ఎమ్మెల్యేలు చెప్పినట్టు వినండి !

CM Chandrababu Naidu Specially reviewed In Prakasam - Sakshi

పథకాలలో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత కల్పించాలి

 జిల్లా అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం

 జిల్లాను వేగవంతంగా అభివృద్ది చేస్తున్నాం అంటూ ఊకదంపుడు 

 విస్తారమైన వనరులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు పిలుపు ఇచ్చిన సీఎం

ఒంగోలు సబర్బన్‌: ‘ఎన్నికలు దగ్గరపడుతున్నాయి...ఇక ఆరు నెలలు మాత్రమే ఉంది. అందుకు  ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చెప్పినట్లు అధికారులు వినాలి. చెప్పిన పనులు చెప్పినట్లు చేయాలి. పథకాల అమలులో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత కల్పించాలి. రానున్న ఎన్నికలకు నాయకులు సన్నద్ధం కావాలంటే ప్రభుత్వ పథకాల అమలులో ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా తయారు చేయాలని’ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన సందర్భంగా శనివారం స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. 

ఈ సమావేశానికి ఇన్‌చార్జ్‌ మంత్రి పి.నారాయణ, జిల్లా మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు కొన్ని ప్రత్యేకమైన ఆదేశాలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సమీక్ష అనంతరం జిల్లా సమాచారం పౌరసంబంధాల శాఖ అధికారులు సీఎం సమీక్షకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన మేరకు...రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లా వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. 

జిల్లాలో విస్తారమైన వనరులు ఉన్నాయని, వాటిని వినియోగించుకొని అన్ని రంగాల్లో అభివృద్ది సాధించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతికి గుంటూరు తరువాత ప్రకాశం జిల్లా అని రాబోయే రోజుల్లో జిల్లాకు మహర్దశ రాబోతుందన్నారు. జిల్లాలో విస్తారమైన కోస్తాతీరం ఉందని, మత్స్యసంపద, ఆక్వా, గెలాక్సీ గ్రానైట్‌ వనరులున్నాయని వివరించారు. వీటిని వినియోగించుకొని వృద్ధి రేటు సాధించాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు వస్తేనే ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో దొనకొండ కారిడార్, కనిగిరి నిమ్జ్, రామాయపట్నం పోర్టు, ఉద్యాన యూనివర్శిటీ, మైనింగ్‌ యూనివర్శిటీ, వ్యవసాయ యూనివర్శిటీలను ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని పథకాలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిగా  ఉండేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో సాంకేతికతను వినియోగించుకొని నేరాలు జరగకుండా పోలీస్‌ వ్యవస్థ ప్రజలకు రక్షణగా ఉండాలన్నారు.

 పోలీసులు ప్రజల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. మంత్రులతో పాటు  కలెక్టర్‌ వి.వినయ్‌ చంద్, జాయింట్‌ కలెక్టర్‌ నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్‌ టి.నిశాంతి, జిల్లా ఎస్పీ బూసరపు సత్య ఏసుబాబు,  బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, ఎమ్మెల్సీలు కరణం బలరామ కృష్ణమూర్తి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పోతుల సునీత, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, కదిరి బాబూరావు, ఏలూరి సాంబశివరావు, ఆమంచి కృష్ణమోహన్, ముత్తముల అశోక్‌ రెడ్డి, పి.డేవిడ్‌ రాజు, డోలా బాల వీరాంజనేయ స్వామి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ దివి శివరాం, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌రావు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ నూకసాని బాలాజితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top