ఆక్వా రైతులు అప్రమత్తం


= సూపర్‌సైక్లోన్‌గా ‘లెహర్’

 = మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సురేష్


 

కైకలూరు, న్యూస్‌లైన్ : తుపాను సమయాల్లో ఆక్వా రైతులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కైకలూరు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి (ల్యాబ్) పీ సురేష్ సూచించారు. వరుస తుపానులు సంభవిస్తున్న నేపథ్యంలో ఆక్వారైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోమవారం ఆయన న్యూస్‌లైన్‌కు వివరించారు. ఇటీవల కాలంలో నీలం, ఫై-లీన్, హెలెన్ వంటి తుపానులు ఆక్వారైతులను కోలుకోలేని దెబ్బతీయగా, తాజాగా ‘లెహర్’ తుపాను రాకాసి చుట్టుముడుతుందనే వార్తలతో ఆక్వా రైతు అల్లాడిపోతున్నారని చెప్పారు.జిల్లాలో దాదాపు 80 వేల ఎకరాల్లో చేపల చెరువులు, 40 వేల ఎకరాల్లో రొయ్యలసాగు జరుగుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో వరి రైతులతో పాటు ఆక్వారైతులు విపరీతంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రస్తుతం ముంచుకొస్తున్న లెహర్ సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులు ముందు జాగ్రత్తలు తీసుకుని నష్ట తీవ్రతను తగ్గించుకోవచ్చని చెప్పారు.

 

గట్లను పటిష్ట పర్చడం....బలహీనంగా ఉన్న గట్లను పటిష్ట పరుచుకోవడమే కాకుండా, ఇసుక బస్తాలను చెరువు వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని, గట్ల వెంబడి ఉన్న బలహీనమయిన, ఎండిపోయిన చెట్లను తొలగించుకోవాలని సురేష్ సూచించారు. చెరువులో నీరు నిండుగా ఉన్నట్లుయితే అధిక వర్షం వచ్చినప్పుడు  పొర్లిపోకుండా  కొంతమేర నీటిని బయటకు పంపేసి మూడు అడుగుల నీరు పట్టెలా ఖాళీగా ఉంచాలన్నారు.  చెరువు వద్ద జియోలైట్, సున్నం, హైడ్రోజన్ ఫెరాక్త్సెడ్ మందులు, టార్చిలైటు, డీజిల్ ఆయిల్‌ను నిల్వ చేసుకోవాలని తెలిపారు. చెరువు అడుగు భాగాన తూములను సరిచూసుకోవాలని చెప్పారు.

 

నీటి పరీక్షలు....చెరువు నీటిలో ఉన్న అమ్మోనియా, నైట్త్రెటు పరీక్షలు చేయించుకొని తగిన మందులు వాడితే ఆక్సిజన్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుందని సూచించారు. వర్షం తగ్గిన వెంట నే ఎకరాకు 15 నుంచి 20 కేజీల సున్నం వాడాలని, ఎరువులు, పేడ, కోళ్ల ఎరువు  వాడకూడదని చెప్పారు.  చెరువుల్లో మేతలు తగ్గించి కట్టుకోవాలని, అసలు వర్షం తగ్గే వరకు మేతలు పూర్తిగా మానివేయడం ఉత్తమమన్నారు. ప్రధానంగా ప్లాంక్టాను, పసరు అధికంగా ఉన్న చెరువుల్లో మేతలు పూర్తిగా మానివేయాలని, ఒకవేళ మేతలు కడితే అందులో విటమిన్ ‘సీ’ కలిపితే మంచిదని చెప్పారు. తడిసిన, బూజుపట్టిన మేతలను ఉపయోగించరాదు.

 

వెనామి రొయ్యల రైతులకు సూచనలు..తుపాను సమయంలో చెరువుల్లో పిల్ల వేయరాదని మత్స్యశాఖాధికారి సూచించారు. కౌంటుకు వస్తే వెంటనే పట్టుబడి చేయడం ఉత్తమమని తెలిపారు. వర్షం నీటిని చెరువులో పై తూము ద్వారానే బయటకు పంపాలని చెప్పారు.రొయ్యలకు ఒత్తిడి తగ్గించే అయోడిన్, బ్రోమిన్‌ను దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. అవసరమైతే మత్య్సశాఖ అధికారుల సూచనలు, సలహాలు తీసుకుని పాటిస్తే కొంతమేర నష్టాలను నివారించవచ్చని  చెబుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top