సీఎం వైఎస్‌ జగన్‌: లబ్ధిదారుల ఎంపిక చకచకా | YS Jagan Orders To Collectors and SP's on Execution of Spandana Program - Sakshi
Sakshi News home page

లబ్ధిదారుల ఎంపిక చకచకా

Nov 13 2019 4:17 AM | Updated on Nov 13 2019 11:25 AM

CM YS Jagan Comments In Video Conference with District Collectors and SPs and Officers In Spandana Program - Sakshi

సాక్షి, అమరావతి: రేషన్‌ కార్డులు, పెన్షన్లు, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన లబ్ధిదారులను ఈ నెల 20వ తేదీ నుంచి ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘స్పందన’పై మంగళవారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ఆయా పథకాల లబ్ధిదారుల ఎంపికను డిసెంబర్‌ 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని సీఎం చెప్పారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, జగనన్న అమ్మ ఒడి, నాయీ బ్రాçహ్మణులకు నగదు, వైఎస్సార్‌ కాపు నేస్తం తదితర పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాలను గ్రామ సచివాలయాల్లో శాశ్వతంగా డిస్‌ ప్లే బోర్డులో ఉంచాలని ఆదేశించారు. ఆయా పథకాలకు అర్హులైన వారి జాబితాలను కూడా డిస్‌ ప్లే బోర్డులో ఉంచాలని సూచించారు. అర్హులైన వారు ఎలా, ఎవరికి దరఖాస్తు చేయాలనే సమాచారాన్ని కూడా అందులో పొందుపరచాలన్నారు. గ్రామాల్లోని దేవాలయాలు, చర్చిలు, మసీదులకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై కూడా మార్గదర్శకాలను ప్రదర్శించాలని సూచించారు. 

14న ‘నాడు–నేడు’ ప్రారంభం
మూడు దశల్లో రాష్ట్రంలోని 45 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లు రూపురేఖలు మార్చే మనబడి నాడు–నేడు కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీన ఒంగోలులో ప్రారభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. తొలి దశలో 15,715 స్కూళ్లలో తొమ్మిది రకాల మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3,500 కోట్లకుపైగా వ్యయం చేస్తున్నామని చెప్పారు. టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, ఫర్నిచర్, పెయింటింగ్‌ పనులు, మరమ్మతులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, హైస్కూళ్లలో అదనపు తరగతి గదులు, ప్రహరీ నిర్మాణం వంటివి ‘నాడు–నేడు’ కింద చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. ఇంత పెద్దఎత్తున గతంలో ఎప్పుడూ ఖర్చు చేయలేదని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సీఎం సూచించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను ఈ కార్యక్రమ ప్రారంభంలో భాగస్వామ్యం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. 
‘స్పందన’పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి    

తెలుగు తప్పనిసరి.. ఇంగ్లిషు మాధ్యమంలో బోధన
ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెడుతున్నప్పటికీ తెలుగు తప్పనసరి సబ్జెక్టుగా చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిషు మీడియం అమలు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఒక్కో ఏడాది తదుపరి తరగతుల్లో ఇంగ్లిషులో విద్యాబోధన చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. ఇందువల్ల పదవ తరగతిలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విధానంలో పరీక్షలు రాసే మన విద్యార్థులకు నాలుగేళ్ల వ్యవధి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు ప్రతిష్టగా తీసుకోవాలని చెప్పారు. జనవరి 1 నుంచి టీచర్లకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని, డిసెంబర్‌లోగా పాఠ్య ప్రణాళిక ఖరారు కావాలని, తల్లిదండ్రులతో ఏర్పడిన కమిటీల భాగస్వామ్యం తీసుకోవాలని, స్కూళ్లలో ఇంగ్లిషు ల్యాబ్స్‌ (ఇంగ్లిషు త్వరగా నేర్చుకోవడానికి అవసరమయ్యే సామగ్రి) కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 

అర్హులందరికీ మత్స్యకార భరోసా
ఈ నెల 21న మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి  తెలిపారు. ఈ పథకం కింద అన్‌ ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లోకి రూ.10 వేల నగదు జమ చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. నవంబరు 16లోగా సోషల్‌ ఆడిట్‌ పూర్తి చేసి, గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించాలని, అర్హులైన వారు జాబితాలో లేకపోతే వాళ్లు మళ్లీ ఎలా దరఖాస్తు చేయాలో కచ్చితంగా అందులో ఉండాలని సూచించారు. సముద్రంలో తెప్పల ద్వారా వేట సాగిస్తున్న వారికి కూడా మత్స్యకార భరోసా వర్తింçప చేస్తున్నామని చెప్పారు. సముద్రంలో వేటకు వెళ్లే వారందరికీ డీజిల్‌ సబ్సిడీ వర్తింపునకు ప్రభుత్వం ఇస్తున్న డిజిటల్‌ కార్డులు అర్హులందరికీ అందేలా కలెక్టర్లు చూడాలన్నారు.

కౌలు రైతులకు వచ్చేనెల 15 వరకు గడువు 
వైఎస్సార్‌ రైతు భరోసా పొందేందుకు ఈ నెల 15వ తేదీతో గడువు ముగుస్తుందని, అయితే కౌలు రైతులకు సంబంధించి డిసెంబర్‌ 15 వరకు గడువు పెంచామని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులతో కౌలు రైతులు ఒప్పందాలు కుదర్చుకుని, అవగాహన కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి గ్రామంలో సోషల్‌ ఆడిట్‌ చేయాలని చెప్పారు. అర్హులు ఎవరైనా మిగిలిపోతే పరిగణనలోకి తీసుకుని, వచ్చే రైతు భరోసాలో లబ్ధి కలిగించాలని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు డిపాజిట్ల చెల్లింపునకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వారికి వెంటనే డబ్బులు అందేలా చూడాలన్నారు. ఇందుకు జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీతో సమన్వయం చేసుకుని సమస్య పరిష్కరించాలని చెప్పారు. గ్రామ సచివాలయాల పక్కన పెట్టాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాల అంశంపై ఇప్పటి వరకు ఏం చేశారన్న దానిపై వచ్చే ‘స్పందన’పై సమీక్షా సమావేశంలో నివేదించాలని సీఎం ఆదేశించారు.  

ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మనకు మానస పుత్రిక లాంటిది. కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలి. మన పరిపాలన ఎలా ఉందో ఈ కార్యక్రమం ద్వారా దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. ఇందు కోసం ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఒక ఎత్తు అయితే, వచ్చే నాలుగు నెలల్లో మనం చేయాల్సిన ప్రయత్నాలు ఇంకో ఎత్తు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలి. లేని పక్షంలో భూములు కొనుగోలు చేయాలి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై కలెక్టర్లు రాత్రీ పగలు ఆలోచించాలి.

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎవరైనా భాగస్వాములు కావొచ్చు. ఆర్థిక సాయం చేసేవారి కోసం ‘కనెక్ట్‌ టు ఆంద్రా’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించాం. ఏదైనా కార్యక్రమానికి సాయం చేస్తే వారి పేరు పెడతాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement