గడువు తీరితే గండమే..!

Gas Cylinder Expiry Date Checking process - Sakshi

సాక్షి, పొందూరు (శ్రీకాకుళం): మనం వినియోగించే ప్రతి వస్తువుకు ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. అదేవిధంగా మనం వంట గదిలో ఉపయోగించే వంట గ్యాస్‌ సిలిండర్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. దానిని సరైన సమయంలో గుర్తించి, సిలిండర్‌ మార్చుకోవడం వలన ప్రమాదాలు నుంచి బయటపడవచ్చు.

ఎక్స్‌పైర్‌ డేట్‌ గుర్తించడం ఎలా..?
గ్యాస్‌ సిలిండర్‌పైన ఉన్న రింగ్‌ కింద నిలువుగా మూడు ఇనుప బద్దెలు ఉంటాయి. వాటిలో ఒకదానిపై లోపలి వైపు గ్యాస్‌ సిలిండర్‌ గడువు తేదీ ముద్రించి ఉంటుంది. దీనిలో సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా గుర్తించి మూడు నెలలకు ఒక ఇంగ్లిష్‌ అక్షరం చొప్పున ఏ, బీ, సీ, డీగా ముద్రిస్తారు. అంటే జనవరి నుంచి మార్చి వరకు ‘ఏ’తో సూచిస్తారు. అలాగే ఏప్రిల్‌ నుంచి జూన్‌ ‘బీ’ గాను, జూలై నుంచి సెప్టెంబర్‌ను ‘సీ’ గాను, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ను ‘డీ’ తో సూచిస్తారు. ఉదాహరణకు మీ సిలిండర్‌పై డీ 19 అని ఉంటే ఆ సిలిండర్‌ను 2019 డిసెంబర్‌ వరకు మాత్రమే ఉపయోగించాలి అని అర్థం.

గ్యాస్‌ ఏజెన్సీల నిర్లక్ష్యం
చాలా వరకు గ్యాస్‌ సిలిండర్‌లతో ప్రమాదాలు ఏజెన్సీల నిర్లక్ష్యం మూలంగా జరుగుతున్నాయి. కాలం చెల్లిన సిలిండర్‌లను ఏజెన్సీలు వినియోగదారులకు అందిస్తున్నారు. దీంతో అవి లీకవుతూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో పాటు గ్యాస్‌ వినియోగంపై వినియోగదారులకు అవగాహన లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది.

ఇటీవల జరిగిన ప్రమాదాలు
పొందూరు మండలంలోని రాపాకలో నవంబర్‌ 22, 2017న, జనవరి 02, 2018న గ్యాస్‌ లీకేజి వలన ప్రమాదం జరిగింది. అక్టోబర్‌ 10, 2018న పొందూరులోని గాంధీనగర్‌ వీధిలోను, నవంబర్‌ 09, 2018న రాపాక గ్రామంలోను, జనవరి 01, 2019న  పొందూరులోని పార్వతీనగర్‌ కాలనీలోను, జి.సిగడాం మండలం నక్కపేట గ్రామంలో డిసెంబర్‌ 13, 2017న, జనవరి 14, 2018న వాండ్రంగి గ్రామంలోను, మార్చి 01, 2019న పార్వతీనగర్‌ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం లోను, జూన్‌ 09, 2019న పైడిజోగిపేటలోను గ్యాస్‌ లీకై ప్రమాదాలు సంభవించాయి.

అప్రమత్తమవ్వండిలా...
ఏజెన్సీల నుంచి లక్షల సంఖ్యలో గ్యాస్‌ సిలండర్‌లు డిస్ట్రిబ్యూటర్‌కు వస్తుంటాయి. వాటన్నింటినీ పరిశీలించే సమయం వారికి లేకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్రమాదాలు నుంచి తప్పించుకోవచ్చునని మేధావులు సూచిస్తున్నారు. 
సిలిండర్‌ను ఎప్పుడూ నిలువుగా ఉంచాలి.
సిలిండర్‌ కన్నా స్టవ్‌ ఎత్తులో ఉండాలి.
ఇండ్లలోనైనా, హోటళ్లలో అయినా వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్‌ను ఆపాలి.
→ సిలిండర్‌ ఎక్స్‌పైర్‌ డేట్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి.

గ్యాస్‌ వాసన వస్తే..
⇒ ఇంట్లో గ్యాస్‌ వాసన వచ్చినట్లయితే వెంటనే రెగ్యులేటర్‌ను ఆఫ్‌ చేయాలి.
⇒ సిలిండర్‌ మూతకు సేఫ్టీ కప్‌ను బిగించాలి.
⇒ విద్యుత్‌ స్విచ్‌లు వేయరాదు.
⇒ అగ్గిపుల్ల వెలిగించకూడదు.
⇒ ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేలా తలుపులు, కిటికీలు తెరవాలి.
⇒ దగ్గరలోని ఎల్‌పీజీ డీలర్‌కు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top