మరో పక్షం రోజుల్లో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో భారీ కోత పడనుంది. బడ్జెట్‌లో రూ.18 వేల కోట్ల మేరకు కోత పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.
హైదరాబాద్: మరో పక్షం రోజుల్లో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో భారీ కోత పడనుంది. బడ్జెట్‌లో రూ.18 వేల కోట్ల మేరకు కోత పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. కేంద్ర, రాష్ట్రాల నుంచి రావాల్సిన రాబడులు రాకపోవడమే దీనికి కారణమని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రం రెవెన్యూ లోటులోకి వెళ్లకుండా చూసేందుకు ఆర్థిక శాఖ నానా తంటాలూ పడుతోంది.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలను సవరించడంతో కేంద్ర పన్నుల వాటా నుంచి రావాల్సిన నిధుల్లో రూ. 2 వేల కోట్లు గండిపడింది. గ్రాంట్ల రూపంలో రావాల్సిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, సత్వర సాగునీటి ప్రయోజన పథకం, స్థానిక సంస్థలకు చెందిన నిధులకు రూ. 8 వేల కోట్ల మేరకు గండిపడింది. మొత్తం రూ.పది వేల కోట్లకు కోత పడింది.
రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలోనూ భారీ లోటు ఏర్పడింది. రూ.8 వేల కోట్లు తగ్గుదల కనిపిస్తోంది. మోటారు వాహనాల పన్నుల ఆదాయం 20 శాతం మేర తగ్గింది. విభజన నేపథ్యంలో అనిశ్చితి కారణంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం, గనుల ద్వారా ఆదాయుం తగ్గిపోయింది. భూముల క్రయ, విక్రయాల సంఖ్య భారీగా పడిపోయింది. వ్యాట్ ఆదాయం కూడా పది శాతం మేర తగ్గింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం చివరలో నిధుల లభ్యత లేక ఆర్థిక శాఖ కష్టాలు పడుతోంది.
రోజువారీ అంచనాలతో చెల్లింపులు: ఏ రోజుకు ఆ రోజు లెక్కలు చూసుకుంటూ ఆర్థిక శాఖ చెల్లింపులను చేపడుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే తమ బిల్లులను ఆమోదింప చేసుకోవాలని అందరూ ప్రయుత్నిస్తున్నారు. అయితే ఆర్థిక శాఖ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ బిల్లులపై ట్రెజరీ ఆంక్షలను విధించింది. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద అత్యవసరమైన 18 రంగాల బిల్లులనే మార్చి నెలలో తీసుకోవాలని, మిగతా రంగాల బిల్లులను తీసుకోవద్దని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లం మెమో జారీ చేశారు. ఈ 18 రంగాల బిల్లుల్లో ఎన్నికల బిల్లులు ఉన్నప్పటికీ ట్రెజరీ అధికారులు ఆ బిల్లులనూ తీసుకోవడం లేదు.
వీటికి వూత్రమే చెల్లింపులు: జ్యుడీషియరీ, టీఆర్-27, పరీక్షల బిల్లులు, డైట్ చార్జీలు, అంత్యక్రియల చార్జీలు, మావోయిస్టుల హింస, కుటుంబ నియంత్రణ, మధ్యాహ్న భోజన పథకం, విద్యా వలంటీర్లు, హోంగార్డుల గౌరవ వేతనం, రాజ్‌భవన్, వేతనాలు, కాంట్రాక్టు ఉద్యోగుల బిల్లులు, విద్యుత్ వినియోగం, వాటర్, టెలిఫోన్ బిల్లులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాలు, జాతీయ అంథత్వ నివారణ మొదలైన బిల్లులకే చెల్లింపులు చేస్తున్నారు.