ఉచిత విద్యుత్‌కు శాశ్వత భరోసా

AP Cabinet Green Signal For 10 MW Solar Power Project - Sakshi

వ్యవసాయానికి సోలార్‌ పవర్‌

10 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టుకు క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌

రైతన్నకు ఇక శాశ్వతంగా 9 గంటల విద్యుత్‌

ప్రాజెక్టు నిర్మాణ వ్యయ అంచనా రూ. 46 వేల కోట్లు

బీవోటీ పద్ధతిలో నిర్మాణ ప్రతిపాదనలు

సాక్షి, అమరావతి: వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పథకాన్ని శాశ్వతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 10 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టుకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలపడంతో పనుల్లో వేగం పెరగనుంది. త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సోలార్‌ ప్రాజెక్టు సమగ్ర నివేదిక ను సిద్ధం చేశారు. మెగా సౌర విద్యుత్‌ ప్రాజెక్టు వివరాలను గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ సీఎండీ సాయిప్రసాద్‌ శుక్రవారం ‘సాక్షి’కి వివరించారు.                

రెట్టింపు సబ్సిడీ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..
రాష్ట్రంలో మొత్తం 18.37 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా విద్యుత్‌ వినియోగ సామర్థ్యం 1.11 కోట్ల అశ్వశక్తి అంటే 8,300 మెగావాట్లు ఉంటుంది.

సీఎం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టగానే ఉచిత విద్యుత్తు సరఫరాను రోజుకు 7  నుంచి 9 గంటలకు పెంచారు.

వ్యవసాయానికి అందించే విద్యుత్‌ ఖర్చును ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో పంపిణీ సంస్థలకు అందిస్తోంది. టీడీపీ హయాంలో సబ్సిడీ తక్కువగా ఉంది. 2015–16లో రూ.3,186 కోట్లు ఉండగా 2018–19 నాటికిరూ.4 వేల కోట్లకు చేరింది. ఈ మొత్తంలోనూ గత ప్రభుత్వం పూర్తిగా చెల్లించకపోవడంతో డిస్కమ్‌లు అప్పుల్లోకి వెళ్లాయి. 2020–21లో వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీకి ప్రభుత్వం రూ.8,354 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ఇది రెట్టింపుకన్నా ఎక్కువే. 

వ్యవసాయ విద్యుత్‌ వాడకం ఏటా పెరుగుతోంది. కొత్త కనెక్షన్లకు డిమాండ్‌ నెలకొంది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే 2030–31 నాటికి వ్యవసాయ విద్యుత్‌కు ప్రభుత్వం రూ.17,819 కోట్లు సబ్సిడీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత మొత్తం ఇవ్వడంలో వెనక్కి తగ్గితే వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది ఏర్పడుతుంది.

ఢోకా లేకుండా సరఫరా
భవిష్యత్తు విద్యుత్‌ డిమాండ్‌పై దూరదృష్టితో ఆలోచించిన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వ్యవసాయానికి  ప్రత్యేకంగా చౌకగా లభించే విద్యుదుత్పత్తి అవసరమని నిర్ణయించి 10 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ. 46 వేల కోట్ల పెట్టుబడి అవసరమని అంచనా వేశారు. 

ఏపీఈఆర్‌సీ లెక్కల ప్రకారం సౌర విద్యుత్‌ ధర యూనిట్‌ రూ.2.90 వరకు ఉండవచ్చు. కాబట్టి 15 ఏళ్లపాటు సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసే వారికి యూనిట్‌కు రూ.2.90 వరకూ చెల్లించే వీలుంది.అనంతరం బీవోటి పద్ధతిలో నిర్మాణసంస్థకే అప్పగిస్తారు.   

త్వరలో పనులు ప్రారంభం...
‘10 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టి నాణ్యత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రభుత్వంపై సబ్సిడీ భారమూ తగ్గుతుంది. ఇందుకు అవసరమైన 50 వేల ఎకరాల భూమిని గుర్తించాం. త్వరలో పనులు ప్రారంభిస్తాం’ 
–సాయిప్రసాద్‌ (గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ సీఎండీ) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top