అమాత్యా.. ఇది తగునా! | Sakshi
Sakshi News home page

అమాత్యా.. ఇది తగునా!

Published Mon, May 28 2018 11:28 AM

AP Government Didnt Permintion For ACC mining In YSR Kadapa - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప : ఒకటి కాదు...రెండు కాదు...ఏకంగా 23ఏళ్లు ఎదురుచూపులు...వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలోని వద్దిరాల పరిసర గ్రామాల్లో సిమెంటు ఫ్యాక్టరీ నెలకొల్పుతామని అసోషియేటెడ్‌ సిమెంటు కంపెనీ (ఏసీసీ) లిమిటెడ్‌ 1995 సంవత్సరం నుంచి పలు దఫాలుగా సుమారు 3వేల ఎకరాల పంట పొలాలను రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఫ్యాక్టరీ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఉపాధి లభిస్తోందని, తక్కువ ధరతో భూములిచ్చిన వందలాది మంది రైతుల నోట్లో మన్ను కొట్టిన ఏసీసీ నేటికి ఫ్యాక్టరీ నిర్మాణం మొదలెట్టలేదు.

తుపాకీ నీడలో సదస్సు నిర్వహణ...
2015 మైనింగ్‌ చట్టం (ఎంఎంబిఆర్‌) ప్రకారం 2016 అక్టోబర్‌ 29లోగా అనుమతులు తీసుకోకపోతే కంపెనీ టీఓఆర్‌ రద్దు అవుతుంది. సొంత భూముల్లోని గనులు సైతం వేలంలోనే పాడుకోవాల్సి వస్తుంది. దాంతో బయపడ్డ ఏసీసీ యాజమాన్యం పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ కాలుష్యనియంత్రణ మండలికీ 2016లో దరఖాస్తు చేసుకుంది. ఫ్యాక్టరీ నిర్మాణంపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవడంలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి అప్పటి జిల్లా కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ అధ్యక్షతన 2016 సెప్టెంబర్‌ 9వతేదీన ప్రజాభిప్రాయసేకరణ సదస్సును ఏర్పాటు చేసింది. ఫ్యాక్టరీ నిర్మిస్తామని గత రెండు దశాబ్దాలుగా మోసపుచ్చుతూ వచ్చిన ఏసీసీ యాజమాన్యం ఇప్పుడు  నిర్మిస్తుందన్న నమ్మకం తమకు లేదని, ముందు తమ సమస్యలను పరిష్కారించాకే సదస్సు నిర్వహించాలంటూ మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ జయశ్రీ, జమ్మలమడుగు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాధిత రైతులు సదస్సును అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కయిన రాష్ట్ర ప్రభుత్వం 500 మందికిపైగా పోలీసులను రంగంలోకి దింపి 2016 అక్టోబర్‌ 20న తుపాకీ నీడలో ప్రజాభిప్రాయసేకరణ సదస్సును మమ అన్పించింది.

పెండింగ్‌లో మైనింగ్‌ దరఖాస్తులు...
సదస్సు నిర్వహణ పూర్తి కావడంతో ఇక తమకు మైనింగ్‌ అనుమతులు మంజూ రు చేయాలని ఏసీసీ యాజమాన్యం అదే ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే రెండేళ్లుగా ఈ ఫైలు రాష్ట్ర సచివాలయం వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం తమకు అనుమతులు మంజూరు చేసిన వెంటనే ఫ్యాక్టరీ నిరా ్మణం మొదలు పెట్టడానికి తాము సిద్ధం గా ఉన్నామని ఏసీసీ డైరెక్టర్‌ నారాయణరావు ఇక్కడి రైతులకు తరచూ ఫోన్‌ ద్వారా వివరిస్తూ వస్తున్నారు.కాగా,అధికారపార్టీ పెద్దలు–కంపెనీ యాజమాన్యం మధ్య పర్సెంటేజీల విషయంలో రహస్య ఒప్పందాలు ఓ కొలిక్కి రాకపోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు నిలిపివేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ ఏదో ఒక అబద్ధం చెప్పి రైతుల చెవిలో పూలుపెట్టి ఇంకొంతకాలం పొద్దు పుచ్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.

గంటకో మాట...
జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి  మొదటి నుంచి ఏసీసీ బాధిత రైతులను మోసగిస్తూనే వస్తున్నారని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. తనను నమ్మి సదస్సు నిర్వహణకు సహకరించాలంటూ 2016 సెప్టెంబర్‌ 9న రైతులను కోరిన ఆది  ఫ్యాక్టరీ నిర్మించకుండా ఇన్నాళ్లు ఆలస్యం చేసినందుకు కంపెనీ నుంచి ఎకరాకు రూ.3.50 లక్షలు నష్ట పరిహారం ఇప్పిస్తామని సభా సాక్షిగా రైతులకు హామీ ఇచ్చారు. సమస్యలను పరిష్కరించి మూడు నెలల్లో ఫ్యాక్టరీ నిర్మాణం మొదలు పెట్టిస్తానని ముఖ్యమంత్రి స్వయంగా తనకు హామీ ఇచ్చారని అదే ఏడాది అక్టోబర్‌లో ఆది  రైతులను భ్రమల్లో దించారు. సదస్సు పూర్తి అయిన తర్వా త ఆదినారాయణరెడ్డి రైతులతో మాట్లాడుతూ 2017 ఉగాది నాటికి పరిహారం డబ్బులు మీ అకౌంట్లుల్లో జమ అవుతాయని, ఆ డబ్బులతోనే ఉగాది పండగ చేసుకోండంటూ ఊదరగొట్టారు. 2018 ఉగాది కూడా ముగిసినప్పటికీ ఇటు నష్టపరిహారం చెల్లించే విషయంలో, అటు ఫ్యాక్టరీ విషయంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో మరోసారి రైతు ల చెవిలో పూలు పెట్టడానికి ఆదినారా యణరెడ్డి సిద్ధపడ్డారు. ఆమేరకు ఈసారి 4వాహనాలల్లో 200 మంది రైతులను అమరావతికి తీసుకెళ్లిన ఆయన 2018 మే1 సాయంత్రం ముఖ్యమంత్రితో భేటీ చేయించారు. కాగా, సీఎం చంద్రబాబు నోటనైనా ఖచ్చితమైన హామీ వస్తుందనుకున్న రైతులకు అక్కడ నిరాశే ఎదురైంది. ఫైలు పెండింగ్‌లో ఉందా... చూద్దాం... చేద్దాం...అంటూ ఆయన గారు దాటవేత ధోరణితో మాట్లాడారు. దీంతో  రైతులు ఉసూరుమంటూ వెనుదిరిగారు.

ఈ ప్రశ్నకు జవాబేదీ?
రెండు దశాబ్దాలుగా పేరుకుపోయిన తమ సమస్యలకు పరిష్కారం చూపాలని, ఆ తర్వాతే సదస్సు నిర్వహించుకోవాలంటూ బాధిత రైతులు 2016 సెప్టెంబర్‌ 9న ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును అడ్డుకుంటే.. నెలన్నర రోజు ల వ్యవధిలోనే వందలాది మంది పోలీ సు బలగాలను పిలిచి తుపాకీ నీడలో సదస్సు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్‌ అనుమతులు ఇవ్వటంలో ఎం దుకు ఇంత జాప్యం చేస్తుందన్న ప్రశ్నకు ఇటు అమాత్యుని వద్ద, అటు కంపెనీ యాజమాన్యం వద్ద  జవాబు దొరకడం లేదు. ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు తమకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా కనీసం ఫ్యాక్టరీ నిర్మిస్తే భూములు కోల్పోయినా వందలాది మందికి ఉద్యోగాలు, వేల మందికి ఉపాధి లభిస్తుందని రైతులు ఆశపడితే అందులో కూడా స్వార్థ ప్రయోజనాలను ఆశించి తమ నోట్లో మన్ను వేశారని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది ఎకరాలు భూములు కొని బీడుగా పెట్టి రైతుల జీవితాలతో 23 ఏళ్లుగా చెలగాటం ఆడుతోన్న ఏసీసీ యాజమాన్యం మెడలు వంచి ఫ్యాక్టరీ నిర్మింపజేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం... అనుమతులు కోసం కంపెనీ పెట్టుకున్న దరఖాస్తులు సైతం పెండింగ్‌లో ఉంచడం ఎంతవరకు సమంజసమని బాధిత రైతుల ప్రశ్నిస్తున్నారు. అమాత్యుని కమ్మని మాటలు విని విసిగి వేశారిన బాధిత రైతాంగం ఉద్యమబాట పట్టడానికి సిద్ధమవుతోంది. అప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును సరిదిద్దుకుంటుందో లేదో వేచిచూడాల్సిందే!

Advertisement
Advertisement