ఆ బాధ్యత కలెక్టర్లదే: సీఎం జగన్‌ | CM YS Jagan Comments In Spandana Program Review Meeting | Sakshi
Sakshi News home page

స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష

Jul 30 2019 1:34 PM | Updated on Jul 30 2019 7:45 PM

CM YS Jagan Comments In Spandana Program Review Meeting - Sakshi

సాక్షి, అమరావతి : తాము పెట్టిన అర్జీ చెత్తబుట్టలోకి పోవడం లేదు... వాటిని కలెక్టర్లు పరిశీలిస్తున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళ్లిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆ నమ్మకంతోనే స్పందన కింద వస్తున్న దరఖాస్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రతీ కలెక్టర్ గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డ మాదిరిగా చూడాలని సూచించారు. కలెక్టర్లు ధ్యాస పెడితేనే వివిధ సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ ప్రతీ ఎమ్మార్వో కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం కూడా స్పందనలో పాల్గొంటోందా? లేదా? ప్రతి ఎమ్మార్వో, ఎంపీడీఓ స్పందనను సీరియస్‌గా తీసుకుంటున్నారనే అనుకుంటున్నా. ఎక్కడైనా అలా జరగకుంటే.. ఇకపై జరిగేలా చూసుకోండి. నా కలెక్టర్లు, ఎస్పీలు సమర్థులు అని గట్టిగా నమ్ముతున్నా. ఫోకస్ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయొద్దు. మండలాల్లో ఎక్కడా అవినీతి కూడా లేకుండా చూడాలి. ప్రజలు సంతృప్తిగా ఉండాలి. కలెక్టర్లు, ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేయాలి. అవినీతి చేస్తే సహించబోమని ప్రతి సమీక్షా సమావేశంలో చెప్పాలి. అవినీతి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డపేరు తెచ్చుకోవద్దు. ఎమ్మార్వో కార్యాలయంలో జరిగితే కలెక్టర్‌కు, పోలీస్ స్టేషన్‌లో జరిగితే ఎస్పీకి చెడ్డపేరు వస్తుంది. అందుకే ప్రతి సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నా అని అధికారులతో అన్నారు.

ఇసుక లభ్యతమై సీఎం ఆరా
‘సెప్టెంబరు నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుంది. అన్ని ర్యాంపుల్లో వీడియో కెమెరాలు ఉంటాయి. పారదర్శక విధానం ఉంటుంది. ఇసుక కొరత అన్నది లేకుండా చూడాలి. అవసరమైతే ర్యాంపులు తెరవండి.. వాటి సంఖ్య పెంచండి. అదే సమయంలో అవినీతి లేకుండా చూసుకోండి. ఇసుక లభ్యత లేకపోతే రేటు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడతారు. ఇసుక సమస్యపై కచ్చితంగా దృష్టి పెట్టండి అని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.

బకాయిలన్నీ విడుదల చేయమన్నా
మధ్యాహ్న భోజన పథకం గురించి సీఎం జగన్‌ మాట్లాడుతూ... ‘ మధ్యాహ్న భోజనం క్వాలిటీపై దృష్టిపెట్టాలి. పాత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నింటినీ విడుదల చేయలమని ఆదేశించాను. మధ్యాహ్న భోజనం పథకానికి సరైన సమయంలో డబ్బులు ఇవ్వాలి. లేకపోతే భోజనం నాణ్యత తగ్గిపోతుంది. చెల్లింపులు సకాలంలో జరగాలి. ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టిపెడుతుంది: గుడ్డు నాణ్యత బాగోలేదని నా దృష్టికి వస్తోంది. దానిపై దృష్టిపెట్టాలి. మధ్యాహ్న భోజన బాధ్యత కలెక్టర్లకే అప్పగిస్తున్నాం. పైస్థాయిలో మధ్యాహ్నభోజనంపై ఎలాంటి నిర్ణయాలు వద్దు’ అని స్పష్టం చేశారు.

అలా అయితేనే ప్రజల హృదయాలు గెలుస్తాం
‘గ్రామ, వార్డు సచివాలయాలకు భవనాల గుర్తింపు తప్పనిసరి. అన్ని వసతులు ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. కంప్యూటర్ పెట్టాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. స్కానర్ ఉండాలి. ప్రింటర్ ఉండాలి. దరఖాస్తు పెట్టిన 72 గంటల్లో రేషన్ కార్డు, పెన్షన్ కార్డు ఇచ్చేట్టు ఉండాలి. గ్రామ సెక్రటేరియట్ పెట్టిన తర్వాత అడిగిన వారికి అడిగిన కార్డు ఇచ్చేట్టు ఉండాలి. ఇలా అయితేనే గ్రామ సచివాలయానికి ఒక అర్థం వస్తుంది. అలాంటప్పుడే ప్రజల హృదయాల్లో గ్రామ సచివాలయం నిలుస్తుంది. ప్రతి కలెక్టర్ గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డ మాదిరిగా చూడాలి. సంతృప్త స్థాయిలో పథకాలు అమలు జరగాలి. గ్రామ సచివాలయాల ఉద్యోగాల కోసం ప్రతీ జిల్లాలో కూడా కనీసం లక్షమంది పరీక్షలు రాస్తున్నారు. ఇంతమంది రాయడం ఎప్పుడూ ఇలా చూడలేదు. ధ్యాస పెడితేనే.. ఇది సజావుగా జరుగుతుంది. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా... చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది. ఇంతమంది పరీక్షలు రాస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తాయి.. వాటిని ముందుగానే గుర్తించి... ఆ సమస్యలు రాకుండా చూడాలి. కలెక్టర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలి. పరీక్షలు సవ్యంగా జరగకపోతే విమర్శలు వస్తాయి. ఇక మినర్ వాటర్ ప్లాంట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లమీద కూడా దృష్టిపెట్టండి. వాటిని తిరిగి నిర్వహణలోకి తీసుకురావాలి. జిల్లాలో ఉన్న ప్లాంట్లు అన్నీ కూడా కచ్చితంగా పనిచేయాలి. కరువు పీడిత ప్రాంతాల్లో నవధాన్యాల సాగుకు దృష్టిపెట్టాలి. ఈ మేరకు రైతులను ఎడ్యుకేట్ చేయాలి అని సీఎం జగన్‌ కలెక్టర్లను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement