లేచింది మహిళాలోకం..

East Godavari Women Protest on Alcohol - Sakshi

మొదలయ్యింది మద్య నిషేధం

ప్రభుత్వానికి మద్దతుగా మద్యంపై మహిళల యుద్ధం

కృష్ణవరంలో నాటుసారా, బాటిళ్ల ధ్వంసం

అంతా ఒక్కటై మద్యనిషేధం వైపు అడుగులు

నెల్లిపాక తూర్పుగోదావరి ,(రంపచోడవరం): మద్యనిషేధం వైపు మహిళలు అడుగులు వేశారు. దశలవారీ మద్య నిషేధం అమలు చేయాలనే ప్రభుత్వ ఆలోచనకు తమ మద్దతు తెలిపారు. సంపూర్ణ మద్యనిషేధ గ్రామంగా తీర్చిదిద్దాలనే తలంపుతో మద్యంపై యుద్ధం ప్రకటించారు. ఎటపాక మండలం కృష్ణవరం గ్రామ పంచాయతీలో సుమారు ఆరు వందల  గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. మద్యానికి బానిసైన వారి కుటుంబాల్లో అలజడిని అణచివేయాలనే ఆలోచన మహిళల మదిలో మెదిలింది. గ్రామ వలంటీర్లు, వెలుగు వీవోలు వారికి సహకరించి వారి ఆలోచనలను ఆచరణలోకి తెచ్చారు. బుధవారం మధ్యాహ్నం పంచాయతీలోని సుమారు మూడు వందల మంది మహిళలు గ్రామ నడిబొడ్డుకు చేరారు.

వీరికి తోడుగా కొందరు యువకులు కలసిరావడంతో నాటు సారా తయారీ కేంద్రాలు, మద్యం బెల్టు షాపులపై మూకుమ్మడిగా దండెత్తారు. వారికి దొరికిన నాటు సారా క్యాన్లు, తయారీకి వాడే నల్లబెల్లం, పటిక నడిరోడ్డుపై పారబోశారు. సారా తయారీకి వాడే బెల్లం ఊట, సామగ్రి ధ్వంసం చేశారు. ఈ విధంగా పంచాయతీలోని నాలుగు గ్రామాల్లో కూడా చేసి మద్యం, సారా విక్రయదారులకు హెచ్చరిక చేశారు. పంచాయతీలోని పదిమంది వలంటీర్లు వీరికి బాసటగా నిలవడంతో సారా, మద్యం విక్రయిస్తున్న వారు మిన్నకుండిపోయారు. అమ్మకాలు సాగిస్తే అంతు చూస్తామంటూ మహిళలందరూ ముక్తకంఠంతో హెచ్చరించడంతో గిరిజన గ్రామంలో మద్యనిషేధం అమలుకు అడుగులు పడ్డాయి. గిరిజన మహిళల్లో చైతన్యం చూసిన పక్క గ్రామాల వారు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ ఆలోచనకు తమ సహకారం అందించేందుకు సిద్ధమవుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top