ఎలాంటి పొరపాట్లు జరగకూడదు : సీఎం జగన్‌

CM YS Jagan Mohan Reddy Review Meeting With Revenue Department Officials - Sakshi

ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి : సీఎం

సాక్షి, అమరావతి : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అన్నారు.  సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం రెవెన్యూ శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ ఉగాది నాటికి ఇళ్లపట్టాలు సంతృప్తికర స్థాయిలో ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారు. అత్యాధునిక పరికరాలు ఉపయోగించి భూముల సమగ్ర రీసర్వేను త్వరగా పూర్తి చేయాలని, ఈ సందర్భంగా ఎక్కడా, ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైనవారిని గుర్తిస్తారని అన్నారు.

ఈ సందర్భంగా ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉగాదికి నెలరోజులకు ముందే భూమిని అందుబాటులో ఉంచే ప్రయత్నాలు చేశామని, ఇళ్ల స్థలాల కోసం 23,448 ఎకరాలు గుర్తించామని, ఈ భూములపై పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో 20,800 ఎకరాలు, అర్బన్‌ ప్రాంతాల్లో 2,580 ఎకరాలు అందుబాటులో ఉందని, ఈ భూమి ఏ స్థితిలో ఉందన్న దానిపై పరిశీలన చేస్తున్నామన్నారు. ఇంటి నిర్మాణానికి అనుకూలంగా ఉందా? లేదా? అన్న పరిశీలన వేగంగా జరుగుతోందని తెలిపారు. గ్రామాల్లో దాదాపు 14.06 లక్షల మంది, పట్టణాల్లో 12.69 లక్షలమంది ఇళ్లస్థలాల కోసం ఎదురు చూస్తున్నారని అంచనా ఉందని,ప్రస్తుతం గుర్తించిన భూమి ద్వారా దాదాపు 9 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వగలుగుతామని అధికారులు వివరించారు. పట్టణాల్లో మరో 2 లక్షలమందికి ఇళ్లస్థలాలు ఇవ్వడానికి భూమి అందుబాటులో ఉందని, దాదాపు 15.75 లక్షలమందికి ఇంకా భూమిని సమకూర్చాల్సి ఉందంటూ ముఖ్యమంత్రికి అధికారులు నివేదిక అందించారు. 

భూముల సమగ్ర సర్వేకి సన్నద్ధం
రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వేకు సన్నద్ధంగా ఉన్నట్లు రెవెన్యూ శాఖ తెలిపింది. రీసర్వే ప్రణాళికను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ‘సమగ్ర సర్వే కోసం రూ. 1688 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశాం. మొత్తం రాష్ట్ర విస్తీర్ణం 1.63 లక్షల చ.కి.మీలు కాగా, అందులో 1.22 లక్షల చ.కి.మీ మేర సర్వే చేయనున్నాం. మిగతా 38,8000 చ.కి.మీ అటవీ భూమి కాగా, మరో 2,200 కి.మీ మేర జనావాసాలు ఉన్నాయి. మొత్తం 679 మండలాలు, 17,460 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం ఎఫ్‌ఎంబీలు 49 లక్షలు కాగా, సబ్‌ డివిజనల్‌ రికార్డెడ్‌ ఎఫ్‌ఎంబీలు 159 లక్షలు ఉన్నాయి. అలాగే భూ యజమానులు 2.36 కోట్ల మంది ఉన్నార’ని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు

రీ సర్వే ఎందుకంటే..

 • తొలిసారిగా 1880-1930ల మధ్య రైత్వారీ గ్రామాలపై రికార్డు జరిగింది. 
 • ఆ తర్వాత 1960-80 మధ్య మరోసారి సెటిల్‌మెంట్‌ గ్రామాలపై రికార్డు నిర్వహించారు. 
 • అయితే చాలా వరకు రికార్డులు పోవడం, ఉన్నదాంట్లో కూడా సమాచారం సరిగా అప్‌డేట్‌ కాకపోవడం. 
 • అలాగే క్షేత్ర స్థాయిలో ఉన్న భూములకీ, రికార్డులకూ పొంతన లేకుండా పోయింది.
 • సర్వే చేయమంటూ వస్తున్న దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నందునా.. భూ వివాదాలను తగ్గించాల్సిన అవసరం ఉంది.
 • రెవెన్యూ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కుదరడం కోసం.

విప్లవాత్మక మార్పుకు నాంది..
భూముల సమగ్ర సర్వే ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకబోతుందని అధికారులు వివరించారు. మొత్తంగా 3,17,44,060 ఎకరాల సర్వే చేపడతామని.. సర్వే మౌలిక సదుపాయాల కోసం రూ. 346 కోట్లు, ఫీల్డ్‌ సర్వే, టైటిల్‌ ఎౖంక్వెరీ కోసం రూ. 1342 కోట్లు ఖర్చు కానుందని చెప్పారు. ఇందుకోసం సీఓఆర్‌ఎస్‌ (కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్, కార్స్‌) నెట్‌వర్క్‌ వినియోగిస్తామని తెలిపారు. ప్రతి చదరపు కిలోమీటర్‌ సర్వేకు రూ. 1.1 లక్ష ఖర్చు అవుతుందన్నారు. ఈ సర్వే ద్వారా సేకరించే డేటాను రైతులకే కాకుండా గనులు, అటవీశాఖ, వ్యవసాయం, నీటిపారుదల, పోలీస్, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, రోడ్లు మరియు భవనాలు, ఇతర శాఖలకు ఉపయోగించనున్నట్టు వెల్లడించారు.

 • ఎలక్ట్రానిక్‌ టోటల్‌ స్టేషన్, జీపీఎస్‌ పరికరాల వినియోగం.
 • రోవర్స్‌ ద్వారా సమాచారణ సేకరణ చేయడంతోపాటు ఉపగ్రహాల సేవల పొందడం.
 • అర నిమిషంలో రీడింగ్‌ వచ్చేలా ఏర్పాట్లు.
 • రెండు సెంటీమీటర్లు అటు ఇటుగా ఉన్న పరిమాణంలో స్ధలాన్ని కూడా కచ్చితత్వంతో  సర్వే చేయడం.
 • ఎక్కువ పరికరాలు కొంటున్నందున సర్వే ఖర్చు తగ్గించడం.
 • ఒకేసారి మూడు వేల గ్రామాల్లో సర్వే.
 • 75 బేస్‌ స్టేషన్లు, 3440 రోవర్స్‌ ఫీల్డ్‌సర్వే, ఒక కంట్రోల్‌ సెంటర్‌.
 • సర్వే కోసం 1850 లాప్‌టాప్స్‌ వినియోగం, 700 డెస్క్‌ టాప్స్‌ వినియోగం.
 • జీఐఎస్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగం.
 • మొత్తం పరికరాల కోసం దాదాపు రూ.300 కోట్లు.
 • సర్వే సిబ్బందికి శిక్షణ, ప్రతి మూడు గ్రామాలకూ ఒక టీం.
 • ప్రతి టీంలో ముగ్గురు సర్వేయర్లు.. వీరిని పర్యవేక్షించేందుకు మండలస్థాయి సర్వేయర్‌.
 • మండల స్థాయిలో మానిటరింగ్‌ అధికారిగా తహశీల్దార్‌.
 • ప్రతి గ్రామానికి ముగ్గురు చొప్పున సర్వేకోసం కేటాయింపు.
 • మూడు విడతల్లో సర్వే.. రెండున్నర సంవత్సరాల్లో నాణ్యతతో సర్వే పూర్తిచేయాలని నిర్ణయం

చదవండి : అర్బన్‌ హౌసింగ్‌పై సీఎం జగన్‌ సమీక్ష

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top