తెలుసుకుంటే.. బాధితులకు భరోసా.!

Government Provide Guidelines For Family Members To Benefit If An Employee Dies - Sakshi

మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రయోజనాలు అనేకం 

ఆసరాగా నిలిచే జీవోలు ఎన్నో.. 

కుటుంబ సభ్యులు అవగాహన కలిగి ఉండాలి 

ఉద్యోగులు.. మీ కుటుంబానికి ముందే తెలపండి  

మరణం సహజం.. అది ఎలా సంభవిస్తుందో ఎవరికి తెలియదు. మరణానంతరం ఏమవుతుందో గానీ ఒక్కో సారి తమపై ఆధారపడి బతికే కుటుంబ సభ్యులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులైతే ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. విధి నిర్వహణలో మృతి చెందవచ్చు. సహజ మరణం కావచ్చు. సంఘ విద్రోహ శక్తుల చేతిలో హత్యకు గురికావచ్చు. అవకాశం ఉన్నంత వరకు మరణించిన ఉద్యోగికి సంబంధించిన సెటిల్‌మెంట్స్‌ ద్వారా కుటుంబ సభ్యులు లబ్ధి పొందేలా ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించాయి. ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? వచ్చే రాయితీలేంటి? అవి ఏరకంగా ఉంటాయి..? వాటి గురించి సవిరంగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి..? అనే అంశాలపై ప్రత్యేక కథనం.  
–పెదవాల్తేరు(విశాఖతూర్పు) 

ఓ ఉద్యోగి సర్వీసులో ఉన్నంత కాలం బతికుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. పదవీ విరమణ చెందిన తర్వాత సర్వీస్‌ విషయాలను తేలిగ్గానే పరిష్కరించుకోవచ్చు. అనుకోకుండా మరణిస్తే మాత్రం కుటుంబానికి సెటిల్‌మెంట్స్‌ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఉద్యోగులకు ఇలాంటి వాటిపై ముందస్తు అవగాహన ఉంటుంది. కానీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఆ స్థాయిలో అవగాహన ఉండకపోవచ్చు. ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులకు ఆ విషయాలు చెప్పకపోవచ్చు కూడా. ఇలాంటి సందర్భంలో సరీ్వసు సెటిల్‌మెంట్స్‌కు సంబంధించిన విషయాల్లో ఉద్యోగుల కుటుంబ సభ్యులకు గందరగోళం ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్వహించే ప్రక్రియ గురించి కూడా తెలియక సతమతమవుతుంటారు. ఉద్యోగి కుటుంబ సభ్యులు ఇలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు.

ఎలాంటి గందరగోళానికి గురి కావాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగి మృతి చెందితే ప్రభుత్వం మానవత్వంతో స్పందిస్తుంది. అవకాశమున్నంత వరకు మరణించిన ఉద్యోగికి సంబంధించిన సెటిల్‌మెంట్స్‌ ద్వారా కుటుంబ సభ్యులు లబ్ధి పొందేలా మార్గదర్శకాలు రూపొందించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా ఎప్పటికప్పుడు మారుతున్న కాలం పరిస్థితుల ప్రాతిపదికన సర్వీసు విషయాలను సెటిల్‌మెంట్‌ చేసే విషయంలో సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తోంది. దురదృష్టవశాత్తూ ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి కుటుంబానికి చెల్లింపులు, రాయితీలను ప్రభుత్వం అందజేస్తుంది. వీటికి సంబంధించి గత ప్రభుత్వాలు అనేక జీవోలను జారీ చేశాయి. అసలు అవేంటో ..? వాటి ప్రయోజనాలు ఎలా ఉంటాయో..? తెలుసుకుందాం.
 
సస్పెన్షన్‌లో ఉంటే.. 
ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉన్న కాలంలో మరణిస్తే సస్పెన్షన్‌ విధించిన తేదీ నుంచి మృతిచెందిన కాలం వరకు మానవతా దృక్పథంతో విధుల్లో ఉన్నట్లుగానే పరిగణిస్తారు. పూర్తిస్థాయి చెల్లింపులు ఉంటాయి. సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో మరణిస్తే... విధుల్లో ఉండగా అనుకోని సంఘటన వల్ల మరణించినా, తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల చేతిలో మృతి చెందినా తక్షణమే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లిస్తారు. 
ప్రమాద ఎక్స్‌గ్రేషియా.. 
విధి నిర్వహణలో ఉంటూ ఉద్యోగులు ప్రమాదానికి గురై మృతి చెందితే ప్రభుత్వం రూ. లక్ష ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తుంది. దీనికి సంబంధించి 2006 జూలై 7న జీవో నం. 317ను జారీ చేశారు. 
అంత్యక్రియలకు సాయం 
ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల అవసరాలకు ప్రభుత్వం రూ.15 వేలు సాయంగా చెల్లిస్తుంది. దీనికి సంబంధించి 2010 ఏప్రిల్‌æ 24న జారీ చేసిన జీవో ఎంఎస్‌ నంబర్‌ 192 ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. 

అంత్యక్రియ ఖర్చులకు.. 
ఒక ఉద్యోగి సంస్థ నుంచి అప్పులు కానీ, అడ్వాన్సులు కానీ తీసుకుని మృతి చెంది ఉంటే ఆ మొత్తాన్ని రద్దు చేస్తారు. ఉద్యోగి మరణించిన సమయానికి జీపీఎఫ్‌తో సమానమైన రూ.10 వేలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. రుణాల చెల్లింపులు, అడ్వాన్సులు రద్దు అవుతాయి. సరీ్వసులో ఉన్నప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్‌ కింద మినహాయించిన మొత్తాన్ని ఆ ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. 1974 నవంబర్‌ 9న జారీ చేసిన జీవో నంబర్‌ 55 ద్వారా పూర్తి వివరాలు పొందవచ్చు.
 
రవాణా చార్జీల కింద...  
ఉద్యోగి విధి నిర్వహణలో కానీ, మరేదైనా ప్రదేశంలో కానీ మృతి చెందితే ఆ ఉద్యోగి మృతదేహాన్ని ఇంటికి తరలించడానికి అయ్యే రవాణా చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. సంఘటన స్థలం నుంచి వారి ఇంటికి తరలింంచేందుకు వీలుగా రూ.50–300 వరకు రవాణా ఛార్జీలను ఇస్తుంది. ఈ అంశంంలో మరిన్ని వివరాలు 1985 సెపె్టంబర్‌ 15న జారీ చేసిన జీవో 1669 ద్వారా తెలుసుకోవచ్చు.  

కారుణ్య నియామకం, కరువుభత్యం 
ఉద్యోగం చేసే సమయంలో మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉపాధి కలి్పస్తారు. అర్హత ప్రాతిపదికన వివిధ స్థాయిలో ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉంది. మరణించిన ఉద్యోగికి సంబంధించిన డియర్‌నెస్‌ అలవెన్స్‌ (డీఏ)ను కుటుంబ పెన్షన్‌ కింద చెల్లించరు. కానీ కారుణ్య నియామకం పొందిన వారికి ఈ మొత్తాన్ని రెగ్యులర్‌గా చెల్లిస్తారు. ఈ వివరాలకు 1998 మే 25న జారీ చేసిన జీవో 89 ద్వారా తెలుసుకోవచ్చు. 

అవగాహన తప్పనిసరి 
ప్రభుత్వ జారీ చేసిన జీవోలపై ఉద్యోగుల కుటుంబీలకు అవగాహన అవసరం. ప్రభు త్వం అందజేసే సౌలభ్యాలను వినియోగింంచుకోవాలంటే వాటి గురించి తెలిసి ఉండాలి. ఉద్యోగుల కోసం ప్రభుత్వం పలు రకాల జీవోలను విడుదల చేసింది. వీటి గురించి తెలిస్తే త్వరితగతిన ప్రభుత్వం నుంచి సాయాన్ని పొందవచ్చు. 
– టి.శివరామప్రసాద్, ఉపసంచాలకుడు, జిల్లా ఖజానాశాఖ, విశాఖపట్నం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top