రూ.450కోట్లతో నగరాభివృద్ధి

Devolopment Works Start With 450 Crore in PSR nellore - Sakshi

రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌

నెల్లూరు(బృందావనం): నగరంలో త్వరలో రూ.450 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు. నగరంలోని 15వ డివిజన్‌ లక్ష్మీనగర్‌లో రూ.11.20లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్లు, డ్రైనేజీ పనులకు బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలాజీనగర్‌ లక్కీబోర్డు సెంటర్‌లో కాలువపై 15 గృహాలు ఉండడంతో 100 మీటర్ల మేర రహదారి కుంచించుకుపోయిందని తెలిపారు. ఈ కారణంగా ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాను  పలు పర్యాయాలు ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో స్థానికులు రోడ్డు సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.

కాలువపై నివాసం ఉంటున్న పదిహేను గృహాల వారికి నివేశన స్థలాలు మంజూరు చేయించి పునరావాసం  కల్పించి రోడ్డును విస్తరిస్తామని వివరించారు. నగరంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. ప్రస్తుతం నగరంలో  రూ.120కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామన్నారు. నగరంలో రెండు ఫ్లయిఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణానికి అంచనాలు రూపొందించి కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపామన్నారు. మరో మూడు నెలల్లో రూ.450 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం హడ్కో నుంచి రూ.180కోట్ల రుణం తీసుకొచ్చిందన్నారు. ఆ రుణాన్ని సైతం ప్రభుత్వమే భరించి రూ.600కోట్లతో ప్రగతి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. మున్సిపల్‌ పాఠశాలల అభివృద్ధికి ఈ ఏడాది రూ.15కోట్ల నుంచి రూ.20కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. బాలాజీనగర్‌లోని శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానం స్థలం 3 ఎకరాలు, రంగనాథస్వామి దేవస్థానానికి చెందిన శ్రీఇరుకళల పరమేశ్వరి ఆలయం వద్ద ఉన్న స్థలాన్ని నక్షత్ర వనాలుగా తీర్చిదిద్ది ఆస్తులను సంరక్షించనున్నట్లు వివరించారు.

క్రిస్మస్‌ శుభాకాంక్షలు
తొలుత మంత్రి అనిల్‌కుమార్‌ నగర ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఏసుక్రీస్తు ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు గణేశం వెంకటేశ్వర్లురెడ్డి, కర్తం ప్రతాప్‌రెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, శరత్‌రెడ్డి, ఎస్కే సుభాన్, నాగూరు నాగార్జునరెడ్డి, ఫయాజ్,కిషోర్, రఫీ, కీచు, ద్వారకానాథ్‌రెడ్డి, వినయ్, ఆసిఫ్, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top