భయపడొద్దు.. జాగ్రత్తలే మందు | Sakshi
Sakshi News home page

భయపడొద్దు.. జాగ్రత్తలే మందు

Published Sat, Mar 21 2020 3:22 AM

CM YS Jaganmohan Reddy Video Conference With District Collectors On Coronavirus Prevention - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా 80.9 శాతం కేసులకు సంబంధించి ఇళ్లల్లోనే ఉంటూ వైద్యం తీసుకోవడం ద్వారా నయం అయ్యింది. 13.8 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరుతున్నారు. 4.7 శాతం కేసులు మాత్రమే ఐసీయూలో ఉంచాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి ఎవరూ కలత చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీ అందరికీ చెప్పాలి.

పారాసెటమాల్, 6 యాంటీ బయాటిక్స్‌ నిల్వలు సరిపడా ఉంచాలని కేంద్రం కోరిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ మేరకు నాణ్యమైన మందుల నిల్వలు ఉండేలా చూసుకోవాలి. 

కరోనా నేపథ్యంలో జాతరలు రద్దు చేయడం లాంటి విషయాల్లో ఆదేశాలివ్వడం కంటే జిల్లా స్థాయి అధికారులు స్థానిక ప్రజలతో కలిసి కూర్చుని పరిస్థితిపై వారికి అవగాహన కల్పించాలి.

గ్రామ వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ మన బలం. దీనిని బాగా వాడుకోవాలి. ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ.. వారిని గైడ్‌ చేయాలి. ఈ వ్యవస్థ వల్లే ఎప్పటికప్పుడు విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి ఐసోలేషన్‌లోకి పంపుతున్నాం. 

జిల్లా స్థాయిలో కలెక్టర్‌ కన్వీనర్‌గా టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేశాం. జిల్లా వైద్యాధికారి, డీసీహెచ్‌లు, ఎస్‌ఈలు, ఆర్‌ఎంలు, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌లు ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఉన్నారు. ప్రతిరోజూ తప్పకుండా టాస్క్‌ఫోర్స్‌ సమావేశమై పరిస్థితిని సమీక్షించాలి. 

హోం ఐసోలేషన్, సోషల్‌ డిస్టెన్స్‌ మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. 65 ఏళ్లకు పైబడిన, కిడ్నీ వ్యాధులు, సుగర్‌తో బాధపడేవాళ్లు ఈ వైరస్‌ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రధానమంత్రి జనతా కర్ఫ్యూకు పిలుపు ఇచ్చారు. రానున్న రోజుల్లో ఇలాంటివి ఎక్కువగా చేయాల్సి వస్తుందేమో?
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాపించకుండా నిరోధించేందుకు ‘నో టూ పానిక్‌.. ఎస్‌ టూ ప్రికాషన్స్‌’ (భయపడొద్దు.. జాగ్రత్తలే ముద్దు) అన్నదే నినాదం కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ పట్ల భయంతో కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు, జాగ్రత్తలను శ్రద్ధగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా వల్ల మనుషులు పిట్టల్లా రాలతారనడం కరెక్టు కాదన్నారు. ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలతోనే రక్షణ కలుగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయమై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిస్తూ.. అవగాహన బాగా పెంచాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను ఆందోళనకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని  ఆదేశించారు. వైరస్‌ను నిరోధించడంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని, సున్నితమైన అంశాల్లో ప్రజలను చైతన్యం చేయడం ద్వారా వారే నిర్ణయాలు తీసుకునేలా చూడాలని సీఎం సూచించారు. ఇంకా సీఎం చేసిన సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి.

తీవ్ర ఆందోళనకు గురికావద్దు
– సరకులకు కొరత వస్తుందన్న ఆందోళన  అవసరం లేదు. దుకాణాలు అందుబాటులో ఉంటాయి. వాటిని మూసి వేయం. నిత్యావసర వస్తువులకు ఎట్టి పరిస్థితుల్లో కొరత రాదు. ఈ విషయాలను ప్రజలకు గట్టిగా చెప్పండి. 
– తప్పుడు సమాచారం ఇచ్చి, ఆందోళనకు గురిచేసి.. తద్వారా లాభపడాలని సరుకుల రేట్లను పెంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిత్యావసర వస్తువుల ధరలపై దృష్టి పెట్టాలి. 
– దేశం మొత్తం మీద పాజిటివ్‌ కేసులు సుమారు 191 ఉన్నాయి. మన రాష్ట్రంలో కేవలం మూడు కేసులు వచ్చాయి. ఈ ముగ్గురూ కూడా విదేశాల నుంచి వచ్చిన వారే. ఒకరు ఇటలీ, ఒకరు యూకే, ఇంకొకరు సౌదీ నుంచి వచ్చారు.
– కలెక్టర్లు, అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, ఆశావర్కర్లు, వలంటీర్లు బాగా పని చేస్తున్నారు. వీరు చేపడుతున్న చర్యల కారణంగా కరోనాకు అడ్డుకట్ట పడుతోంది. ఈ వైరస్‌ నివారణకు సంబంధించి బాగా ప్రచారం చేపట్టాలి. 
కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌   

పొరపాట్లకు తావివ్వకూడదు 
– మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దాదాపుగా ట్రీట్‌మెంట్‌ తీసుకున్నట్టే. దీన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి.
– ప్రతి గ్రామ సచివాలయానికి ఒక ఏఎన్‌ఎం, ఇద్దరు ఆశావర్కర్లు, ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్‌ ఉన్నారు. వాళ్ల ఫోన్లలో ఒక యాప్‌ ఉంటుంది. 50 ఇళ్ల డేటా ఆ యాప్‌లో ఉంటుంది. 
– ఎవరైనా విదేశాల నుంచి వస్తే.. ఏ తేదీలో వచ్చారు, ఎప్పుడు వచ్చారు, అతని ఇంట్లో ఎంత మంది ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటన్న దానిపై వైద్య శాఖకు నిరంతరం సమాచారం అందుతుంది. ఈ డేటా ఆధారంగా ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు అలర్ట్‌ అవుతున్నారు. దగ్గర్లోని ఆస్పత్రిని కూడా అలర్ట్‌ చేస్తున్నారు. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది.
– పరిస్థితి త్రీవతను బట్టి కలెక్టర్లు సమర్థవంతంగా పర్యవేక్షించాలి. ఎక్కడా పొరపాట్లకు తావివ్వొద్దు. 

ఇదీ టాస్క్‌ఫోర్స్‌ బాధ్యత 
– హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిని రోజూ పర్యవేక్షించాలి. సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తున్నారా? లేదా? అన్నది పర్యవేక్షించాలి. ఆర్టీసీ బస్సుల్లో ఇష్టం వచ్చినట్టు నిండుగా ప్రయాణికులను తీసుకెళ్లడానికి వీల్లేదు. 
– బస్సుల్లో శుభ్రత పాటిస్తున్నారా? వాటిని శానటైజ్‌ చేస్తున్నారా? లేదా? అన్నది చూడాలి.
– జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డులను కలెక్టర్లు తనిఖీ చేయాలి. కావాల్సిన మందులు ఉన్నాయా? లేదా? చూడాలి.
– 21 ఔషధాలు ఉంచాలని కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యూహెచ్‌ఓ, ఐసీఎంఆర్‌ సూచిస్తోంది. ఇవి ఉన్నాయా? లేదా? అన్నది చూసుకోవాలి.
– జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రుల్లో పొటెక్టెడ్‌ సూట్స్‌ ఉన్నాయా? లేవా? వెంటిలేటర్స్‌ ఉన్నాయా? లేవా? ఐసీయూ బెడ్స్‌ ఉన్నాయా? లేవా? అన్నది చూసుకుని ఆ మేరకు సన్నద్ధం కావాలి.

మాస్క్‌ల వినియోగంపై అవగాహన కల్పించాలి
– చాలా మంది ఎమ్మెల్యేలు మాస్క్‌లు కావాలని అడుగుతున్నారు. మాస్క్‌లు ఎవరికి అవసరం? వాటిని ఏ రకంగా వినియోగించాలి? ఎప్పుడు వినియోగించాలి? అన్న దానిపై అందరికీ అవగాహన కలిగించాలి.
– వాడిన మాస్క్‌లను రోడ్డు మీద పడేస్తే మరింత ప్రమాదకరం. వాడిన మాస్క్‌లను సరైన పద్ధతిలో డిస్పోజ్‌ చేయాలి. మాస్క్‌లు వాడుతున్న వారు ఐదు గంటలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. 
– వైద్య సిబ్బంది కచ్చితంగా మాస్క్‌లు వేసుకోవాలి.  
– పొడిదగ్గు, జ్వరం, జలుబు ఉంటే.. వాళ్లు విదేశాల నుంచి వచ్చారా? లేక విదేశాల నుంచి వచ్చిన వారిని కలిశారా.. అని ఆరా తీయాలి. అలాంటి వారెవరైనా ఉంటే 104కు కాల్‌ చేసి, ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించాలి.  
– ఈ విషయాలన్నీ గ్రామ సచివాలయాల స్థాయి వరకు వెళ్లాలి. 

ఇవన్నీ ముందు జాగ్రత్త చర్యేలే 
– స్కూళ్లకు సెలవులు ప్రకటించడం, ఇండోర్‌ అమ్యూజ్‌ మెంట్‌ పార్క్‌లు, థియేటర్లు, మాల్స్, పెద్ద దేవాలయాలు (నిత్య పూజలు జరిపిస్తూ), జిమ్స్, స్విమ్మింగ్‌ పూల్స్‌ మూసి వేయడం ముందస్తు జాగ్రత్తల కోసమే. మార్చి 31 వరకు ఈ నిర్ణయాలు అమల్లో ఉంటాయి. 
– ఆ తర్వాత పరిస్థితి గమనించి తదుపరి నిర్ణయాలు తీసుకుందాం. లోకల్‌బాడీ ఎలక్షన్స్‌ పూర్తయి ఉంటే.. వ్యవస్థ మరింత బలోపేతంగా ఉండేది. సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రజల తరఫున బాధ్యతగా ఉండేవాళ్లు. దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. 
– వచ్చే రోజుల్లో విలేజ్‌ క్లినిక్స్‌ను తీసుకు వస్తున్నాం. ఈలోగా మనకున్న సిబ్బందిని సరిగ్గా వాడుకోవాలి. పీహెచ్‌సీల్లో, ఆస్పత్రుల్లో కచ్చితంగా సిబ్బంది ఉండేలా చూసుకోవాలి. 

Advertisement
Advertisement