తొమ్మిదేళ్లు.. సాగని పనులు

నత్తనడకన డెల్టా ఆధునికీకరణ

శిథిలావస్థకు చేరిన లాకులు

కొన్ని అసంపూర్తి.. మరికొన్ని చేపట్టని వైనం

ఏటా తప్పని సాగునీటి ఇబ్బందులు

75 శాతం పనులపై సందిగ్ధం

జిల్లాలో డెల్టా ఆధునికీకరణ పనులు ఏళ్ల తరబడి సా..గుతూనే ఉన్నాయి. 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆధునికీకరణ పనులకు రూ.500 కోట్లు నిధులు మంజూరు చేశాయి. దాదాపు పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రూ.200 కోట్ల మేర పనులు కూడా పూర్తికాలేదు. కాలువలు, డ్రెయిన్లలో మట్టిపూడికతీత పనులు, అవసరమైనచోట రక్షణ గోడలు నిర్మించి అధికారులు చేతులు దులుపుకున్నారు. ముఖ్యమైన స్లూయిజ్‌లు, లాకులు, రెగ్యులేటర్లు, అవుట్‌ పాల్‌ స్లూయిజ్‌ల వంటి నిర్మాణాలు మాత్రం పూర్తికాలేదు. దీంతో పాటు ప్రధాన లాకులు శిథిలావస్థకు చేరుకోవడంతో రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు.  

నిడదవోలు: పశ్చిమడెల్టా పరిధిలో విజ్జేశ్వరం హెడ్‌ స్లూయిజ్‌తో పాటు ప్రధానంగా నరసాపురం కాలువ, బ్యాంకు కెనాల్, కాకరపర్రు కాలువ, గోస్తనీ నది అత్తిలి కాలువ, జంక్షన్‌ కాలువ, ఏలూరు కాలువ, ఉండి కాలువ, వీఅండ్‌ డబ్ల్యూ, ఓడబ్ల్యూ కాలువలపై 24 లాకులు ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. నరసాపురం ప్రాంతంలో మాధవాయిపాలెం, నల్లీక్రిక్, దర్భరేవు, నక్కల డ్రైయిన్, అయితంపూడి, మార్టేరు, కవిటం, పెరవలి, మొగల్తూరు, సిద్దాంతం, కోడే రు, లక్ష్మీపురం, గుమ్మంపాడు లాకులు శిథి లావస్థకు చేరుకున్నాయి. దీంతో సాగునీటి విడుదలకు ఇబ్బందులు తప్పడం లేదు. వీటిలో పెరవలి, కవిటంలో లాకుల నిర్మాణ పనులు చేపట్టినా అవి అసంపూర్తిగా మిగిలిపోయాయి.

కాకరపర్రు రెగ్యులేటర్‌ లక్షల ఎకరాలకు దిక్కు
ఉండ్రాజవరం మండలం వేలివెన్ను శివారులో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై 1874 కాటన్‌ దొర హయంలో నిర్మించిన కాకరపర్రు ప్రధాన రెగ్యులేటర్‌ (లాకులు) శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ నుంచి జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. దీనిని నిర్మించి సుమారు 143 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. పిల్లర్లు పటిష్టంగా ఉన్న రెగ్యులేటర్‌ యంత్ర సామగ్రి పూర్తిగా శిథిలమైంది. రెగ్యులేటర్‌కు ఉన్న 8 ఖానాల్లో తలుపులు, షట్టర్లు తుప్పుపట్టాయి. దీని ఫలితంగా సాగునీరు క్రమబద్ధీకరించడంలో సి బ్బంది అవస్థలు పడుతున్నారు. రెగ్యులేటర్‌ శిథిలావస్థకు చేరుకోవడంతో ఒక్కోసారి వరదనీటిని నియంత్రించలేక  పొలాలు ముంపుబారిన పడుతున్నాయి. లీకేజీలతో నీరు వృథా అవుతోంది. వంతుల వారీ విధానం అమలు చేస్తున్నా దాళ్వాలో రైతులకు పూర్తిస్థాయిలో నీటి అవసరాలు తీరడం లేదు. పక్కనే గోస్తనీ నది కాలు వపై అదే సమయంలో నిర్మించిన స్లూయిజ్‌ కూ డా శిథిలావస్థకు చేరుకోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

సా..గుతున్న నిర్మాణాలు
2012లో డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా కాకరపర్రు రెగ్యులేటర్, గోస్తనీ నది కాలువ స్లూయిజ్‌ల నిర్మాణానికి రూ.7.50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాదైనా కాలువలు కట్టే సమయంలోపు నిర్మాణాలు పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.

పనులు ఆలస్యానికి కారణాలివే..
కాలువలు కట్టే సమయం సరిపోకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని కాంట్రాక్టర్లు పెదవి విరుస్తున్నారు. ఏటా ఏప్రిల్, మేలో 45 రోజుల పాటు కాలువలకు నీటి విడుదల ఆపుతున్నారు. అయితే కాలువలో పూర్తిగా నీరు లేకుండా 35 రోజులు మాత్రమే ఉం టోంది. ఈ సమయం లాకుల నిర్మాణానికి సరిపోవడం లేదని, చేసిన పనులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. పనుల్లో భాగంగా పెద్ద ప్రాజెక్టులను ప్రోగ్రెసివ్, ఐవీఆర్‌సీఎల్‌ సంస్థలు దక్కించుకుంటున్నాయి. ముందుగా 10 శాతం అడ్వాన్సులుగా తీసుకుంటున్నా సకాలంలో పనులు పూర్తికావడం లేదు. దీంతో ఏటేటా నిర్మాణ వ్యయం పెరుగుతోంది. 2008లో పనులు చేపట్టిన సమయంలో రూ.500 కోట్ల వ్యయం అంచనా వేయగా ప్రస్తుతం రూ.1,000 కోట్లకు చేరినట్టు తెలిసింది.

పంట విరామానికి ససేమిరా
పశ్చిమ డెల్టా పరిధిలో 5.30 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండిస్తున్నారు. విజ్జేశ్వరం నుంచి జిల్లా శివారు భూములకు సాగునీరు పూర్తిస్థాయిలో చేరాలంటే ఆధునికీకరణ పనులు పూర్తిచేయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో 2010లో ప్రభుత్వం రెండేళ్ల పంట విరామం ప్రకటించాలని ప్రతిపాదనలు తెచ్చినా ప్రజాప్రతినిధులు, రైతులు అంగీకరించలేదు. దీంతో అప్పటినుంచి పంట విరామం ఆలోచనను ప్రభుత్వం పక్కన పెట్టింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top