వ్యవ‘సాయానికి’ సోలార్ | Cultivation of crops with Solar | Sakshi
Sakshi News home page

వ్యవ‘సాయానికి’ సోలార్

Apr 22 2016 11:50 PM | Updated on Jun 4 2019 5:04 PM

వ్యవ‘సాయానికి’ సోలార్ - Sakshi

వ్యవ‘సాయానికి’ సోలార్

జిల్లాలో పంటల సాగుకు సోలార్‌తో పనిచేసే పంపుసెట్ల ఏర్పాటుకు ఏపీఈపీడీసీఎల్ రాయితీ సౌకర్యం కల్పిస్తోంది.

ఎప్పుడుంటుందో.... ఎప్పుడుండదో... చెప్పలేని విద్యుత్‌కోసం ఆరాటపడే కన్నా... అన్నివేళలా ఆదుకునే సోలార్‌ను నమ్ముకోవడమే మిన్న. ఇదే సూక్తితో వ్యవసాయానికి సోలార్ పంపుసెట్ల ఏర్పాటుకు ఏపీఈపీడీసీఎల్ ముందుకొచ్చింది. రాయితీపై అందించే ఈ సౌకర్యాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది. అర్హులైన రైతులు మ్యాచింగ్ గ్రాంట్ అందిస్తే... తాము, ప్రభుత్వం అందించే రాయితీని అందిస్తాయని చెబుతోంది.
 
* సోలార్ పంపుసెట్ల ఏర్పాటుకు ఏపీ ఈపీడీసీఎల్ ప్రోత్సాహం
* రైతులనుంచి వచ్చిన దరఖాస్తులు 1173
* అర్హులైన అర్జీదారుల సంఖ్య 899
* ఏడాది కాలంలో ఏర్పాటైన పంప్‌సెట్లు 452
* మ్యాచింగ్ గ్రాంటుకు ముందుకు రాని రైతన్నలు

విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో పంటల సాగుకు సోలార్‌తో పనిచేసే పంపుసెట్ల ఏర్పాటుకు ఏపీఈపీడీసీఎల్ రాయితీ సౌకర్యం కల్పిస్తోంది. 89శాతం సబ్సిడీతో అందించే ఈ సౌకర్యాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది. వీటికి సంబందించి రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ వరకు ఆదరణ బాగానే ఉన్నా వాటి ఏర్పాటుకు లబ్ధిదారుని వాటా చెల్లించేందుకు అనాసక్తి వ్యక్తమవుతోంది. ఏపీఈపీడీసీఎల్, రాష్ట్ర ప్రభుత్వం, నెడ్‌క్యాప్‌ల సంయుక్తంగా మంజూరు చేస్తున్న యూనిట్లకు రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు.
 
సర్కారు సాయం అంతంతే...
ప్రభుత్వమే ఈ పథకానికి రాయితీ అందిస్తోందని అట్టహాసంగా చెబుతున్నా వారిచ్చేది కేవలం ఒక శాతమే. 55శాతం ఈపీడీసీఎల్, 33శాతం నెడ్‌క్యాప్ అందిస్తుంది. 5 హెచ్‌పీ మోటారుతో సోలార్ వ్యవసాయ పంప్‌సెట్ ఏర్పాటుకు మొత్తం రూ4,29,000లు యూనిట్‌ధరగా నిర్ణయించారు. ఇందులో ఏపీఈపీడీసీఎల్ 55 శాతం, నెడ్‌క్యాప్33 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 1 శాతం రాయితీని ఇస్తుండగా.. మిగిలిన 11 శాతం మొత్తాన్ని లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కన లబ్ధిదారుడు రూ 55వేలు చెల్లించాల్సి ఉంటుంది. 3 హెచ్‌పీ మోటారు అయితే యూనిట్ విలువ రూ. 3,36,378గా నిర్ణయించారు. లబ్ధిదారుడు భరించాల్సింది రూ.40 వేలు.
 
సర్కిల్ పరిధిలో 1173 దరఖాస్తులు నమోదు
సోలార్ వ్యవసాయ పంప్‌సెట్ల ఏర్పాటుకు సంబంధించి ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో 1173 దరఖాస్తులు రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 55 వరకు ఎన్‌టీఆర్ జలసిరి పథకం కింద నమోదైన దరఖాస్తులు ఉన్నాయి. వచ్చిన వాటిలో ఏపీఈపీడీసీఎల్, నెడ్‌క్యాప్ అధికారులు 1069 దరఖాస్తులకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన చేయగా... అందులో 895 మందికి అన్ని అర్హతలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ మేరకు వారికి లబ్ధిదారుని వాటా చెల్లించాని సమాచారం అందించగా... ఇప్పటి వరకు 585 మంది మాత్రమే ఆ మొత్తాన్ని చెల్లించారు. మరో 310 మంది చెల్లించాల్సి ఉంది. లబ్ధిదారుని వాటా చెల్లించిన 585 మందిలో 452 యూనిట్లు గ్రౌండ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
 
మ్యాచింగ్ గ్రాంట్ త్వరితగతిన చెల్లించాలి
సోలార్ వ్యవసాయ పంప్‌సెట్ల కోసం దరఖాస్తు చేసుకుని అర్హులుగా గుర్తించిన వారంతా తమ వాటా కింద 11 శాతం మొత్తాన్ని త్వరితగతిన చెల్లించాలి. ఇలాంటి వారు సర్కిల్‌పరిధిలో 310 మంది వరకు ఉన్నారు. వారంతా తక్షణమే స్పందిస్తే యూనిట్లు మంజూరు చేస్తాం. నూతన సర్వీసులు పొందాలనుకునే వారు కూడా తమ దరఖాస్తులను కాల్‌సెంటర్‌లో నమోదు చేసుకోవచ్చు.
 -జి.చిరంజీవిరావు, ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement