ఆ గుండె పదిలం..   

Heart Surgery To Child Sandeep - Sakshi

చిన్నారి సందీప్‌కు శస్త్రచికిత్స 

‘సాక్షి’ కథనానికి విశేష స్పందన 

ఆ గుండె పదిలం.. విధాత తలపునే మార్చిన మానవత్వం.. 15 నెలల పసిబిడ్డ గుండెలో రంధ్రం ఏర్పడిందని, అతడి వైద్యానికి దాతలు ఆదుకోవాలని ‘సాక్షి’ కథనం ప్రచురించిన మరుక్షణం పిల్లల నుంచి పెద్దల వరకు స్పందించారు.. అతి సామాన్యుల నుంచి మహేష్‌బాబు వంటి సూపర్‌స్టార్‌ల వరకు సాయమందించారు.. అందరి ఆశీస్సులతో ఆ బాలుడికి విజయవాడలో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. చంద్రబాబు హయాంలో తిరస్కరించినా ఆరోగ్యశ్రీ సైతం వర్తింపజేస్తామని అధికారులు తెలిపారు.

టెక్కలి రూరల్‌: నెలల వయసున్న పసిబిడ్డ గుండెలో రంధ్రం ఏర్పడిందని తెలుకుని ఆందోళనకు గురైన ఆ తల్లిదండ్రులకు ఎట్టకేలకు ఊరట లభించింది. దాతల సాయంతో శస్త్రచికిత్స జరగడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన లఖినాన త్రినాథరావు, సుజాత దంపతుల కుమారుడు సందీప్‌(15నెలలు)కు గుండెలో రంధ్రం ఏర్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఆపరేషన్‌కు లక్షలు రూపాయలు ఖర్చవుతాయని తెలిసి, అంత డబ్బులు వెచ్చించే స్థోమత లేక కుమిలిపోయారు. ఈ విషయమై గత నెల 25న ‘సాక్షి’లో ‘ఆ గుండెను కాపాడండి’ పేరిట కథనం ప్రచురితమైంది.

 దీనిపై సినీ నటుడు మహేష్‌బాబు జిల్లా ఫ్యాన్స్, సేవాసమితి అధ్యక్షుడు వంకెల శ్రీనివాస్‌ స్పందించి మహేష్‌బాబు దృష్టికి విషయం తీసుకువెళ్లారు. అనంతరం విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో బాలుడికి మంగళవారం శస్త్రచికిత్స చేయించారు. రెండు రోజుల పరిశీలన అనంతరం ఆపరేషన్‌ విజయవంతమైనట్లు వైద్యులు గురువారం ప్రకటించారు. మహేష్‌బాబు సేవా సమితితో పాటు మరికొందరు దాతలు, స్వచ్ఛంద సంఘాలు, ఉపాధ్యాయులు సైతం స్పందించి సందీప్‌కు చేయూతను అందించారు. ఎట్టకేలకు తమ కుమారుడికి సాంత్వన చేకూరడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆరోగ్యశ్రీ సైతం వర్తింపు..
టీడీపీ హయాంలో ఎన్టీఆర్‌ వైద్యసేవలో భాగంగా సందీప్‌కు గుండె శస్త్రచికిత్స చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నించగా, అప్పటి ప్రభుత్వ తీరు కారణంగా ఆమోదం రాలేదు. తాజాగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో మరిన్ని వ్యాధులు చేర్చడం, సందీప్‌ ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో సంబంధిత అధికారులు స్పందించి తక్షణం ఆరోగ్యశ్రీ వర్తింపజేశారు. మహేష్‌బాబు సహకారంతో శస్త్రచికిత్స చేసినప్పటికీ.. ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు మంజూరైతే ఆ మొత్తాన్ని చిన్నారి మందుల కోసం వెచ్చించే అవకాశముందని తల్లిదండ్రులు చెబుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top