3 లక్షల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల కొనుగోలు | Coronavirus: AP Govt Purchase of 3 lakh Rapid Test Kits | Sakshi
Sakshi News home page

3 లక్షల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల కొనుగోలు

Apr 8 2020 3:35 AM | Updated on Apr 8 2020 3:35 AM

Coronavirus: AP Govt Purchase of 3 lakh Rapid Test Kits - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ పెరుగుతున్న నేపథ్యంలో 3 లక్షల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు కొనుగోలు చేసేందుకు ఆర్డర్‌ ఇచ్చినట్లు వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి వెల్లడించారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగు రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆసుపత్రులు, జిల్లాకు ఒక కోవిడ్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఏడు ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12 వేల పీపీఈలు (పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌), 20 వేల ఎన్‌–95 మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు.  

త్వరలో 20 లక్షల ఎన్‌–95 మాస్కులు
► కొరత రాకుండా ఉండేందుకు అదనంగా పీపీఈలు, 20 లక్షల ఎన్‌–95 మాస్కుల కోసం ఆర్డర్‌ ఇచ్చాం. ప్రస్తుతం 40 లక్షల సర్జికల్‌ గ్లౌజులు, 40 లక్షల గ్లౌజులు, 12 లక్షల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. 
► పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. జిల్లాకు వంద చొప్పున నమూనాలు సేకరిస్తున్నాం. మర్కజ్‌ నుంచి వచ్చిన వెయ్యి మందికిపైగా  వ్యక్తులు, వారి సంబంధీకులు 2,500 మంది.. మొత్తం 3,500 మంది నుంచి శాంపిళ్లు సేకరించాం.
► హాట్‌స్పాట్లను గుర్తించి ఎక్కువ కేసులున్న ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నాం. 3 లక్షల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు రాగానే అంతే మందికి నిర్ధారణ పరీక్షలు చేస్తాం. 2020 ఫిబ్రవరి 5 నాటికి రాష్ట్రంలో స్విమ్స్‌లో మాత్రమే వైరాలజీ ల్యాబొరేటరీ ఉండేది. ఇప్పుడు అలాంటి ల్యాబ్‌లను ఏడింటికి పెంచి వెయ్యి పరీక్షలు చేస్తున్నాం.
► క్షయ వ్యాధికి సంబంధించి రాష్ట్రంలో 240 మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు వాటి ద్వారా కరోనా నిర్ధారణ చేస్తున్నాం. ఒక్కో మెషీన్‌ నుంచి రోజుకు 15 నుంచి 20 టెస్టులు చేస్తాం. పాజిటివ్‌ వస్తే తిరిగి వైరాలజీ ల్యాబులో మళ్లీ టెస్టులు చేస్తాం. నెగిటివ్‌ వస్తే ఇంటికి పంపిస్తాం. రోజుకు 3 వేల నుంచి 4 వేల టెస్టులు చేసే స్థాయికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం.

అన్ని వసతులతో ప్రత్యేక ఆసుపత్రులు
► జిల్లాకు రెండు వేల బెడ్స్‌ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలో ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేశాం. క్రిటికల్‌ కేర్‌ (వెంటిలేటర్స్‌) అవసరం ఉన్న వారికి అక్కడ చికిత్స చేస్తాం.
► రాష్ట్ర స్థాయిలో ఉన్న 4 కోవిడ్‌ ఆసుపత్రుల్లో 460 ఐసీయూ, 1,680 నాన్‌ ఐసీయూ పడకలు ఉన్నాయి. ఇందులో స్పెషలిస్టు డాక్టర్లు 648 మంది, పీజీ స్టుడెంట్స్‌ 792, హౌస్‌ సర్జన్లు 792, నర్సింగ్, పారామెడికల్‌ సిబ్బంది 1,152 మందిని ఏర్పాటు చేశాం. 
► ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో ఐసీయూ వెంటిలేటర్లతో 570 బెడ్స్, నాన్‌ ఐసీయూ పడకలు 8,950 అందుబాటులో ఉన్నాయి. రెండో స్టేజ్‌లో చికిత్స అందించేందుకు 4,760 నాన్‌ ఐసీయూ బెడ్లు, 181 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశాం.
► జిల్లా ఆసుపత్రుల్లో 546 మంది స్పెషలిస్టు డాక్టర్లు, 546 మంది పీజీ స్డూడెంట్లు, 273 మంది హౌస్‌ సర్జన్‌లు, 546 మంది నర్సింగ్‌ సిబ్బందిని నియమించాం. 
► వైరస్‌ రాకుండా ముందుగా ఇచ్చేందుకు  హైడ్రోక్లోరోక్విన్‌ మాత్రలు 20 లక్షలు, అజిత్రోమైసిన్‌ టాబ్‌లెట్స్‌ 14 లక్షలు ఉన్నాయి.
► డబ్ల్యూహెచ్‌ఓ, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో కరోనా నివారణకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నాం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement