సీఆర్‌డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన బొత్స

Assembly Special Session On AP Capital : CRDA Bill Introduced In Assembly - Sakshi

ప్రాంతీయ ఉద్యమాలు రాకూడదు..

శాసన రాజధానిగా అమరావతి

పరిపాలన రాజధానిగా విశాఖపట్నం

న్యాయ రాజధానిగా కర్నూలు

తెలంగాణ కన్నా.. రాయలసీమ వెనుబడింది

సభలో వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన : మంత్రి బుగ్గన

సాక్షి, అమరావతి : అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సీఆర్‌డీఏ రద్దు బిల్లును మున్సిపల్‌ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు. అలాగే అమరావతి అథారిటీ బిల్లును కూడా ఆయన సభ ముందు ఉంచారు. అంతకుముందు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. దీనిపై మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. అమరావతి శాసన రాజధాని, విశాఖ పరిపాలనా రాజధాని, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. విశాఖలోనే రాజ్‌భవన్‌, సెక్రటేరియట్‌ ఉంటుందన్నారు. అదే విధంగా కర్నూలులో అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ బోర్డును కూడా ఏర్పాటు చేయనున్నట్లు బుగ్గన ప్రకటించారు. అమరావతి మెట్రోపాలిటన్‌రీజియర్‌ అథారిటీ ఏర్పాటుకు సంకల్పించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై అన్ని కమిటీల నివేదికలను పరిశీలించిన తరువాతనే అభివృద్ధి వికేంద్రీకరణ జరపాలని నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు.

బిల్లు ఎంతో చారిత్రాత్మకం
సభలో వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఎంతో చారిత్రాత్మకం అన్నారు. ‘రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ బిల్లును రూపొందించాం. సమ్మిళిత అభివృద్ధి మన బాధ్యత. రాజ్యాంగం తమపై పెట్టిన బాధ్యతను నెరవేరుస్తున్నాం. స్థానిక జోన్‌లను ఏర్పాటు చేస్తాం. ప్రాంతీయ మండళ్లనూ ఏర్పాటు చేస్తాం. ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మండళ్లపై ఉంటుంది. ప్రాంతాల వారిగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించాం. దీనిలో భాగంగానే శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలులో ఏర్పాటు చేయదలచుకున్నాం. న్యాయపరమైన అంశాలన్నీ కర్నూలులోనే జరుగుతాయి. హైకోర్టు అనుమతి తరువాతనే వీటిని ఏర్పాటు చేస్తాం.

శ్రీబాగ్‌ ఒప్పందంలోనే వికేంద్రీకరణ..
పన్ను కట్టే ప్రతివారికి న్యాయం జరిగితీరాలి. కృష్ణదేవరాయలు స్థానిక సంస్థలను ఎంతో అభివృద్ది చేశారు. సామాన్య ప్రజలెవరూ రాజభవనాలను కోరుకోరు. అభివృద్ధిలో సమన భాగస్వామ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆంధ్ర అనే పదం వచ్చిన తరువాతనే తెలుగు వచ్చింది. 1937లో జరిగిన శ్రీ బాగ్‌ ఒడంబడికలో రాయలసీమ, ఆంధ్రా అభివృద్ధికి ఒప్పందాలు జరిగాయి. రాయలసీమ వెనుకబడి ఉందని అ‍ప్పుడే గుర్తించారు. వర్షాభావ పరిస్థితుల వల్లే రాయలసీమ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. శ్రీ బాగ్‌ ఒడంబడికలోనే వికేంద్రీకరణ అవసరమని చెప్పారు. దానికి అనుగుణంగానే ‍ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

వ్యవసాయ భూములను రియల్‌ ఎస్టేట్‌గా మార్చొద్దు
గత వందేళ్ల చరిత్రను చూస్తే అభివృద్ధి ముఖ్యమని కనిపిస్తోంది.1920లోనే తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్‌లో ఆంధ్ర మహాసభను పెట్టారు. ఉప ప్రాంతాలు అభివృద్ధి జరగకపోతే ఉద్యమాలు తప్పవు. తెలంగాణ ఏర్పాటు కూడా అదే కోవకు చెందుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమకు ఎక్కడా పోలిక లేదు. ఉప ప్రాంతాలకు ప్రత్యేక అవసరాలున్నాయి. ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా ఉండాలంటే ఉప ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తెలంగాణ ఏర్పాటుపై నియమించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ అనేక అంశాలను పరిశీలించింది. ఆ కమిటీ కూడా తెలంగాణ కన్నా.. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని కమిటీ రిపోర్టులో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం రాజధానిపై నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలని సూచించింది. ఒకే నగరాన్ని అభివృద్ధి చేయవద్దని కమిటీ తెలిపింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని తేల్చిచెప్పింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు వ్యవసాయానికి అత్యంత అనుకూలమని కమిటీ అభిప్రాయపడింది. వ్యవసాయ భూములను రియల్‌ ఎస్టేట్‌గా మార్చవద్దని కూడా సూచించింది. జియలాజికల్ సర్వే కూడా పెద్ద పెద్ద భవనాలు, కట్టడాలు నిర్శించవద్దని కమిటీ తెలిపింది. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పింది’ అని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top