గజపతినగరం మండల పరిషత్ నిధుల గోల్‌మాల్‌పై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, జిల్లా మంత్రి కిమిడి మృణాళిని స్పందించాలని
గజపతినగరం రూరల్: గజపతినగరం మండల పరిషత్ నిధుల గోల్‌మాల్‌పై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, జిల్లా మంత్రి కిమిడి మృణాళిని స్పందించాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య డిమాండ్ చేశారు. ఆయన గురువారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ మండలాధ్యక్షురాలు కలెక్టర్, సీఈవో రాజకుమారికి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ అవినీతి బయట పడిందన్నారు. దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇతర మండలాల్లోనూ అవినీతి జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తెస్తానన్నారు. షిప్ట్ ఆపరేటర్లు, అంగన్వాడీ, ఫీల్ట్ అసిస్టెంట్ పోస్టులు.. చివరికి ఇసుకలో కూడా టీడీపీ నేతల చేతివాటం లేనిదే పని జరగడం లేదని ఆరోపించారు.
పనులు జరగక నిధులు వెనక్కి..
తమ హయాంలో మంజూరు చేయించిన కాలేజీ భవనం, బూర్జివలస, నరవ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టక పోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయని అప్పలనర్సయ్య ఆరోపించారు. లోగిశ గ్రామంలో పంట పొలాలకు నీరు ఇవ్వకుండా చేపల పెంపకంపై దృష్టి సారించి రైతుల పొట్టగొట్టడం సమంజసం కాదన్నారు. అదే గ్రామంలో పింఛన్ల మంజూ రులో తప్పుల తడకలు సృష్టించిన ఎంపీడీవో తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకట రావు, పీఏసీఎస్ అధ్యక్షుడు కరణం ఆదినారాయణ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గార తవుడు, బెల్లాన త్రినాథ, దేవుడు బాబు, ఎంపీటీసీ సభ్యుడు కె.పైడిపు నాయుడు, మజ్జి రామ కృష్ణ, పురిటిపెంట, బంగారమ్మ పేట గ్రామాల సర్పంచ్‌లు మండల సురేష్, బుగత సత్యనారాయణ, బుగత రాజు, బుగత తిరుపతి, పల్లె సంజీవరావు పాల్గొన్నారు.