పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యత సర్పంచ్‌దే

AP Cabinet Meeting Ends Takes Key Decisions On Local Body Elections - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశానంతరం  రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చట్టంలో మార్పులు తీసుకువస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బు, మద్యం ప్రమేయం లేకుండా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమాలకు పాల్పడే వారిపై అనర్హత వేటు వేస్తామని… గరిష్టంగా మూడేళ్ళ వరకు జైలు శిక్ష కూడా పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి 5 రోజులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి 8 రోజులు గడువును విధించామని మంత్రి తెలిపారు. పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యత ఇకపై సర్పంచ్‌లదే ఉంటుందన్నారు. సర్పంచ్‌లు స్థానికంగా నివాసం ఉండేలా నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాలలో సర్పంచ్‌, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను ఎస్టీలకే కేటాయిస్తామన్నారు. తాగునీటి అవసరాలు, ప్రకృతి వైపరిత్యాల నివారణకై సర్పంచ్‌లకే పూర్తి అధికారాలు కట్టబెట్టినట్లు మంత్రి వెల్లడించారు.

ఓటర్లను ప్రలోభ పెడితే అనర్హత వేటు నిబంధన మున్సిపల్‌ ఎన్నికలకు కూడా వర్తిందని మంత్రి నాని హెచ్చరించారు. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్, ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ లిమిటెడ్  ఏర్పాటుకు కాబినెట్ ఆమోదం తెలిపిందని పేర్ని నాని వెల్లడించారు. జెన్కో ఆధ్వరంలో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు.రైతుల ఉచిత విద్యుత్‌ కోసం రూ.8వేల కోట్లు కేటాయించామని తెలిపారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కోసం రూ.1500 కోట్ల సబ్సిడీని చెల్లించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి నాని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top