బాడుగ బాగోతం | Eluru Power Distribution Department Using Rented Vehicles | Sakshi
Sakshi News home page

బాడుగ బాగోతం

Published Wed, Aug 28 2019 8:22 AM | Last Updated on Wed, Aug 28 2019 8:22 AM

Eluru Power Distribution Department Using Rented Vehicles - Sakshi

విద్యుత్‌ శాఖలో ఏడీఈలు వాడాల్సిన వాహనం, ప్రస్తుతం అధికారులు వాడుతున్న వాహనాలు ఇవి 

సాక్షి, ఏలూరు (పశ్చిమగోదావరి): తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోని ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్‌లో అద్దె వాహనాల బాగోతం బయటపడింది. కొంతమంది అధికారులు బినామీ పేర్లతో సొంత వాహనాలను వాడుకుంటుండగా, మరికొంత మంది అధికారులు వ్యానులు వినియోగించాల్సి ఉండగా జీపులను వినియోగిస్తున్నారు. అయితే సంస్థ నుంచి మాత్రం కాంట్రాక్టర్‌కు వ్యాన్‌లకు చెల్లించాల్సిన అద్దె ధరలు చెల్లిస్తున్నారు. గత మూడేళ్లుగా ఈ తంతు జరుగుతూనే ఉందని ఇటీవల ఒక అద్దె వాహన కాంట్రాక్టర్‌ ‘స్పందన’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు జీపులు వినియోగిస్తూ వ్యాన్‌లకు చెల్లించే అద్దెలు చెల్లిస్తూ సంస్థ ఖజానా నుంచి ఇప్పటివరకూ సుమారు రూ.15.73 లక్షలు కాజేశారు. 

ఎస్‌ఈ నుంచి డీఈల వరకూ..
విధి నిర్వహణలో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్న అధికారులకు సంస్థ అద్దె ప్రాతిపదికన వాహనాలను ఏర్పాటు చేస్తుంది. వీటిని బహిరంగ వేలం ద్వారా ఎవరు తక్కువ ధరకు వస్తే వారికి కాంట్రాక్ట్‌ ఇస్తుంది. కాంట్రాక్ట్‌ లభించిన వారు వాహనాలను క్యాబ్‌లుగా రిజిస్ట్రేషన్‌ చేసి ఆయా అధికారుల పనిమీద తిరగాల్సి ఉంటుంది. అయితే ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధిలో సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌తో సహా పలువురు డీఈలు కూడా సొంత వాహనాలనే (బినామీ పేర్లతో)వినియోగిస్తున్నారు. పసుపు రంగు నెంబర్‌ ప్లేటు ఉండాల్సిన వీరి వాహనాలకు మామూలు వాహనాల మాదిరి నంబర్‌ ప్లేట్లే ఉన్నాయి. 

ప్రస్తుత ఎస్‌ఈ ఈ మధ్యనే సర్కిల్‌లో విధులు చేపట్టినా పాత ఎస్‌ఈ వినియోగించిన ఏపీ 37సీఎస్‌ 1666 నెంబర్‌ కారునే వినియోగిస్తున్నారు. కనస్ట్రక్షన్స్‌ డీఈ ఏపీ 37డీపీ 4822 నెంబర్‌ గల వాహనాన్ని ట్రాన్స్‌ఫార్మర్స్‌ డీఈ ఏపీ 37సీహెచ్‌ 0222 నెంబర్‌ గల వాహనాన్ని, జంగారెడ్డి గూడెం డీఈ ఏపీ 39 ఎన్‌2492 నెంబర్‌ గల వాహనాన్ని, తాడేపల్లి గూడెం మెయింటెనెన్స్‌ డీఈ ఏపీ 37 ఏటీ 7209 నెంబర్‌ గల వాహనాన్ని, నిడదవోలు డీఈ ఏపీ 05డీఎస్‌ 9983 నెంబర్‌గల వాహనాన్ని వాడుతున్నారు. వీటిలో అన్ని వాహనాలకు రవాణా శాఖ మోటార్‌ కార్‌లుగానే రిజిస్ట్రేషన్‌ చేసింది. ఒక విధంగా ఇది రవాణా శాఖ నిబంధనలకు కూడా విరుద్ధమే.

గంగలో కలిసిన కలెక్టర్‌ ఆశయం
ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న రేవు ముత్యాల రాజు గతంలో తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన హయాంలో అద్దె వాహనాల విషయంలో జరుగుతున్న అవకతవకలు నివారించడానికి ప్రతి వాహనానికి జీపీఆర్‌ఎస్‌ ట్రాకింగ్‌ సిస్టం అమర్చాలని ఆదేశించారు. అదేకనుక అధికారులు చేసి ఉంటే వారు వినియోగించే వాహనం ఎప్పుడు ఎక్కడ తిరిగింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అనే విషయం స్పష్టంగా రికార్డుల్లో నమోదై ఉండేది. దానిని వాడకపోవడం వల్ల అధికారులకు రూ.లక్షలు కొల్లగొట్టే అవకాశం ఏర్పడింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement