కోకో.. అంటే  కాసులే!

Coco Cultivated on 57000 acres in the state - Sakshi

రాష్ట్రంలో 57,000 ఎకరాల్లో సాగు

చాక్లెట్లు, కాఫీ, కేకుల తయారీలో కోకో వినియోగం

కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతర పంటగా సాగు చేస్తున్న రైతులు

హెక్టారుకు రూ.11 వేల సబ్సిడీ అందిస్తున్న ఉద్యాన శాఖ

సాక్షి, అమరావతి: తీయదనం.. అందులోనూ చాక్లెట్‌ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి! అందువల్లనే ఏమో 2011లో భారత్‌లో 1.14 లక్షల టన్నులుగా ఉన్న చాక్లెట్ల వినియోగం 2018 నాటికి 3 లక్షల 23 వేల టన్నులకు చేరింది. యూరప్‌ దేశాల్లో అయితే మరీ ఎక్కువ. ఇటీవలి సర్వే ప్రకారం.. స్విట్జర్లాండ్‌లో ఒక్కొక్కరు ఏటా సగటున 8 నుంచి 9 కిలోల వరకు చాక్లెట్లు తింటున్నారట. ఈ చాక్లెట్ల తయారీకి ఉపయోగపడేదే.. కోకో. ఒక్క చాక్లెట్లే కాదు.. కాఫీ, కేకుల తయారీలోనూ దీన్ని వాడతారు. ఫలితంగా మంచి గిరాకీ కలిగిన ఎగుమతి పంటగా కోకో గుర్తింపు పొందింది. దీంతో రాష్ట్రంలో ఈ పంటకు  ఆదరణ పెరుగుతోంది. 

గతేడాది 10 వేల టన్నుల కోకో గింజలు ఉత్పత్తి
కోకో సాగుకు ఎర్ర నేలలు, గరప నేలలు అనువైనవి. తొలకరి నుంచి డిసెంబర్‌ వరకు ఈ మొక్కల్ని నాటవచ్చు. రాష్ట్రంలో అంతర పంటగా మూడు రకాల కోకో.. క్రయల్లో, ఫొరాస్టెరో, ట్రినిటారియోను సాగు చేస్తున్నారు. తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతంలోనూ, ఉష్ణ మండల తడి వాతావరణంలోనూ పెరుగుతోంది. కోకో చెట్లకు చిత్తడి అడవుల నీడ అవసరం. ఉద్యాన శాఖ లెక్క ప్రకారం.. మన రాష్ట్రంలో సుమారు 57 వేల ఎకరాల్లో కోకో పంట సాగవుతోంది. గతేడాది 10 వేల టన్నుల కోకో గింజలు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యాయి. కోకో రైతులకు ఉద్యాన శాఖ హెక్టారుకు రూ.11 వేల సబ్సిడీ అందిస్తోంది. కోకో కాయలు సేకరించేందుకు ప్లాస్టిక్‌ ట్రేలను సరఫరా చేస్తోంది. పాలిషెడ్స్‌ ప్లాట్‌ఫారాలూ ఏర్పాటు చేస్తోంది. కమీషన్‌ ఏజెంట్లు కోకో గింజలను కొనుగోలు చేసి చాక్లెట్‌ కంపెనీలకు సరఫరా చేస్తుంటారు. ప్రధానంగా మాండెలెజ్‌ కంపెనీ (క్యాడ్‌బరీస్‌).. రైతుల నుంచి కోకో గింజలను కొనుగోలు చేస్తోంది. ఈ కంపెనీ.. రైతులకు ఒక్కో కోకో మొక్కను రూ.4.80కు సరఫరా చేస్తోంది. సేద్యంలో మెళకువలనూ నేర్పుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి ప్రాంతంలో ఉన్న నర్సరీ నుంచి ఈ మొక్కలు సరఫరా అవుతున్నాయి. 

ఎకరాకు 200 మొక్కలు  
ఎకరా కోకో పంటకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు పెట్టుబడి అవసరం. ఎకరాకు 200 మొక్కల వరకు నాటుతుంటారు. నాటిన మూడో ఏడాది నుంచి కాపుకు వస్తుంది. పిందె వచ్చినప్పటి నుంచి కాయలు కోతకు రావడానికి ఐదు నెలల సమయం పడుతుంది. అప్పటి నుంచి ఏడాది పొడవునా పంట చేతికి వస్తుంది. ప్రతి కాయలో 25 నుంచి 45 వరకు విత్తనాలు ఉంటాయి. కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతర పంటగా వేయడం వల్ల అవసరమైన నీడ ఉంటుంది. కోకో చెట్లు రాల్చే ఆకులే ఆ పంటకు సేంద్రీయ ఎరువుగా దోహదపడతాయి. కొబ్బరి తోటల్లో ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్లు, ఆయిల్‌పామ్‌ తోటల్లో 4 క్వింటాళ్ల పైబడి దిగుబడి వస్తుంది. అయితే.. ఎలుకలు, ఉడతల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి పట్ల రైతులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

కోకో లాభదాయకమైన పంట
కోకో పంటకు అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంది. ఆఫ్రికా దేశమైన ఘనా తర్వాత అంతటి నాణ్యమైన విత్తనాలు మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. లాభదాయకమైన పంట కావడంతో రైతులకు అవగాహన కల్పించేందుకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. విస్తరణ అధికారులను కూడా నియమించాం. రైతులకు సబ్సిడీలు ఇవ్వడంతోపాటు మార్కెటింగ్‌ సౌకర్యాన్నీ కల్పిస్తున్నాం. రైతులు అదనపు సమాచారం కోసం సమీపంలోని ఉద్యాన అధికారిని లేదా యూనివర్సిటీ ఉద్యాన విభాగాన్ని సంప్రదించవచ్చు. సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. 
– చిరంజీవి చౌధురీ, కమిషనర్, ఉద్యాన విభాగం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top