చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న డెంగీవ్యాధి

Dengue Fever In Vizianagaram - Sakshi

పిల్లల్లోనే అధికంగా విస్తరిస్తున్న వ్యాధి

ఇప్పటికే జిల్లాలో ఇద్దరు అవే లక్షణాలతో మృతి

వైద్య ఆరోగ్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం 16 కేసులు నమోదు

దత్తిరాజేరు మండలంలోని పాచలవలసకు చెందిన సిరిపురపు సుస్మిత(11) డెంగీ వ్యాధి లక్షణాలతో సోమవారం మృతి చెందింది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సిరిపురపు విశ్వనాథం, వరలక్ష్మిలకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్దకుమార్తె సుస్మితకు కొద్దిరోజుల క్రితం జ్వరం రావడంతో విజయనగరంలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

అక్కడ కొన్నాళ్లు వైద్యం అందించిన వైద్యులు డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనుమానంతో వెంటనే విశాఖ తీసుకెళ్లాలని సూచించారు. ఆ మేరకు విశాఖ తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే ఆ బాలిక మృతి చెందింది. కాగా గ్రామంలో మరికొందరు పిల్లలు సైతం జ్వరాలతో విజయనగరం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారని నలుగురు సురక్షితంగా డిశ్చార్జ్‌ కాగా మరో ఇద్దరికి డెంగీ లక్షణాలున్నట్టు తెలుస్తోందని గ్రామ 
వైఎస్సార్‌సీపీ నాయకుడు సుమల గోవిందు తెలిపారు.

భోగాపురం మండలం పోలిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన పోలిపల్లి శ్రావణి అనే ఏడేళ్ల బాలిక డెంగీ లక్షణాలతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈమెకు కూడా కొద్దిరోజుల క్రితం జ్వరం రాగా తగరపువలసలోని ఓ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆమెకు డెంగీలక్షణాలు కనిపించడంతో విశాఖ తరలించాలని చెప్పగా కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.

విజయనగరం ఫోర్ట్‌/దత్తిరాజేరు : జిల్లాలో డెంగీ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకూ ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారులు ఓ వైపు డెంగీపై అప్రమత్తంగానే ఉన్నామని చెబుతున్నా... నమోదవుతున్న కేసులు ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణ జ్వరాలుగానే మొదలై క్రమేపీ ప్లేట్‌లెట్లు తగ్గిపోతుండటం... దీనివల్ల మెరుగైన చికిత్సకు తరలించేసరికే మృత్యువాతపడటం వంటివి చోటు చేసుకోవడం విశేషం.

గ్రామాలు,పట్టణాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటోంది. కాలువలు, రోడ్డుపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. ఈ పరిస్థితులే డెంగీ వ్యాధి సోకడానికి కారణాలుగా తెలుస్తోంది.

రెండు నెలల్లో 16కేసులు

జిల్లాలో రెండు నెలల వ్యవధిలో 16 డెంగీ కేసులు నమోదయినట్టు వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల లె క్కలు తెలియజేస్తున్నాయి. కొందరు స్థానిక ఆస్పత్రిలో చేర్పించి అక్కడ పరిస్థితి విషమిస్తుండటం తో విశాఖకు తరలిస్తునఆనరు. మరికొందరు నేరుగా విశాఖపట్నం వెళ్లి డెంగీ టెస్టులు చేయించుకుని చికిత్స చేయించుకుంటున్నారు. వీరి వివరాలు నమోదు కావడం కావడం లేదు. విశాఖలో 20 మంది వరకు డెంగీతో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది.   

పిల్లల్లోనే అధికం 

డెంగీ సోకినవారిలో పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఈ వ్యాధి లక్షణాలు కలిగిన 16 మందిలో 10మంది వరకు పిల్లలే కావడం గమనార్హం. పిల్లలకు డెంగీ సోకడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటోంది. ఏ జ్వరం వచ్చినా అదేనేమోనని భయపడుతున్నారు. డెంగీ రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందడం లేదు. అందువల్ల అంతా ప్రైవేటు ఆస్పత్రులను, విశాఖపట్నం కేజీహెచ్, అక్కడి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

ఇదే అదనుగా ఆస్పత్రుల్లోనూ భారీగానే బిల్లులు వసూలు చేస్తున్నారు. ఆస్పత్రిలో చేర్పించి... తిరిగి ఇంటికి తీసుకొచ్చేసరికి రూ. 25వేల నుంచి రూ. 30వేలవరకూ ఖర్చవుతోంది. ముఖ్యంగా వైద్య పరీక్షల పేరిట ఎక్కువ ఖర్చయిపోతోందని తెలుస్తోంది.

అపారిశుద్ధ్యం తిలగింపులో నిర్లక్ష్యం

గ్రామాలు, పట్టణాల్లో చెత్తా చెదారం పేరుకుపోతున్నప్పటికీ  దాన్ని తొలగించడంలో పంచాయితీ అధికారులు, మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చిన్న పంచాయతీల్లో పారిశుద్ధ్య సిబ్బంది సరిపడినంతగా లేకపోవడం... పార్ట్‌టైమ్‌ సిబ్బందిని నియమించుకునే ఆర్థిక పరిస్థితి వారివద్ద లేకపోవడం... మునిసిపాలిటీల్లో ఉన్నా... సరైన పర్యవేక్షణ లేకపోవడమే పారిశుద్ధ్యం క్షీణించడానికి కారణాలుగా చెప్పవచ్చు.

  • ఇంటి పరిసర ప్రాంతాల్లో వృథా నీటిని నిల్వ ఉండనీయరాదు. 
  • పెంటకుప్పలు, ఇంట్లోని చెత్త చెదారం ఇంటికి దూరంగా వేయాలి. 
  • ఇళ్లలో ఉన్న అన్ని గదుల్లో దోమల మందు చల్లించుకోవాలి. 
  • దోమ తెరలు వాడడం లేదా ఇంటి కిటీకీల తలుపులకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. 
  • నీరు నిల్వ చేసే పాత్రలను వారానాకి ఒక సారి ఖాళీ చేసి మరలా నింపుకోవాలి. 
  • తాగి వదిలిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఖాళీ  డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. 
  • ఎయిర్‌ కూలర్లు, ఎయిర్‌ కండిషన్లు, పూలకుండీల్లో నీటిని తరచు మార్చాలి. 
  • నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి. క్రమంగా శుభ్రం చేసుకోవాలి. 
  • దోమ కాటునుంచి రక్షణకోసం శరీరం అంతా కప్పి ఉంచుకునే విధంగా దుస్తులు వేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలను బట్టలు లేకుండా బయట తిరగనీయకూడదు.
  • కుళాయి దగ్గర నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి.
  • జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలోగల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలి. 

డాక్టర్‌ వినోద్‌కుమార్‌ లాల్వాణీ జిల్లా కేంద్రాస్పత్రి జనరల్‌ ఫిజీషియన్‌ విజయనగరం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top