ప్రభుత్వ నిధుల వినియోగంలో మార్గదర్శకాలు ఇలా..

Guidelines for governments funds usage - Sakshi

పశ్చిమగోదావరి, నిడమర్రు :  ప్రభుత్వ ఉద్యోగులు/ఉపాధ్యాయులకు సంబంధించి నిధుల వినియోగంలో ఫైనాన్షియల్‌ కోడ్‌ రూపంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. ప్రభుత్వం నుంచి విడుదల అయిన నిధులకు సంబంధించి నిబంధనలు ఫైనాన్షియల్‌ కోడ్‌లో పొందుపరిచి ఉన్నాయి. ప్రత్యేక నిబంధనలు లేని సందర్భంలో అవి స్థానిక సంస్థలకు కూడా వర్తిస్తాయి. ఆ కోడ్‌లో పొందుపరిచిన మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి తెలుసుకుందాం.

విడుదలైన నిధులకు ఏడాది గడువు
ప్రభుత్వం కానీ సంబంధిత అధికారి కానీ విడుదల చేసిన నిధుల మంజూరు విషయంలో మంజూరు చేసిన తేదీ నుంచి సంవత్సరం అమల్లో ఉంటుంది. ఈ ఏడాదికాలంలో విడుదల చేసిన నిధులు వినియోగించని పక్షంలో ఆ మొత్తం సొమ్ములో కొంత భాగం కూడా విడుదల చేసిన తేదీ నుంచి ఏడాది తర్వాత ఏమాత్రం వినియోగించడం చెల్లదు. ఏ సందర్భంలోనైనా అధికంగా డ్రా చేసిన నిధులకు డ్రాయింగ్‌ అధికారే బాధ్యుడు అవుతారు.

వేతన స్థిరీకరణ విషయంలో..
ఉద్యోగి వేతనంలో మూడో వంతుకు మించి పే బిల్లు నందు మినహాయింపులు ఉండరాదు.(దీనికి లోబడే బ్యాంక్‌లు లేదా ఇతర సంస్థలు అప్పులు మంజూరు చేస్తాయి). జీతంలో మినహాయింపులు మూడో వంతుకంటే తక్కువ ఉండకుండా సంబంధిత డ్రాయింగ్‌ అధికారి పరిశీలించాలి.
వేతన స్థిరీకరణ వెనుకటి తేదీ నుంచి జరిగినప్పుడు దాని(నూతన పీఆర్సీ) ఆధారంగా టీఏ బకాయిలను క్లెయిమ్‌ చేయడానికి అనుమతించబడును.
ఉద్యోగి ఆప్షన్‌ ఇచ్చినప్పటి నుంచి ఆరు నెలలలోగా వేతన స్థిరీకరణ చేయాలి.

జీతభత్యాల విషయంలో...
ఉద్యోగుల జీతభత్యాలను తదుపరి నెల ఒకటో తేదీన చెల్లించాలి.
అన్ని మేనేజ్‌మెంట్‌లలోని ఉపాధ్యాయులకు ఏప్రిల్‌ జీతాన్ని వేసవి సెలవులు ప్రారంభానికి ముందు రోజే చెల్లించాలి. (సాధారణంగా వేసవి సెలవులు ప్రతీ ఏటా ఏప్రిల్‌ 23వ తేదీన ప్రకటిస్తారు) ఆ రోజు సెలవు రోజు అయినట్టయితే మరుసటి రోజు జీతం చెల్లించాలి.
ట్రెజరీ ద్వారా జీతం పొందేవారు నెల చివరి రోజుకు 5 రోజులు మందుగా ట్రెజరీలో బిల్లులు సంబంధిత సిబ్బంది ద్వారా  సమర్పించాలి.
డ్రాయింగ్‌ అధికారి సంతకం చేసిన వార్షిక ఇంక్రిమెంట్‌/ప్రమోషన్‌ ఇంక్రిమెంట్‌/ఏదైనా ఇతర ఇంక్రిమెంట్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రం ఆ ఉద్యోగి జీతం బిల్లుకు జతపరచాలి.
పీఎఫ్, జీవిత బీమా, వృత్తి పన్ను, సహకార బ్యాంకులకు సంబధించిన తగ్గింపులు మాత్రమే జీతం బిల్లు నుంచి అధికారిక  తగ్గింపులుగా  పరిగణించాలి.  
ఉద్యోగి చెల్లించాల్సిన ఆదాయం పన్నును జీతం బిల్లుల నుంచి డ్రాయింగ్‌ అధికారే తగ్గించాలి.

కనిపించకుండా పోయిన ఉద్యోగి విషయంలో..
కనిపించకుండా పోయిన ఉద్యోగి మరణించినట్టు ధ్రువీకరణ అయ్యేవరకూ అతని జీతభత్యాలు వారసులకు చెల్లించరాదు. ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌–1972 ప్రకారం ఏడేళ్లుగా కనిపించని ప్రభుత్వ ఉద్యోగి, అతడు మరణించినట్టు భావించి అతనికి సంబంధించిన చెల్లింపులకు అతని కుటుంబ సభ్యులకు చెల్లించాలి. అయితే సంవత్సరకాలం కనిపించని ఉద్యోగి కుటుంబానికి పెన్షన్‌ చెల్లించే అవకాశం 1987 నుంచి కల్పించారు. (కుటుంబ పెన్షన్‌కు అర్హతగల ఉద్యోగులకు మాత్రమే)
ఉద్యోగి మరణించిన రోజుకు అతడు మరణించిన సమయం ఏదైననూ జీతం/సెలవు జీతం మొదలైనవి చెల్లిచాలి. సందేహం లేనపుడు లీగల్‌హేయిర్‌ ధ్రువీకరణ పత్రం దాఖలుచేయక పోయినా మరణించిన ఉద్యోగి వారసులకు అతని జీతభత్యాలు చెల్లిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top