‘ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు’

Alla Nani Speech In Legislative Council At Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డెంగ్యూ, వైరల్‌ జ్వరాలను అదుపు చేసేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని) అన్నారు. మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో డెంగ్యూ, వైరల్ జ్వరాల అంశంపై మంత్రి నాని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 ఆసుపత్రుల్లో డెంగ్యూ, వైరల్ జ్వరాల నిర్ధారణ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. జ్వరాల నివారణకు అవసరమైన మందులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 145 బ్లాడ్ బ్యాంకులు, 13 రక్త సేకరణ రవాణా వాహనాలు, 95 రక్త నిల్వ కేంద్రాలు ఉన్నాయని మంత్రి నాని వివరించారు. ప్రతిజిల్లాలో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఆసుప్రతి కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు. జ్వరాలు, ఇతర వ్యాధులపై ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాని పేర్కొన్నారు. అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ఎలిజా పరీక్షలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. జ్వరాలు, వ్యాధులు ప్రబలిన చోట్లకు వెంటనే వైద్య బృందాలను తరలించామని మంత్రి అళ్లనాని తెలిపారు.

రాష్ట్రంలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని)తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని ఆయన వెల్లడించారు. రెండువేల వ్యాధులను వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాతో అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. దశల వారీగా అన్ని జిల్లాల్లోనూ దీనిని అమలు చేస్తామని మంత్రి నాని స్పష్టం చేశారు. రూ.1000కి పైగా ఖర్చు అయ్యే చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ అనంతరం పోస్ట్ ఆపరేషన్‌ సాయంగా గరిష్టంగా రూ.5వేల వరకు చెల్లిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు ఆసుపత్రుల్లో కూడా వైద్య సేవలకు అనుమతి కల్పిస్తున్నామని మంత్రి నాని వ్యాఖ్యానించారు. పీహెచ్‌సీలను కూడా నాడు-నేడు కార్యక్రమంలో భాగం చేస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా దీనికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. పీహెచ్‌సీల్లో అన్ని వసతులును కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా వున్న వైద్యులు, సిబ్బందిని వచ్చే మే నాటికి భర్తీ చేస్తామని మంత్రి నాని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top