పోరు తీరు ఖరారు | Fighting dictate the way | Sakshi
Sakshi News home page

పోరు తీరు ఖరారు

Mar 25 2014 1:14 AM | Updated on Aug 14 2018 5:54 PM

పోరు తీరు ఖరారు - Sakshi

పోరు తీరు ఖరారు

ప్రాదేశిక ముఖచిత్రం స్పష్టమైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది.

  •     జెడ్పీ బరిలో తేలిన అభ్యర్థులు
  •      ముగిసిన ఉపసంహరణ గడువు
  •      ఏజెన్సీలో బహుముఖ పోటీ
  •      చతికిలబడ్డ కాంగ్రెస్
  •  విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ప్రాదేశిక ముఖచిత్రం స్పష్టమైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. సోమవారం మధ్యాహ్నంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. 148 మంది అభ్యర్థులు పోటీ నుంచి వైదలగడంతో జిల్లాలో 39 జెడ్పీటీసీ స్థానాలకు 190 మంది ఎన్నికల సంగ్రామంలో తలపడనున్నారు.

    మెజార్టీ స్థానాల్లో ద్విముఖ పోటీ మాత్రమే ఉండనుంది. ఏజెన్సీ మండలాల్లో మాత్రం 5 నుంచి 9 మంది అభ్యర్థులు పోటీ పడుతుండడంతో విశేషం.  ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు జరిగిన జెడ్పీటీసీ స్థానాలకు 387, ఎంపీటీసీలకు 4264 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరం వివిధ కారణాలతో ఆరింటిని అధికారులు తిరస్కరించారు. కొంతమంది అభ్యర్థులు రెండు, మూడు సెట్లు నామినేషన్లు వేశారు. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా పరిగణించగా నామినేషన్ల సంఖ్య 338కి చేరుకుంది. ఇందులో గత మూడు రోజుల నుంచి 148 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
     
    సోమవారం ఒక్క రోజునే 137 మంది అభ్యర్థులు నామినేషన్లను వెనక్కు తీసుకున్నారు. దీంతో ఈ నెల 6, 8 తేదీల్లో రెండు దశల్లో జరిగే ఎన్నికల్లో 190 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలతో ఉపసంహరణకు గడువు ముగియడంతో అధికారులు స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఇది రాత్రి వరకు కొనసాగింది.
     
     ద్విముఖ పోరు

     జెడ్పీటీసీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో ద్విముఖ పోరు జరగనుంది. ఏజెన్సీ మండలాలు మినహా మిగిలిన స్థానాల్లో వామపక్ష పార్టీలు పోటీలో నిలవలేదు. బీజేపీ, బీఎస్పీ, లోక్‌సత్తా పార్టీలు మూడు, నాలుగు స్థానాలకే పరిమితమయ్యాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా  చతికిలపడింది. కేవలం 20 స్థానాల నుంచి మాత్రమే అభ్యర్థులను నిలబెట్టగలిగింది. స్వతంత్ర అభ్యర్థులను తమవైపునకు తిప్పుకోడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. అధిక స్థానాల్లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్, టీడీపీ పార్టీలకే ప్రధానంగా బరిలో నిలిచాయి. సబ్బవరం, భీమిలి,
     
    కోటపాడు జెడ్పీటీసీ స్థానాలకు ఈ రెండు పార్టీల అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. 11 మండలాల్లో స్వతంత్రులు కూడా కాలుదువుతున్నారు. అనంతగిరి, పాడేరు, డుంబ్రిగుడ మండలాల్లో 9 మంది చొప్పున అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement