ఓట్లు ఎన్ని రకాలో మీకు తెలుసా!

Different Types Of Votes In India - Sakshi

సాక్షి, గూడూరు రూరల్‌ (నెల్లూరు): భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు మనకు గుర్తింపు మాత్రమే కాదు. మన తలరాతను మనమే రాసుకునే అవకాశం. ఓటు హక్కు వినియోగంతో బాధ్యత గల పౌరులమని నిరూపించుకోవడమే. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందే. 18 ఏళ్లు నిండిన తర్వాత తొలిసారి ఓటు వేసిన వారి ఆనందం వర్ణనాతీతం. అయితే అందరూ పోలింగ్‌ కేంద్రానికే వెళ్లి ఓటు వేయలేరు. ఎన్నికల విధుల్లో ఉన్న వారు, సైనికులు, గూఢచారులు వంటి వారు తమ ఓటు హక్కును ఇతర మార్గాల్లో వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. అలాంటి ఓట్లు ఎన్నిరకాలు ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం.

సాధారణ ఓటు
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులు. ఇది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. దీనిని సాధారణ ఓటు అంటారు.
ప్రాక్సీ ఓటు 
ప్రాక్సీ ఓటును గూఢచారి, ఇంటెలిజెన్స్‌ వారు వినియోగించుకోవడానికి వీలుంటుంది. ప్రాక్సీ ఓటు అంటే తమకు బదులు ఇంకొకరిని పంపి ఓటు వేయించడం.
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు 
ఎన్నికల విధుల్లో భాగంగా ఉద్యోగులు, సిబ్బంది తాము ఉండే ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో వారు తమ స్వస్థలంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉండదు. ఇందుకు గాను పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
టెండర్‌ ఓటు 
ఎన్నికల రోజు వరకు ఓటరు జాబితాలో పేరు ఉండి పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లే సరికి పేరు గల్లంతవ్వడం చూస్తూ ఉంటాం. తమ పేరున ఉన్న ఓటును వేరొకరు వేసి ఉంటే ఈ పరిస్థితుల్లో టెండర్‌ ఓటు వేసే అవకాశం ఇస్తారు. ఈ సమయంలో తాను అంతకు ముందు ఓటు వేయలేదని సదరు ఓటరు నిరూపించుకోవాల్సి ఉంటుంది. 
సర్వీసు ఓటు 
దేశ రక్షణలో ఉన్న సైనికులు, పారామిలటరీ ఉద్యోగులు విధి నిర్వహణలో దూర ప్రాంతాల్లో ఉంటారు. దీంతో స్వగ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోలేరు. అందుకే సర్వీస్‌ ఓటును కల్పిస్తారు.
ఎన్నారై ఓటు
భారతీయ పౌరసత్వం ఉండి విద్యా, ఉద్యోగం, వ్యాపారాల కోసం ఇతర దేశాలకు వెళ్లి అక్కడే ఉంటున్న వారికి ఎన్నికల సంఘం ఫారం–6ఏ ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ఇందుకు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, వీసా నకళ్లు, పాస్‌పోర్టు తదితర వాటిని సమర్పించాల్సి ఉంటుంది. 
టోల్‌ ఫ్రీ నంబర్‌ 1950 
ఓటరు జాబితాలో ఏమైనా సందేహాలుంటే ఇతర వివరాలు తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల రాజధానుల్లో స్టేట్‌ కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top