
ఏపీకి మరో 8 ఎమ్మెల్సీ సీట్లు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్థానాల సంఖ్యను 58కి పెంచుతూ ఏపీ పునర్విభజన చట్టాన్ని సవరించాలని కేంద్ర మంత్రిమండలి బుధవారం నిర్ణయం తీసుకుంది.
* పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం
* విభజన చట్టంలో ఏపీకి 50 స్థానాలే కేటాయించిన కేంద్ర సర్కారు
* పెంపు అమలులోకి రావాలంటే విభజన చట్టానికి సవరణ చేయాలి
* ఇప్పటికే మండలిలో 8 ఖాళీలు.. త్వరలో మరో 11 సీట్లు ఖాళీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్థానాల సంఖ్యను 58కి పెంచుతూ ఏపీ పునర్విభజన చట్టాన్ని సవరించాలని కేంద్ర మంత్రిమండలి బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో.. కౌన్సిల్‌లోని ఏయే స్థానాలు పెరుగుతాయనే అంశం చర్చనీయాంశమైంది. ఉమ్మడి రాష్ట్ర శాసనమండ లిలో 90 స్థానాలను విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ సమయంలో ఏపీకి 50, తెలంగాణకు 40 ఇచ్చారు. ఈ పంపిణీలో లోపాలు చోటుచేసుకున్నాయన్న విమర్శలు అప్పట్లోనే వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. దాన్నే యథాతథంగా విభజనచట్టంలోనూ పెట్టారు.
అసెంబ్లీ స్థానాల సంఖ్య ప్రకారం 175 మంది సభ్యులున్న ఏపీకి 58 ఎమ్మెల్సీ స్థానాలుండాలి. తెలంగాణకు 32 మాత్రమే కేటాయించాలి. 40 కన్నా తక్కువ సంఖ్యలో కౌన్సిల్ స్థానాలు ఉంటే ఆ మండలిని కొనసాగించడానికి వీల్లేదు. తెలంగాణ కౌన్సిల్‌ను యథాతథంగా కొనసాగించడం కోసం ఏపీకి దక్కాల్సిన 8 స్థానాలను తెలంగాణ కోటాలో వేసి 40 కి పెంచేయడంతో సమస్య ఏర్పడింది. ఇప్పుడు ఈ లోపాన్ని సవరించడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
విభజన చట్టానికి సవరణ చేయాలి...
అయితే.. ఏపీలో శాసనమండలి స్థానాలను పెంచాలంటే పార్లమెంటులో రాష్ట్ర విభజన చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తరువాతే ఏపీ కౌన్సిల్‌లో స్థానాలు పెరుగుతాయి. గురువారంతోనే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిపోయాయి. సవరణ బిల్లును ప్రవేశపెట్టాలంటే మళ్లీ 2015 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల వరకు ఆగకతప్పదు. ఈ లోగా సవరణ అమల్లోకి రావాలంటే కేంద్రం ఆర్డినెన్సును తేవలసి ఉంటుంది. కేంద్రం ఆర్డినెన్సునో, లేదా పార్లమెంటులో బిల్లునో ఆమోదించాక కౌన్సిల్‌లో సీట్ల సంఖ్య పెంపుపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపడుతుంది.
స్థానిక సంస్థల కోటాలో మరో మూడు స్థానాలు!
ప్రస్తుతం ఏపీ కౌన్సిల్‌లో 5 గ్రాడ్యుయేట్, 5 ఉపాధ్యాయ, 9 స్థానిక సంస్థల నియోజకవర్గాలు, 15 ఎమ్మెల్యే కోటా, 7 గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలున్నారు. వీటికి అదనంగా 8 స్థానాలు చేరనున్నాయి. ఈ ఎనిమిదింటిని ఏయే కోటాలో ఎన్ని పెంచుతారనేది తేలాల్సి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, శాసనమండలి అధికారులతో సంప్రదించి కోటాల వారీగా స్థానాలను పునర్విభజన చేయాలి. ఉమ్మడి రాష్ట్ర విభజనకు ముందు 13 జిల్లాల్లో స్థానిక సంస్థల మండలి స్థానాలు 20 ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో ఒకొక్కటి చొప్పున, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో రెండేసి చొప్పున మొత్తం 20 స్థానిక సంస్థల మండలి స్థానాలు ఉండేవి.
విభజనలో స్థానిక సంస్థల కోటా స్థానాలు ఆంధ్రప్రదేశ్‌కు 17 మాత్రమే కేటాయించడంతో 3 స్థానాలు తగ్గిపోయాయి. దీంతో రెండేసి స్థానాలకు ప్రాతినిధ్యం ఉన్న విశాఖ, కృష్ణా, చిత్తూరు జిల్లాలకు ఒకొక్క స్థానాన్ని తగ్గించారు. తూర్పు, పశ్చిమగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో మాత్రమే రెండేసి స్థానిక సంస్థల మండలి స్థానాలు ఉన్నాయి. ఇపుడు అదనంగా వచ్చే ఎనిమిదింటిలో మూడింటిని స్థానిక సంస్థల కోటాలో వేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇక టీచరు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో ఒకొక్కటి చొప్పున, ఎమ్మెల్యే కోటాలో రెండు పెరిగే అవకాశాలున్నాయని చెప్తున్నారు. అయితే ఇదంతా ఎన్నికల సంఘం చేపట్టే పునర్విభజన చర్యలను అనుసరించి ఉంటుందని మండలి వర్గాలు పేర్కొంటున్నాయి.
2019 నాటికి మండలి స్థానాలు 75
ఇదిలావుంటే.. ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాల సంఖ్యను అనుసరించి కౌన్సిల్‌లో స్థానాల సంఖ్య 58కి పెరుగుతున్నా 2019 నాటికి ఆ సంఖ్య 75కి చేరుకోనుంది. 2019 ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాల సంఖ్యను 225కి పెంచాలని ఏపీ విభజన చట్టంలోనే పేర్కొన్నందున ఆమేరకు శాసనమండలి స్థానాలూ పెరుగుతాయి. మరోవైపు.. 2015 మార్చి, ఏప్రిల్‌లలో శాసనమండలిలో ఖాళీల సంఖ్య భారీగా పెరగనుంది. ప్రస్తుతం కౌన్సిల్‌లో 50 స్థానాలకు గాను 41 మందే ఉన్నారు. 8 ఖాళీ ఉన్నాయి. ఇవి కాకుండా 2015లో ఎమ్మెల్యే కోటాలో 4, లోకల్ బాడీ కోటాలో 3, టీచర్ నియోజకవర్గాల్లో 2, గవర్నర్ కోటాలో 3 (ఇందులో షేక్ హుస్సేన్ ఇదివరకే రాజీనామా చేశారు) స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఖాళీలను భర్తీచేయాల్సి ఉంటుంది. ఆలోగానే అదనంగా పెరిగే 8 స్థానాల కేటాయింపు పైనా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే కనుక వాటినీ కలిపితే మొత్తం 27 స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారవర్గాలు వివరించాయి.
ఏపీ మండలి స్థానాలు 58కి పెంపు
విభజన చట్టం సవరణకు కేబినెట్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యుల స్థానాల సంఖ్యను 58కి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 175 ఉంది. రాజ్యాంగపరంగా ఇందులో మూడో వంతు సంఖ్యకు మించకుండా ఎమ్మెల్సీ స్థానాలను ఖరారుచేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 23(1), సెక్షన్23(2)(1)(ఎ) ప్రకారం 50 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు తాజాగా దీన్ని 58కి పెంచుతూ ఈ చట్టాన్ని సవరించాలని కేంద్రం నిర్ణయించింది.