సోదరా..మత్తు వదలరా | International Anti Drugs Day Special Story | Sakshi
Sakshi News home page

సోదరా..మత్తు వదలరా

Jun 26 2020 10:51 AM | Updated on Jun 26 2020 10:51 AM

International Anti Drugs Day Special Story - Sakshi

మార్పు మంచికే.. తప్పుడు దారిలో వెళ్తున్న యువతను సన్మార్గంలో నడిపించేందుకే.. గంజాయితో పాటు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువతలో మార్పు తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటికే మద్య నిషేధానికి పకడ్బందీ చర్యలు చేపట్టింది.. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారిలో సామాజిక పరివర్తన తీసుకొచ్చేందుకు డీ ఎడిక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది.. జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరంలలో వీటిని ప్రారంభించింది. శుక్రవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వాటి గురించి తెలుసుకుందాం..

రాజమహేంద్రవరం క్రైం: గత ప్రభుత్వాల హయాంలో డ్రగ్స్‌ మాఫియా వేళ్లూనుకుపోయింది. యువకులకు గంజాయిని అలవాటు చేసే ముఠాలు పెరిగిపోయాయి. వీటిని కూకటి వేళ్లతో పెకలించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజమహేంద్రవరం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని క్రిస్టియన్‌ సమాధుల్లో గంజాయి తాగుతూ పది మంది యువకులు గత నెలలో పోలీసులకు పట్టుబడ్డారు. గంజాయి సరఫరా చేసిన వ్యక్తినీ వారు అరెస్ట్‌ చేశారు. కాకినాడ రూరల్‌ ప్రాంతంలోనూ గంజాయి విక్రయిస్తున్న ముఠాల గుట్టురట్టయింది. జిల్లాలో గంజాయి, డ్రగ్స్‌ మాఫియాలు యువతను చెడు మార్గం వైపు తీసుకెళ్తున్నాయి. ఇప్పటికే బ్లేడ్‌ బ్యాచ్‌లు ప్రధాన నగరాల్లో నేరాలకు పాల్పడుతున్నాయి. ఈ బ్లేడ్‌ బ్యాచ్‌ యువకులు నిత్యం గంజాయి తాగి అమాయకుల నుంచి నగదు, నగలు దోచుకుంటున్నారు. కొంతమంది మద్యం తాగి విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు. సరదాగా అలవాటు చేసుకున్న వ్యసనం జీవితాలను నాశనం చేస్తుంది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నివారణ చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే మద్యపాన నిషేధానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి సఫలీకృతమైంది. మద్య నిషేధంలో భాగంగా మద్యం ధరలు పెంచింది. మద్యం తాగేవారు తగ్గడంతో అమ్మకాలూ గణనీయంగా తగ్గాయి. తద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నిండాయి. ఇప్పుడు యువతను డ్రగ్స్, మద్యం నుంచి దూరం చేసేందుకు ప్రభుత్వం డీ ఎడిక్షన్‌ సెంటర్లను మరింత సమర్థంగా తీర్చిదిద్దింది. వీటికి పక్కా భవనాలతో పాటు సకల సౌకర్యాలు కల్పించి సిబ్బందిని నియమించింది.

ఎక్కడెక్కడంటే..
అన్ని జిల్లాల్లోని డీ ఎడిక్షన్‌ సెంటర్లను ఈ ఏడాది మే 29న అమరావతి నుంచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి, కాకినాడ జీజీహెచ్‌లో డీ ఎడిక్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇవి డ్రగ్స్, మద్యం మాన్పించేందుకు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి వైద్య సేవలు అందిస్తోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 15 అధునాతన పడకలతో వార్డును ఏర్పాటు చేశారు. అక్కడ వైద్య సేవలు అందించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించారు. వీటితో పాటు మద్యం మానాలనుకుని, మానలేకపోతున్న వారికి వైద్య సేవలతో పాటు కౌన్సెలింగ్‌ సెంటర్‌ పెట్టారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో 20 మందికి సేవలు అందిస్తున్నారు. మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా తగిన సలహాలు ఇస్తున్నారు. 

సేవలందించే సిబ్బంది వీరే..
ప్రతి డీ ఎడిక్షన్‌ సెంటర్‌లో ఒక మానసిక వైద్య నిపుణుడు, ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, ముగ్గురు కౌన్సిలర్లు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు వార్డు బాయ్‌లను నియమించారు. మద్యం మానాలనుకునే వారికి, దీనికి బానిసై మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. వారు కోలుకుని తిరిగి ఇంటికి వెళ్లే వరకూ ప్రత్యేక పర్యవేక్షణలో వైద్యం అందిస్తారు.  

ఇదో చక్కని అవకాశం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో డీ ఎడిక్షన్‌ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఇక్కడ చికిత్స అందించేందుకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఇప్పటికే కావాల్సిన పడకలు, రోగులకు వైద్య సేవలు అందించే పరికరాలు సిద్ధంగా ఉన్నాయి. మద్యం మానుకోవాలనుకునే వారికి ఇదో చక్కని అవకాశం. ఇక్కడకు రోజూ అనేక మంది వస్తున్నారు. కొంత మందిని ఇన్‌ పేషెంట్లుగా చేర్చుకుని వైద్య సేవలు అందిస్తున్నాం.       –సోమ సుందరరావు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, రాజమహేంద్రవరం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement