జిల్లాలో శుక్రవారం ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం 1,95,799 ఓట్లు కొత్తగా పెరిగాయి.
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్ : జిల్లాలో శుక్రవారం ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం 1,95,799 ఓట్లు కొత్తగా పెరిగాయి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఎన్నికల్లో భాగస్వాములను చేసే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఇటీవల నిర్వహించిన ఓటర్ల నమోదు కార్యక్రమానికి జిల్లా నుంచి మంచి స్పందన వచ్చింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం శుక్రవారం నాటికి జిల్లాలో 2,66,457 మంది కొత్త ఓటర్లు చేరారు. ఎన్నికల సంఘం పలు దఫాలుగా నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమంతో అనేక మంది ఓటర్లుగా చేరడానికి ముందుకొచ్చారు. ప్రత్యేకించి ఈ దఫా యువతను లక్ష్యం గా చేసుకుని నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఓటర్ల మార్పులు, చేర్పులకు, చిరునామాల మార్పులకు కూడా దీర్ఘ కాలం సమయం ఇచ్చారు. గతేడాది జనవరి 15వ తేదీ ప్రచురించిన ఓటర్ల తుది జాబితాలో జిల్లాలో 19,87,244 మంది ఓటర్లు ఉన్నారు. శుక్రవారం నాటికి కొత్తగా 2,66,457 మంది ఓటర్లు చేరగా, పాత జాబితాల్లోని 70,659 మందిని తొలగిం చారు. దీంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య 21,83,042కు చేరింది.