశాఖ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు.

భగీరథ యత్నం
డక్కిలి మండలంలో ప్రధానంగా నాయుడుపాళెం, చాకలపల్లి, పాతనాలపాడు, భీమవరం, కొత్తనాళ్లపాడు, లింగసముద్రం, దగ్గవోలు, మోపూరు, దందవోలు, ఆల్తూరుపాడు, తీర్థంపాడు, ఆముడూరు, శ్రీపురం, మాటుమడుగు తదితర గ్రామాల్లో ఖరీఫ్‌ కింద వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం వరి పంట వెన్ను దశ, చిరుపొట్ట దశలో ఉంది. మరో నెల రోజులు సాగునీరు అందితే రైతులకు పంట చేతికందుతుంది. ఇప్పటికే రైతులు ఎరువులు, పురుగుమందులు, కూలీలు, దుక్కుల కోసం ఎకరాకు రూ.30 వేలు ఖర్చు చేశారు. మరోవైపు సాగునీటి కొరతను తీర్చుకునేందుకు అదనంగా కొంత ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. వ్యయ ప్రయాసాలకు లోనైనా మరో వారం రోజుల్లో వరుణుడు కరుణించకపోతే డక్కలి మండలంలో సాగవుతున్న 90 శాతం వరి పంట ఎండిపోయే అవకాశం ఉందనే ఆందోళనతో రైతులు ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులకు ఆర్జీలు ఇచ్చారు.

ఎండిపోయిన డ్యామ్‌ 
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది డక్కిలి మండలంలోని చాకలపల్లి సమీపంలో ఉన్న అలపలేరు డ్యామ్‌ పూర్తిగా ఎండిపోయింది. ఈ ప్రాంతంలో డ్యామ్‌లో నీరు ఉండడం వల్ల పరిసర గ్రామాల్లోని బోర్లలో నీరు బాగా వచ్చేది. అయితే ఈ ఏడాది డ్యామ్‌ ఎండిపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లలో చుక్కనీరు రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని ఈ ప్రాంత రైతులు చెబుతున్నారు. పంటను రక్షించుకునేందుకు డ్యామ్‌ నుంచి కొంతమంది రైతులు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో ఆయిల్‌ ఇంజిన్లు, విద్యుత్‌ మోటార్లతో నీటిని పంపింగ్‌ చేకుంటున్నా మరో రెండు రోజులు మాత్రమే నీరు వస్తుందని చాకలపల్లి, యల్లావజ్జలపల్లి గ్రామాలకు చెందిన రైతులు చెబుతున్నారు.   

పంటలు ఎండిపోతున్నాయి  
గత 10 రోజుల నుంచి సాగునీటి కొరత ఎదుర్కొంటున్నాం. ఏర్లు, బోర్లలో నీరు అడుగంటడంతో అలపలేరు డ్యామ్‌ నుంచి ఆయిల్‌ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని నీరు పొలాలకు అందిస్తున్నాం. ప్రతి రోజూ ఆయిల్‌ ఇంజిన్లు నడిపేందుకు బాగా ఖర్చవుతోంది. డ్యామ్‌లో కూడా నీరు అడుగంటింది. – ఎం.వెంకటేశ్వర్లు, చాకలపల్లి, రైతు  

రూ.వేలు ఖర్చు చేయాల్సివస్తుంది 
ఖరీఫ్‌ కింద ఐదెకరాల్లో వరి పంట సాగు చేశా. బోర్లలో నీరు రాకపోవడంతో అలపలేరు డ్యామ్‌ నుంచి నీటిని పంపింగ్‌ చేసుకునేం దుకు పైప్‌ల కోసం రూ.20 వేలు ఖర్చు చేశాను. అయినా పంట చేతికి వస్తుందన్న నమ్మకం లేకుండాపోయింది. ఎండిపోయిన పంటలకు బీమా వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – మధు, చాకలపల్లి, రైతు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top