శుభకార్యానికి వెళ్లి.. కన్నీటితో తిరిగి వచ్చి.. | Go to the ceremony .. tearfully to come back .. | Sakshi
Sakshi News home page

శుభకార్యానికి వెళ్లి.. కన్నీటితో తిరిగి వచ్చి..

Aug 9 2014 11:53 PM | Updated on Sep 2 2017 11:38 AM

చేదోడువాదోడుగా ఉంటున్న కుమారుడు అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- ఈత రానప్పటికీ బాలుడిని కాపాడబోయి మృత్యుఒడిలోకి..
- జానీ మృతితో ఇంటి వద్ద విషాదం

 వినుకొండ:  చేదోడువాదోడుగా ఉంటున్న కుమారుడు అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. షేక్ చిన్నచాంద్, నబీబీ దంపతుల ఇద్దరు పిల్లల్లో చిన్నవాడు జానీ(18) కళ్లముందే నీటిలో కొట్టుకుపోయి మృత్యు ఒడిలోకి వెళ్లడాన్ని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రకాశం జిల్లా మేడిపి గ్రామానికి చెందిన బంధువులతో కలిసి  సంతోషంగా శుభకార్యానికి వెళ్లిన ఆ కుటుంబం కన్నీటితో తిరిగివచ్చింది. వివరాలిలా ఉన్నాయి... ప్రకాశం జిల్లా మేడపి గ్రామానికి చెందిన బంధువుల కేశఖండన కార్యక్రమం నల్లగొండ జిల్లా జాన్‌పహాడ్ దర్గా వద్ద నిర్వహిస్తుండడంతో  పట్టణంలోని రాణాహుస్సేన్‌పంజా వెనుక వైపున నివాసం ఉంటున్న షేక్ చాంద్, నబీబీ కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం వారితో కలిసి లారీలో బయలుదేరి వెళ్లారు.

స్నానం చేసిన తరువాతనే దర్గాలోకి వెళ్లాలనే అచారం ఉండడంతో శుక్రవారం ఉదయం స్నానం చేసేందుకు సమీపంలోని కృష్ణా నదిలోకి దర్గావలి అనే బాలుడు దిగాడు. ప్రవాహం అధికంగా ఉండి దర్గావలి నదిలో కొట్టుకుపోతుండడంతో చాంద్ కుమారుడు జానీకి ఈత రానప్పటికీ దర్గావలిని కాపాడేందుకు నదిలోకి దూకాడు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో జానీ కూడా నీటిలో కొట్టుకుపోతూ అన్నా...అన్నా అంటూ కేకలు వేయడంతో అన్న సైదా నీటిలోకి దూకాడు. సైదాకు కూడా ఈత రాదు. దీన్ని అక్కడనే ఉన్న జాలర్లు గమనించి నదిలో ఉన్న సైదా, దర్గావలిలను కాపాడారు.

 నీటిలో మునిగి మృతి చెందిన జానీని జాలర్లు బయటకు తీశారు. జానీ మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటర్‌వరకు చదివిన జానీ తండ్రి నిర్వహిస్తున్న ఫొటోస్టూడియోలో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. తమ్ముడు మృతిచెందిన సంఘటనతో అన్న సైదా సృహతప్పి పడిపోవడంతో 108 వాహనంలో ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. ఇప్పటికీ సైదా తమ్ముడి మరణాన్ని తలచుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. మృతుని తల్లిదండ్రులు, బంధువులు తల్లడిల్లుతున్నారు. వీరి ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. జరిగిన సంఘటన తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ జాన్‌బీ, సండ్రపాటి సైదా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement