మంచినీటి కుళాయిల కనెక్షన్ల మంజూరులో చోటుచేసుకున్న చేతివాటం ఫలితంగా ఒంగోలు నగరపాలక సంస్థ ఖజానాకు రావల్సిన లక్షల రూపాయలు పక్కతోవ పట్టాయి.
* ఆస్తి పన్ను కట్టే 28 వేల మందికి కొళాయిలే లేవట!
* పదేళ్లుగా ఇదే తంతు సాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువాయే
* నగరపాలక సంస్థకు కోట్లలో నష్టం
ఒంగోలు అర్బన్: మంచినీటి కుళాయిల కనెక్షన్ల మంజూరులో చోటుచేసుకున్న చేతివాటం ఫలితంగా ఒంగోలు నగరపాలక సంస్థ ఖజానాకు రావల్సిన లక్షల రూపాయలు పక్కతోవ పట్టాయి. కమర్షియల్ కనెక్షన్లకు బదులుగా గృహ వినియోగ కనెక్షన్లు ఇచ్చినట్టుగా రికార్డుల్లో రాసుకొని వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో లంచాలు వసూలు చేసి మున్సిపాల్టీ ప్రగతికి అవరోధాలను సృష్టించారు. దీంతో గత దశాబ్ధకాలంగా ఒంగోలు కార్పొరేషన్‌కు ఐదారు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సమాచారం.
వాటాల పంపకంలో తలెత్తిన విభేదాలు ఫలితంగా ఈ అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఒంగోలు నగరంలోనే 28 వేల మంది ఆస్తిపన్ను చెల్లించేవారికి కుళాయి కనెక్షన్లు లేనట్లు చూపించారంటే అవినీతి ఎంత యథేచ్ఛగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే భారీగా అవకతవకలు వెలుగుచూసే అవకాశం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి...
గృహ వినియోగానికి ఇచ్చే కుళాయి కనెక్షన్‌ను వాణిజ్య అవసరాలకు కూడా ఇవ్వడం వల్ల కార్పొరేషన్‌కు భారీగా నష్టం వాటిల్లింది. వ్యాపార కేంద్రాలకి, ఆసుపత్రులు, ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్, అపార్ట్‌మెంట్లకి ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా కుళాయి కనెక్షన్లు ఇచ్చి లక్షలాది రూపాయల స్వాహాకు కార్పొరేషన్లోని కొంతమంది సిబ్బంది పాల్పడ్డారు. సాధారణ కనెక్షన్ పేరుతో కమర్షియల్ కనెక్షన్లివ్వడంతో కార్పొరేషన్‌కు రావాల్సిన డబ్బు భారీగా సిబ్బంది జేబుల్లోకి చేరింది.
వాణిజ్య అవసరాలకు మంచినీటి కుళాయి కనెక్షన్ ఇవ్వాలంటే పైపు సైజులని బట్టి ట్యాప్ రేట్ డిపాజిట్, ఎస్టిమేట్ చార్జి, ట్యాప్ డొనేషన్లు వసూలు చేసి వర్క్ ఆర్డర్ ఇవ్వాలి. సాధారణ పైపు సైజు ముప్పాతిక అంగుళమైతే ట్యాప్ డొనేషన్ రూ.26,250, ట్యాప్ రేటింగ్ డిపాజిట్ రూ.750 లెక్కన ఆరు నెలల మొత్తం డిపాజిట్ (అంటే రూ.4500) తీసుకోవాలి. దూరాన్ని బట్టి వీటి రేట్లు మారుతుంటాయి. మొత్తం కలిపితే సాధారణ కమర్షియల్ నీటి కుళాయికి సుమారు రూ.35 వేల నుంచి 45 వేల వరకుంటాయి.
అదే అత్యధిక పైపు సైజు ఒకటిన్నర అంగుళమయితే దానికి ట్యాప్ డొనేషన్ రూ.63,000, ట్యాప్ రేటింగ్ డిపాజిట్ రూ. 2500 లెక్కన ఆరు నెలలు అంటే మొత్తం రూ.15వేలుతోపాటు ఎస్టిమేట్ చార్జీలుంటాయి. అత్యధిక పైపు సైజుకైతే అన్ని చార్జీలూ కలిపితే రూ.85వేల నుంచి లక్ష రూపాయల వరకూ వసూలు చేయాల్సి ఉంది. ఈ రెండు పైపు సైజులే కాకుండా అంగుళం, ఒకటింపాతిక అంగుళం సైజు పైపులు కూడా ఉంటాయి. వీటికిగాను ట్యాప్ డిపాజిట్లు రూ.42 వేలు, రూ.52 వేలున్నాయి. వీటికి ట్యాప్‌రేట్ డిపాజిట్లు, ఎస్టిమేషన్ చార్జీలు కలపాలి.
ఇవేవీ పట్టించుకోకుండా వాణిజ్య కనెక్షన్ల స్థానంలో గృహ వినియోగ కనెక్షన్లు ఇచ్చారు. దీనివల్ల సిబ్బంది జేబులు నిండగా, కార్పొరేషన్ ఖజానాకి ఆదాయం రాలేదు. నగరంలో సుమారు 150 వరకూ కమర్షియల్ సంస్థలకు, ఆపార్టుమెంట్లకు ఈ విధంగా దొంగ కనెక్షన్లు ఇచ్చినట్లు ప్రస్తుతం వెలుగుచూసింది. గత పది సంవత్సరాల నుంచి ఇదేవిధంగా కనెక్షన్లిస్తున్నా పట్టించుకునే అధికారే లేరంటే కార్పొరేషన్‌లో ఏ స్థాయిలో అవినీతి రాజ్యమేలుతోందో అర్ధమవుతుంది.
ఈ కనెక్షన్లలో కొన్నింటికి కేవలం ట్యాప్ డిపాజిట్ వసూలు చేసి మిగిలినవేవీ లేకుండా కనెక్షన్లు ఇచ్చేసినా ఇదేమని ప్రశ్నించే అధికారే కానరాలేదు. పాత ఇళ్లను పడగొట్టి అపార్ట్‌మెంట్ కట్టినా ... ఏ ఇతర వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేసినా పాత ఇంటి కుళాయి కనెక్షన్‌కే పైపు లైను సైజుని పెంచి మరీ తమ చేతివాటం ప్రదర్శించారు. కమర్షియల్ ప్రాంతాలతోపాటు, లాయర్‌పేటలో అపార్ట్‌మెంట్లు, 60 అడుగుల రోడ్డు, సుందరయ్య భవన్ రోడ్డులోని కొన్ని ఆసుపత్రులు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం.
సాధారణ మంచినీటి కుళాయికి నెలకి కేవలం రూ.60 మాత్రమే ఆదాయం వస్తుంది. రికార్డుల్లో సాధారణ కనెక్షన్‌గా రాసేసి కమర్షియల్‌గా రావల్సిన చార్జీలన్నీ వారిజేబుల్లో వేసేసుకున్నారు. ట్యాప్ ఇన్‌స్పెక్టర్లు, ఫిట్టర్లు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు, వాటర్ విభాగం క్లర్కులు పాత్ర ఇందులో ఎక్కువుగా ఉంది. వీరి మధ్య వాటాల పంపకం విషయంలో విభేదాలు రావడంతో అవినీతి వ్యవహారం బయటకొచ్చింది. దీంతో హడావిడిగా దొంగ కనెక్షన్లను తొలగించే పనిలో సిబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఒంగోలు కమిషనర్ వెంకటకష్ణ, మున్సిపల్ ఇంజినీరు శ్రీనివాసరావు ఇద్దరూ కొత్తవారే కావడంతో ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టిపెట్టినట్లు సమాచారం. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.